పాహిమాం…అంటే గెలుస్తారా……??

కేరళలో లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మంచి ఊపుమీద ఉంది. గత ఎన్నికలకంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని [more]

Update: 2019-03-15 17:30 GMT

కేరళలో లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మంచి ఊపుమీద ఉంది. గత ఎన్నికలకంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని అధికార పక్షం పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేరళలో ఉన్న మొత్తం 20 పార్లమెంటు స్థానాలకు అధికార పక్షం ఎల్డీఎఫ్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారాన్ని కూడా ఉధృతం చేసింది.

యూడీఎఫ్ బలంగా….

ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూడా ఈ నెల 16వ తేదీన అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ ఎల్ డీఎఫ్ కంటే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి. యూడీఎఫ్ కు మాత్రం 12 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోణీ కూడా కొట్టలేదు. కొద్దోగొప్పో కాంగ్రెస్ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ ఒకటి.

అయ్యప్ప మీదే ఆశలు…..

అయితే ఇటీవల జరిగిన పరిణామాలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది. శబరిమల వ్యవహారాన్ని సెంటిమెంట్ గా చూపుతూ ముందుకు వెళుతుంది. శబరిమలలో మహిళ భక్తుల ప్రవేశంపై చెలరేగిన వివాదాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో ఉంది. దీని ఫలితంగా కనీసం నాలుగు నుంచి ఐదు స్థానాలను గెలుచుకుంటామని భారతీయ జనతా పార్టీ ధీమాగా ఉంది. హిందువుల ఓట్లను తమకు అనుకూలంగా మలచుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది.

వరదల దెబ్బకు….

ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు మాత్రం ఇక్కడ బీజేపీకి అవకాశాలు శూన్యమనే చెబుతున్నాయి. తుపాను, వరదలతో కేరళ రాష్ట్రం అల్లాడి పోతే కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం చేసిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. కేరళను ఆదుకోవడంలో మోదీ పక్షపాతి వైఖరిని ప్రదర్శించారన్న ఆరోపణలను పినరయి విజయన్ చేస్తున్నారు. కేరళ కోలుకోవడానికి అవసరమైన సాయం చేసేందుకు మోదీకి మనసు రాలేదని ఆయన చెప్పుకొస్తున్నారు. బీజేపీ మాత్రం తమను అయ్యప్ప రక్షిస్తాడన్న నమ్మకంతో ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కమలం పార్టీ పై అక్కడ ప్రజలు గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద పినరయి విజయన్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు వెళుతున్నారు.

Tags:    

Similar News