సత్తిబాబు సలసల ఎందుకంటే?

వైసీపీలో ఉన్న సీనియర్ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. చెప్పాలంటే ఆయన సీనియర్ మోస్ట్ నేత. మూడు దశాబ్దాల రాజకీయం ఆయన సొంతం. 89 ప్రాంతంలో విజయనగరం [more]

;

Update: 2019-11-09 13:30 GMT

వైసీపీలో ఉన్న సీనియర్ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. చెప్పాలంటే ఆయన సీనియర్ మోస్ట్ నేత. మూడు దశాబ్దాల రాజకీయం ఆయన సొంతం. 89 ప్రాంతంలో విజయనగరం కోపరేటివ్ బ్యాంక్ రాజకీయాల ద్వారా వెలుగులోకి వచ్చిన బొత్స సత్యనారాయణ తరువాత నెమ్మదిగా జిల్లా నుంచి ఎగబాకి రాష్ట్ర నాయకుడు అయ్యారు. బొత్స సత్యనారాయణ కు వాక్పటిమ పెద్దగా లేకపోయినా సమయానుకూలంగా ప్రత్యర్ధుల మీద విమర్శలు చేయడంతో దిట్ట. మరో వైపు రాజకీయం గాలిని గమనించి దానికి తగిన విధంగా ఎత్తులు వేయడంలోనూ నేర్పరి. ఇలా బొత్స సత్యనారాయణ చాలా వేగంగానే ఎదిగిపోయారని చెప్పాలి. ఆయన గురువు సాంబశివరాజు మంత్రి కావడానికి దశాబ్దాల పాటు నిరీక్షించాల్సివచ్చింది. అదే బొత్స సత్యనారాయణ తక్కువ సమయంలోనే వైఎస్సార్ చలువతో మంత్రి పదవిని అందుకున్నారు. సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగారు కూడా. ఇక బొత్స సత్యనారాయణ పీసీసీ ప్రెసిండెంట్ గా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. ఆయనకు త్రుటిలో ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది. ఇపుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నా ఆయనలో రగులుతున్న అసంతృప్తికి ఈ నేపధ్యమే ఓ కారణం.

జూనియర్ గా ట్రీట్ చేస్తున్నారట….

బొత్స సత్యనారాయణ కు జగన్ మంత్రివర్గంలో కచ్చితంగా పదవి ఖాయమని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే ఆయన మంత్రి అయ్యారు. కీలకమైన మునిసిపల్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీలో అయిదుగురు డిప్యూటీ సీఎంలను జగన్ నియమించారు. అందులో బొత్స సత్యనారాయణ కు కూడా ఒక పదవి ఇస్తే బాగుండేది అన్న భావన ఆయనతో పాటు అనుచరుల్లోనూ ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రా జిల్లాల్లో సీనియర్ నేతగా, బీసీల నాయకుడిగా బొత్స ఉన్నారు. అదే సమయంలో విజయనగరం జిల్లా మొత్తం సీట్లను ఆయన గెలిపించుకుని వచ్చారు. కడప తరువాత విజయనగరం జిల్లాలోనే ఈ మ్యాజిక్ జరిగింది. దాంతో సహజంగానే తనకు ప్రయారిటీ ఇస్తారని బొత్స సత్యనారాయణ ఎదురుచూశారు. కానీ తనకంటే వయసులోనూ, అనుభవంలోనూ చిన్న అయిన పుష్ప శ్రీవాణిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేసి తనను పక్కన పెట్టడం పట్ల బొత్స సత్యనారాయణ ఆవేదన నాడే వ్యక్తం చేశారు. దానికి తోడు ఉత్తరాంధ్రా జిల్లాల్లో పార్టీ పరంగా కూడా బొత్స సత్యనారాయణ వేలూ కాలూ పెట్టకుండా చేశారని కూడా ఆయన మధనపడుతున్నారట.

దాచుకోవడంలేదుగా…

విశాఖ జిల్లాకు తరచూ వచ్చిపోతూ ఉన్న జగన్ కుడిభుజం విజయసాయిరెడ్డి మొత్తం ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన చెవిన పడకుండా ఏ చిన్న విషయమూ జరగదు, ఆయన వస్తే మూడు జిల్లాల నుంచి నేతలంతా వచ్చి కలుస్తారు, దీంతో బొత్స సత్యనారాయణ కు పార్టీపరంగా కూడా ప్రాధాన్యత లేదన్న బాధ ఉందని అంటున్నారు. మరో వైపు జనసేన పవన్ కళ్యాణ్ లాంటి వారు రెచ్చగొట్టడానికి అన్నట్లుగా బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కావాల్సిన వారు ఇలా మంత్రి పదవి తీసుకుని వైసీపీ కొమ్ము కాస్తున్నారంటూ చేస్తున్న కామెంట్స్ కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో బొత్స సత్యనారాయణ తాను సీనియర్ నేతనని ఒకటికి రెండు మెట్లు దిగి మరీ వైసీపీలో చేరానని పదే పదే చెప్పుకుంటున్నారు.

జగన్ కనుక ఆలోచిస్తే…

దీని మీదనే ఇపుడు వైసీపీలో కూడా చర్చ సాగుతోంది. బొత్స సత్యనారాయణ అంత బాధపడి, బెంగపడి వైసీపీలో ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న కూడా ఆ పార్టీ నేతల నుంచి వస్తోంది. జగన్ బొత్స సత్యనారాయణకు మర్యాద, గౌరవం ఇస్తున్నారని వారు అంటున్నారు. గిరిజన మహిళా కోటా కిందనే పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఇక బొత్స సత్యనారాయణ వరకూ ఆయన రాజకీయానికి ఎవరూ అడ్డు కూడా కాదని అంటున్నారు. రాజధాని వంటి కీలకమైన విషయాల్లో బొత్స సత్యనారాయణనే జగన్ నమ్మి బాధ్యతలు అప్పగించారని గుర్తు చేస్తున్నారు. ఎంతో మంది సీనియర్లు పార్టీలో ఉన్నా వారికి కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదని కూడా చెబుతున్నారు. మరి బొత్స సత్యనారాయణ ఇలా బాహాటంగా తన ఆవేదనని పదే పదే వెళ్ళగక్కితే జగన్ వేరే నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బంది పడాల్సి వుంటుందని కూడా అంటున్నారు. మరి బొత్స సత్యనారాయణ ఈ సమీకరణలు ఆలోచించుకుంటున్నారా.

Tags:    

Similar News