ఆదాయమే అసలు సమస్య..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివిధ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ఉద్దేశించింది. ముఖ్యంగా కోవిడ్ వంటి కష్టకాలంలో ఏదో రూపేణా ప్రజల చేతిలో నిధులు ఉండాలనే ఆర్థికనిపుణుల [more]

Update: 2021-05-22 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివిధ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ఉద్దేశించింది. ముఖ్యంగా కోవిడ్ వంటి కష్టకాలంలో ఏదో రూపేణా ప్రజల చేతిలో నిధులు ఉండాలనే ఆర్థికనిపుణుల సూచనలకు అద్దం పట్టే విధంగానే తీర్చిదిద్దారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవసరాల కంటే సంక్సేమ పథకాలకే పెద్ద పీట వేశారు. రాజకీయ అజెండాకే మూడో ఏడాది బడ్జెట్ పద్దులోనూ అగ్ర తాంబూలమిచ్చారు. మౌలిక వసతుల మెరుగుదల, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించే పెట్టుబడి వ్యయం మామూలుగానే కుదించుకుపోయింది. రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శలు ఎప్పుడూ ఉండేవే. కానీ ఆదాయం లేకుండా ఇంతపెద్ద బడ్జెట్ ను ఎలా అమలు చేస్తారనే అంశంపై ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉన్నట్టు కనిపించదు. ఆదాయం రాకపోతే పద్దును సవరించుకోవచ్చును అన్న ధీమా కావచ్చు. గత ఏడాది చూపించిన బడ్జెట్ లోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేరకు కోత పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన రెండులక్షల ముప్ఫైవేల కోట్ల పద్దు ఎంతవరకూ సాకారమవుతుందనేది అనుమానాస్పదమే.

సంతృప్తికరమైన సంక్షేమం..

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఫస్టు ప్రయారిటీ సంక్సేమ పథకాలే. నవరత్నాలు అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ నవరత్నాలను మించి కొత్త కొత్త పథకాలను సైతం రూపకల్పన చేశారు. సమాజంలోని అన్నివర్గాలకు ప్రభుత్వం చేరువ కావాలి. అందుకు నగదు బదిలీని మించిన దగ్గర దారి లేదనేది ప్రభుత్వ బడ్జెట్ణను చూస్తుంటే సులభంగానే అర్థమైపోతుంది. పేదరికానికి సంబంధించి ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఒకవేళ ఆ పద్దులోకి రాకపోతే కులాలవారీ కార్పొరేషన్ల ద్వారా నిధుల పంపిణీ ఏర్పాట్లు, అందులోనూ ఎక్కడైనా మిస్ కాకుండా చూసుకోవడానికి వృత్తుల వారీ నగదు సాయాలు పకడ్బందీగానే అమలు చేస్తున్నారు. మతాలను కూడా వదిలిపెట్టకుండా అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకూ ప్రత్యేక గౌరవ వేతనాలు అందిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వాన్ని ఏ ఒక్క వర్గమూ వేలెత్తి చూపడానికి వీల్లేని విధంగా బిగించేశారు. ఈ పద్దుల మొత్తం ఈ ఏడాది దాదాపు 50వేల కోట్ల రూపాయలు. కానీ వీటన్నిటికీ నిధులు సమకూర్చుకోవడం భవిష్యత్తులో చాలా కష్టమవుతుందనేది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఏ ఒక్క సంవత్సరం ప్రభుత్వం వీటి అమలులో ఇబ్బంది పడినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చిన రైతు రుణమాఫీ దీనికి పెద్ద ఉదాహరణ. రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేక టీడీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎన్నికల్లో దారుణ ఫలితాలను చవి చూసింది.

పెరిగిన పద్దులు..

నేలవిడిచి సాము చేయడం ప్రభుత్వాలకు కొత్త కాదు. బడ్జెట్ పద్దు ఘనంగా కనిపించాలనే లక్ష్యంతో వాస్తవిక ఆదాయంతో సంబంధం లేకుండా అంకెలను వండి వార్చారు. గత ఆర్థిక సంవత్సరం 2020-21లొ పన్ను రాబడి 57 వేల కోట్లరూపాయలు మాత్రమే ఉంది. ఈ ఏడాది దానిని 85వేల కోట్ల కు పెంచి చూపించేశారు. గత ఏడాది కేంద్ర సాయం 32వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దానిని ఈ ఏడాది 57వేలకోట్లకు పైగా వస్తుందని అంచనా వేసేశారు. ఈ రెండు పద్దుల్లోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల వరకూ వాస్తవ సంఖ్యలను పెంచేశారు. అబివృద్ధి దాయకమైన ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబం పెట్టుబడి వ్యయం. కనీసం మూడింట ఒక వంతు మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చి స్తే రాష్ట్ర ఆదాయం మెరుగుపడుతుంది. ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. రెండులక్సల ముప్ఫైవేల కోట్ల బడ్జెట్ లో కనీసం 76 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం పెట్టాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం 31 వేల కోట్లకే ఈ పద్దు పరిమితం చేశారు. గత ఏడాది కూడా 30 వేల కోట్లు పెట్టారు. కానీ అందులో 19 వేల కోట్లే ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ఖర్చు సజావుగానే చూపిస్తున్నారు. ఖర్చు పెడుతున్నారు. పెట్టుబడి నిధులు, వ్యయం వచ్చేటప్పటికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే తంతును ఈ బడ్జెట్ ప్రతిబింబించింది.

కష్టాల కొలిమి…

కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేసి పప్పు కూడు తినడంలో పోటీ పడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు మినహాయింపు కాదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ , మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఆదాయ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రతి ఏటా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఐటీ, పరిశ్రమలు, సేవారంగం అంతంతమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశాలు లేవు. వ్యవసాయ రంగంపై పన్నులు వేయడమూ సాధ్యం కాదు. అందువల్ల ప్రజలే బడ్జెట్ భారాన్ని అధికమొత్తాల్లో కొత్త పన్నుల రూపంలో భరించాల్సి రావచ్చు. ఆంధ్రప్రదేశ్ అప్పులు మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటున్నాయి. అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 37శాతం రుణాల పద్దు ఉంటుందన్నమాట. ఇది 20 శాతానికి పరిమితం కావాలనేది ఆర్థిక వేత్తల సూచన. 25శాతం దాటిందంటే ప్రమాదఘంటికలు మోగుతున్నట్లే. తాజా బడ్జెట్ లోనూ 50 వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. 2025 నుంచి రుణాలకు వడ్డీలు, వాయిదాల కింద ఏటా రాష్ట్రం 50వేల కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ పద్దు 20 వేల కోట్ల వరకూ ఉంది. ఆర్థిక క్రమశిక్షణను, ఆదాయం పెరిగే మార్గాలను వెదుక్కోకుండా ప్రభుత్వాలు బడ్జెట్ లను రూపకల్పన చేస్తే భవిష్యత్తు భయానకంగా మారుతుంది. ఉద్యోగుల జీతాలకు, అప్పుల చెల్లింపులకే ప్రభుత్వం పరిమితం కావాల్సి ఉంటుంది. ఉదారంగా రూపొందించిన సంక్షేమ పథకాలకు సైతం నిధులు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News