మంచి ఛాన్స్ మిస్సవుతున్న ఉమ

ఆయ‌న‌కు మంచి వాగ్దాటి వుంది. ఏ విష‌యంపైనైనా ఆయ‌న నోరు విప్పితే.. వైసీపీ నేత‌ల‌కు చ‌లి జ్వరం ఖాయం. రికార్డులు ముందు పెట్టుకుని ప‌క్కా వాద‌న వినిపించ‌డంలో [more]

;

Update: 2020-12-26 03:30 GMT

ఆయ‌న‌కు మంచి వాగ్దాటి వుంది. ఏ విష‌యంపైనైనా ఆయ‌న నోరు విప్పితే.. వైసీపీ నేత‌ల‌కు చ‌లి జ్వరం ఖాయం. రికార్డులు ముందు పెట్టుకుని ప‌క్కా వాద‌న వినిపించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. చాలా లేటుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. సీనియర్లను మించిన వాద‌నా ప‌టిమ‌తో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించారు. ఆయ‌నే విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వర‌రావు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బొండా ఉమామ‌హేశ్వర‌రావు 2014లో ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వైసీపీ నేత‌ల‌కు చెక్కలు చూపించారు. ఇది ఆయ‌న‌కు ప్లస్ అయింది. ఇక‌, కాపుల స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి.. షార్ప్ షూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ప్రాధాన్యత ఇచ్చి మరీ……

బొండా ఉమామ‌హేశ్వర‌రావు దూకుడును ప్రోత్సహించేందుకు చంద్రబాబు కూడా ఆయ‌న‌కు అప్పట్లో టీటీడీ బోర్డు స‌భ్యత్వం ఇచ్చారు. వాస్తవానికి మంత్రి ప‌ద‌విని ఆశించినా.. స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌లేదు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కేవ‌లం పాతిక ఓట్ల తేడాతో బొండా ఉమామ‌హేశ్వర‌రావు ఓడిపోయారు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. అయితే ఇటీవ‌ల టీడీపీలో ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి పొలిట్ బ్యూరో స‌భ్యత్వం ల‌భించింది. నిజానికి పార్టీలో పాతికేళ్ల సీనియార్టీ ఉన్నవారికి మాత్రమే ఇస్తున్న ప‌ద‌వి. అయినా.. చంద్రబాబు బొండా ఉమా దూకుడును గ‌మ‌నించి.. చ‌క్కని అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న కూడా బాగానే త‌న వాయిస్ వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో పేద‌ల‌కు ఇళ్ల విష‌యంలో చేసిన కామెంట్లు వైసీపీలో చ‌ర్చనీయాంశం అయ్యాయి.

ఎప్పుడో తప్ప స్పందించరని….

కేవ‌లం 4 ల‌క్షల ఇళ్లకు సంబంధించి కేసులు కోర్టులో ఉంటే.. మొత్తం 30ల‌క్షల మందికి ఎందుకు ఆపేశారంటూ బొండా ఉమామ‌హేశ్వర‌రావు వేసిన ప్రశ్న వైసీపీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఒక్కటే కాదు.. అనేక అంశాల్లో ఆయ‌న రికార్డుల వారీగా స్పందించి వైసీపీ నేత‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే టీడీపీ సీనియ‌ర్లు బొండా ఉమామ‌హేశ్వర‌రావు పై ఒకింత అసంతృప్తితో ఉన్నారు. “మా వోడికి మంచి వాయిస్ ఉంది. ఆయ‌న వాయిస్ చూసి మేమే ఆశ్చర్యప‌డ‌తాం. కానీ, ముహూర్తం చూసుకుని మైకు ముందుకు రావ‌డ‌మే మాకు ఇబ్బందిగా మారింది. ఎప్పుడో త‌ప్ప స్పందించ‌డం లేదు.

ఇప్పటికీ ప్రజలు…..

ఇలాంటి దూకుడు ఉన్న యువ నాయ‌కులు.. నిత్యం మీడియాలో ఉండాలి!“ అని విజ‌య‌వాడ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ త‌న వ్యాఖ్యగా చెప్పుకొచ్చారు. బొండా ఉమా మ‌హేశ్వర‌ రావు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇది నిజ‌మేన‌ని అనిపిస్తుంది. మంచి వాయిస్ ఉన్న బొండా ఉమామ‌హేశ్వర‌రావు నిత్యం మీడియాలో ఉంటే.. పార్టీ మంచి జోరుగా ముందుకు సాగ‌డం గ‌మ‌నార్హం. కొస‌మెరుపు ఏంటంటే.. పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయినా.. ఇప్పటికీ సెంట్రల్ జ‌నాలు.. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. బొండా వ‌ద్దకే ప‌రుగులు పెడుతున్నారు. మ‌రి అలాంటి నాయ‌కుడు అప్పుడ‌ప్పుడు కాకుండా.. నిత్యం ప్రజ‌ల వ‌ద్దకు రావాల‌నేది ఇక్కడి వారి సూచ‌న. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News