ఏపీ లో దానికోసమే కమలం ఆరాటం … ?

తెలంగాణ లో తమ పార్టీ దూకుడు ఇప్పుడు ఎపి లో కమలానికి మరింత బూస్ట్ ఇస్తున్నట్లే కనపడుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే పోయేదేముంది అనే ధోరణి తో [more]

Update: 2020-12-13 09:30 GMT

తెలంగాణ లో తమ పార్టీ దూకుడు ఇప్పుడు ఎపి లో కమలానికి మరింత బూస్ట్ ఇస్తున్నట్లే కనపడుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే పోయేదేముంది అనే ధోరణి తో పాటు పట్టుదలగా ఎపి లో ద్వితీయ స్థానం కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది కాషాయం. వర్షాలకు జాతీయ రహదారులే చిన్నాభిన్నంగా ఉన్నాయి. వందల రూపాయలు టోల్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ కూడా వాటి మరమ్మత్తులు చేయించలేకపోయినా రాష్ట్ర రాహదారుల తీరుపై బిజెపి విరుచుకుపడటం చర్చనీయం రాజకీయం. ప్రజలకు దగ్గరయ్యే అన్ని మార్గాలను ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తుంది. రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడిన వైనంపై కమలం అన్ని జిల్లాల్లో ఉద్యమం మొదలు పెట్టింది. వాస్తవానికి ఇలాంటి ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నిరసనలు వ్యక్తం చేసేది. అయితే ఆ పార్టీ అమరావతి, పోలవరం అనే అంశాలపైనే ప్రధానంగా పోరాటం చేస్తుంది. ఈ రెండు అంశాల తరువాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. అదే ఆ పార్టీని జనానికి మరింత దూరం పెడుతుంది. దాంతో కమలం ఆ లోటు భర్తీ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తుంది.

అదొక్కటే కాపాడదని …

హిందూ ఓటర్లను ఆకట్టుకునే అంశాలపైనే కాకుండా ఇతర సమస్యలపైనా పోరాడాలని అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో దూకుడు పెంచింది కాషాయం. చింతకాయలు రాలేటప్పుడే మంత్రాలు చదవాలనే సిద్ధాంతాన్ని కూడా బిజెపి అనుసరిస్తుంది. రాష్ట్రం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణానికి ఎపి సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియలు కార్యరూపం ధరించడానికి కొంత సమయం పడుతుంది. సరిగ్గా ఆ విషయం గమనించి రోడ్ల కోసం రోడ్డెక్కి నినదించింది కమలం. రోడ్ల నిర్మాణం జరిగాక ఈ క్రెడిట్ సహజంగానే కమలం ఖాతాలోకి పోనుంది. ఇలా పలు అంశాలను గుర్తించి వాటిపై ఉద్యమాలు నిర్మిస్తూ బిజెపి స్పీడ్ పెంచేసింది.

అక్కడ వేరు ఇక్కడ వేరు …

అయితే తెలంగాణ వేరు ఆంధ్రా వేరన్నది కమలానికి తెలియనిది కాదు. ఎపి కి కాంగ్రెస్ కన్నా బిజెపి నే ఎక్కువ అన్యాయం చేసిందన్న ఫోకస్ ను గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన బాగా జనంలోకి తీసుకువెళ్లాయి. రాష్ట్ర విభజన లోను బిజెపి పాత్రను ఎపి వాసులు మరిచిపోలేదు. కాంగ్రెస్ తోపాటు బిజెపి అన్యాయం లో ప్రాధాన పాత్ర పోషించిందనే ప్రజలు అత్యధికులు నమ్ముతున్నారు. దీనికితోడు పోలవరం ప్రాజెక్ట్ అంశంలో కేంద్రంలో మోడీ సర్కార్ చేస్తున్న ప్రకటనలు లేఖలు ఎపి కి బిజెపి చేసేదేమి ఉండదన్న సంకేతాలనే బలంగా పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో గట్టి నమ్మకం కాషాయంపై కలగాలంటే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహరహం కృషి చేయాలి. అలాగే ఆ అంశం పబ్లిక్ టాక్ గా మారాలి. ఇదేమి చిన్న విషయం కాదు. దీనికోసం కమలం తలకిందులుగా తప్పస్సే చేయాలిసి ఉంది. మరి ఇకపై ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి.

Tags:    

Similar News