గంటా ఫ్రీ అయిపోయినట్లేనా

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రూట్ క్లియర్ అయినట్లేనా అన్న చర్చ ఇపుడు టీడీపీతో పాటు బయట కూడా సాగుతోంది. గంటా ఏడున్నరేళ్ల [more]

Update: 2019-07-26 14:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రూట్ క్లియర్ అయినట్లేనా అన్న చర్చ ఇపుడు టీడీపీతో పాటు బయట కూడా సాగుతోంది. గంటా ఏడున్నరేళ్ల పాటు మంత్రిగా అధికారాన్ని అనుభవించిన నేత. విశాఖ జిల్లా రాజకీయలలో తిరుగులేని నాయకునిగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో తొలిసారి వేసుకున్న అంచనా ఇలా తప్పింది. పైగా ఆయన ఇంతవరకూ అతి తక్కువ మెజారిటీతో గెలిచిన దాఖలాలు లేవు. ఈ రెండు విషయాలతో ఆయన కలత చెంది చాన్నాళ్ళుగా మౌనమే తన భాష అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన స్థాయికి తగినట్లుగా పదవి ఉంటేనే తప్ప ముఖం చూపించకూడదని భావించారో ఏమో కానీ అందుకోసం ఆయన పార్టీలోనే ఉంటూ గట్టిగానే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఆశలు అడియాశలు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని ఆయన మరో సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కి కట్టబెట్టారు. దాంతో గంటా శ్రీనివాసరావు తరువాత అడుగు ఎటువైపు అన్న చర్చ ఇపుడు జోరుగా సాగుతోంది.

మొహమాటాలు లేవుగా….

ఇక టీడీపీలో గంటా శ్రీనివాసరావు ఇన్నాళ్ళూ కొనసాగడానికి ఆయనకంటూ ప్రాముఖ్యత లభిస్తుందని భావించడం వల్లనే అంటారు. తనని చంద్రబాబు విశ్వసించినట్లైతే తన సేవలను వినియోగించుకోదలిస్తే విపక్షానికి వచ్చే ఒకే ఒక పోస్ట్ ని తనకు ఇస్తారని గంటా శ్రీనివాసరావు వూహించారు. క్యాబినేట్ ర్యాంక్ హోదా కలిగిన ఆ పదవిలో ఉంటే కొంతైనా ఓటమి భారాన్ని దిగమింగుకుని పార్టీ కోసం పనిచేయాలని గంటా శ్రీనివాసరావు అనుకున్నారంటారు. ఏపీలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన తనకు తప్పకుండా ఆ అవకాశం, గౌరవం చంద్రబాబు ఇస్తారని కూడా గంటా గట్టిగా నమ్మారు. ఏదైతేనేం ఇపుడు ఆ పదవి చేజారిపోయింది. ఇక టీడీపీలో పదవులు వచ్చే అవకాశాలూ ఎటూ లేవు. ఎందుచేతంటే కేవలం 23 మంది ఎమ్మెల్యేలు కల్గిన పార్టీకి ఎమ్మెల్సీ రాదు, రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కదు. అందువల్ల అయిదేళ్ల పాటు పార్టీలో చేతులు ముడుచుకుని కూర్చోవడమే. ఆ తరువాత ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఎలాగ ఉంటుందో ఏమిటో. మరి ఈ లెక్కలు తెలియని వారు కాదు గంటా శ్రీనివాసరావు. అందుకే ఆయన ఇపుడు ఎటువంటి మొహమాటాలు పెట్టుకోకుండా భవిష్యత్తు రాజకీయాల గురించి ఆలొచిస్తారని అంటున్నారు.

అడుగు ఎటువైపు….?

గంటా శ్రీనివాసరావు మనసు మాత్రం ఎపుడూ రాష్ట్ర రాజకీయాల వైపే ఉందన్నది వాస్తవం. ఆయన ఎంపీగా మొదటిసారి పోటీ చేసినప్పటికీ ఎమ్మెల్యేగానే తరువాత పోటీ చేస్తూ వచ్చారు. ఇపుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది అందువల్ల గంటా శ్రీనివాసరావు మొదటి ప్రయారిటీ వైసీపీనేనని అంటున్నారు. ఆ పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చునని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కుదరకపోతే బీజేపీ వైపు కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే అక్కడ కూడా తనకు ఏపీ రాజకీయాలలో తగిన ప్రాధాన్యత దక్కితేనే గంటా శ్రీనివాసరావు జంప్ చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు ఇపుడు స్వేచ్చా జీవిగా ఉన్నారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ అడ్డుపెట్టే పరిస్థితి కూడా ఉండదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News