బుగ్గ‌న స్పీడ్ కి బ్రేక్ వేస్తారా..?

గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో స‌త్తా చాట‌లేక‌పోయిన తెలుగుదేశం పార్టీ ఈసారి చేర‌క‌ల‌తో బ‌లంగా క‌నిపిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో ఆ [more]

;

Update: 2019-03-18 09:30 GMT

గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో స‌త్తా చాట‌లేక‌పోయిన తెలుగుదేశం పార్టీ ఈసారి చేర‌క‌ల‌తో బ‌లంగా క‌నిపిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో ఆ పార్టీ గ‌తం కంటే బ‌లంగా త‌యారైంది. ఇక‌, కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేర‌డంతో ఆ పార్టీకి జిల్లాలో మ‌రింత ప‌ట్టు ల‌భించింది. సుదీర్ఘ రాజ‌కీయ వైర‌మున్న కేఈ, కోట్ల కుటుంబాలు వైరం మ‌రిచి చేతులు క‌లిపి ఒకే పార్టీలో ప‌నిచేస్తున్నాయి. దీంతో ఈసారి క‌ర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండ‌ద‌ని, మెజారిటీ స్థానాల‌ను ద‌క్కించుకుంటామ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాగా ఉన్నారు. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకున్న స్థానాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన టీడీపీ క‌చ్చితంగా ఆ స్థానాలు కైవ‌సం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా త‌మ ప్ర‌భుత్వం తీవ్రంగా విమ‌ర్శలు గుప్పిస్తూ కొర‌క‌రాని కొయ్య‌గా మారి వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న డోన్ అసెంబ్లీ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

కేఈ కుటుంబానికి కంచుకోట‌

డోన్ నియోజ‌క‌వ‌ర్గం కేఈ, కోట్ల కుటుంబాల‌కు కంచుకోట‌. 1978 నుంచి 2014 వ‌ర‌కు డోన్ నియోజ‌క‌వ‌ర్గం ఈ రెండు కుటుంబాల చేతుల్లోనే ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగానే ఈ రెండు కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయ వైరం కూడా న‌డించింది. కేఈ కృష్ణ‌మూర్తి డోన్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆయ‌న సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. కోట్ల కుటుంబం నుంచి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి ఒకసారి ఇక్క‌డి నుంంచి ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. కోట్ల సుజాత‌మ్మ రెండుసార్లు పోటీ చేసి ఒకసారి విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అటు కేఈ కుటుంబానికి, ఇటు కోట్ల కుటుంబానికి మంచి ప‌ట్టుంది. ఇటీవ‌ల కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరేముందు కూడా కోట్ల సుజాత‌మ్మ‌కు డోన్ టిక్కెట్ ఇవ్వాల‌ని కోరారు. కానీ, కేఈ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో కేఈ ప్ర‌తాప్ కు ఈ టిక్కెట్ ను కేటాయించారు చంద్ర‌బాబు. దీంతో బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డితో కేఈ ప్ర‌తాప్ త‌ల‌ప‌డ‌నున్నారు.

రెండు వ‌ర్గాలు క‌లిస్తే టీడీపీదే విజ‌యం..?

బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి త‌క్కువ‌కాలంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. స్వంత నిధుల‌తో కొన్ని అభివృద్ధి ప‌నులు జ‌రిపారు. అయితే, పీఏసీ ఛైర్మ‌న్ గా ఉన్నందున ఇత‌ర బాధ్య‌త‌ల వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయారు. పార్టీ బ‌లం, రాష్ట్ర స్థాయి నేత‌గా ఎద‌గ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే బ‌ల‌మైన రెండు కుటుంబాలు ఒక్క వేదిక‌పైకి రావ‌డం ఇక్క‌డ ఆ పార్టీకి బాగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ రెండు కుటుంబాల‌కు వ‌ర్గాలుగా ఉన్న వారు క్షేత్ర‌స్థాయిలో క‌లిసి ప‌నిచేస్తే విజ‌యం సాధించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కానీ అనేక ద‌శాబ్దాలుగా శ‌త్రువుల‌గా ఉన్న క్యాడ‌ర్ నాయ‌కులు క‌లిసినంత సులువ‌గా క‌లుస్తార‌ని చెప్పాలేం. కేఈ కుటుంబానికి ఉన్న బ‌లం, ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ప‌నులు తెలుగుదేశం పార్టీకి సానుకూల అంశాలుగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికైతే బుగ్గ‌న బ‌లంగానే క‌నిపిస్తున్నా కేఈ ప్ర‌తాప్ కు కూడా విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

Tags:    

Similar News