మన కంత సీన్ లేదు… పీఛే ముడ్
తాము లేస్తే భూనబోంతరాళాలు దద్దరిల్లి పోతాయని చెబుతుంటారు తెలుగు నాయకులు. కానీ లేవరు. అన్నీ కలిసొచ్చి అప్పనంగా చాన్సు వస్తే తామున్నామంటారు. ప్రతికూలత కనిపిస్తే పలాయనం చిత్తగిస్తారు. [more]
తాము లేస్తే భూనబోంతరాళాలు దద్దరిల్లి పోతాయని చెబుతుంటారు తెలుగు నాయకులు. కానీ లేవరు. అన్నీ కలిసొచ్చి అప్పనంగా చాన్సు వస్తే తామున్నామంటారు. ప్రతికూలత కనిపిస్తే పలాయనం చిత్తగిస్తారు. [more]
తాము లేస్తే భూనబోంతరాళాలు దద్దరిల్లి పోతాయని చెబుతుంటారు తెలుగు నాయకులు. కానీ లేవరు. అన్నీ కలిసొచ్చి అప్పనంగా చాన్సు వస్తే తామున్నామంటారు. ప్రతికూలత కనిపిస్తే పలాయనం చిత్తగిస్తారు. కనీస పోరాట పటిమను కనబరచరు. జాతీయంగా అయిదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైన అవకాశం చేజిక్కింది. రెండు జాతీయ పార్టీలను బోనులో నిలబెట్టే మహదవకాశం లభించింది. జాతీయ పార్టీల పెత్తందారీ వైఖరికి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టే చాన్సు దొరికింది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ బలమైన ప్రాంతీయ పార్టీలకు నైతిక మద్దతు ప్రకటించే చాయిస్ వచ్చింది. కానీ మన తెలుగు పెద్దలు కిమ్మనడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న ఊసే తమకు తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. జాతీయ రాజకీయాలతో తమకు సంబంధమే లేదన్నట్లు మౌనం వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. జాతీయంగా చక్రం తిప్పుతామంటూ ఇతర రాష్ట్రాలకు పిలవని పేరంటంగా వెళ్లి మరీ వచ్చారు. కానీ ఆయా రాష్ట్రాలకు అవసరం వచ్చినప్పుడు అటువైపు తొంగి చూడటం లేదు. తమ పార్టీలకు, తమకు వ్యక్తిగతంగా ఎటువంటి తంటా వచ్చిపడుతుందోనని ముందు జాగ్రత్త పడిపోయారు.
జాతీయాధ్యక్షుని జాగ్రత్త…
ఇద్దర్ని ప్రధానమంత్రులుగా,ఒకరిని రాష్ట్రపతిగా చేశానని సందర్భం దొరికినప్పుడల్లా తన గతాన్నినెమరు వేసుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు. అది నిజమే. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ వాజపేయి హయాంలో చంద్రబాబు బాగానే చక్రం తిప్పారు. అన్నీ కలిసి వచ్చినప్పుడు ఆయనంత రాజకీయ మేధావి లేరని నిరూపించుకున్నారు. ప్రస్తుతం 25 లోక్ సభా స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పట్టున్న జాతీయ పార్టీ తెలుగుదేశానికి అధ్యక్షుడాయన. గతంలో బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న తర్వాత కాంగ్రెసుతో చేతులు కలిపారు. మమతతో ముచ్చట్టాడారు. స్టాలిన్ కు సైగలు చేశారు. మరోసారి జాతీయ యవనికపై తన ప్రభావాన్ని చూపుతానన్నట్లుగా హడావిడి చేశారు. ప్రాంతీయ పార్టీల్లో పెద్ద పార్టీలైన తృణమూల్ పశ్చిమబంగలో, డీఎంకే తమిళనాడులో చావో రేవో అన్న రీతిలో ఎన్నికల సమరాన్ని ఎదుర్కొంటున్నాయి. రెండు చోట్లా తెలుగు ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇటీవలనే పశ్చిమబంగ రెండో అధికార భాషగా తెలుగును గుర్తించింది. అయినా తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు అటువైపు తొంగి చూడటం లేదు. తన మిత్రులుగా గతంలో చెప్పుకున్న మమత, స్టాలిన్ లకు ఓట్లు వేయమని తెలుగు ప్రజలను అభ్యర్థిస్తూ ఒక విన్నపం కూడా చేయలేదు. అన్నాడీఎంకే తో కలిసి తమిళనాడులో బీజేపీ ప్రధాన పోటీ దారుగా ఉంది. అటు పశ్చిమబంగలో మమత బెనర్జీ తో ముఖాముఖి తలపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వైఖరిని నిరసించేందుకైనా చంద్రబాబు బీజేపీని ఓడించమని పిలుపునివ్వాల్సిఉంది. కానీ రాజకీయ ప్రాధాన్యతలు మారిపోవడంతో ఆయన జాగ్రత్త పడిపోయారు.
ఫ్రంట్ లేదు… టెంట్ లేదు..
కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో ఫ్రంట్ కట్టి చూపిస్తానని గతంలో చాలా హడావిడి చేశారు కేసీఆర్. మమతను, స్టాలిన్ ను కలిసి కూటమి అవసరాన్ని వివరించి చెప్పారు. ఇంకేముంది భవిష్యత్ అంతా కూటమిదేనని చెప్పుకొచ్చారు. ఆయన దేశ్ కీ నేతా కాబోతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు స్తోత్రాలు చేస్తుంటాయి. నిజంగానే కేసీఆర్ మూడో ఫ్రంట్ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే ఇంతకు మించిన తరుణం మరొకటి లేదు. ఇటు తమిళనాట, పశ్చిమబెంగాల్ లో స్టాలిన్, మమత లకు మద్దతుగా తన వాగ్ధాటితో ప్రచారం నిర్వహించవచ్చు. వారిద్దరూ గెలుపు అవకాశమున్న నేతలు. దక్షిణాదిన పెద్ద రాష్ట్రం తమిళనాడు, జాతీయ పార్టీల హవాను, ప్రత్యేకించి మోడీని నిలువరించగల నాయకురాలు మమత . ఆమెకు వెన్నుదన్నుగా నిలిస్తే ఎప్పటికైనా మూడో ఫ్రంట్ ముచ్చట తీరుతుంది. బీజేపీ సర్వశక్తులు సమీకరించడంతో మమత పెను సవాల్ ను ఎధుర్కొంటోంది. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ సైద్దాంతికంగా, నైతికంగా అయినా ఆమెకు మద్దతుగా నిలవడం ప్రాంతీయ పార్టీల బాధ్యత. కానీ కేసీఆర్ గమ్మున ఉన్నారు. మొత్తమ్మీద చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు ప్రధాన తెలుగునేతలు అవకాశం , అవసరం ఉన్నప్పుడే తాము రాజకీయం చేస్తామని నిరూపించుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతికూల పరిస్థితుల్లో నిలబడేందుకు సైతం ఇష్టపడమని చాటి చెప్పేశారు. ఇకపై కేసీఆర్ ఫ్రంట్ ..టెంట్ అంటూ మాట్టాడితే జాతీయంగా విశ్వసించేవారెవరూ ఉండకపోవచ్చు.
ప‘వార్’షురూ హోగయా…
మహారాష్ట్ర నేత శరద్ పవార్ మాత్రం ఈ ఎన్నికలో తాను జాతీయ నేతనని నిరూపించు కుంటున్నారు. బీజేపీ, కాంగ్రెసు ఫ్రంట్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న మమత బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. నిజానికి మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెసుతో కలిసి కూటమిలో భాగస్వామిగా ఉంది. అయినా కాంగ్రెసు, వామపక్షాల కూటమికి కాకుండా తృణమూల్ కు మద్దతుగా పవార్ ప్రచారం చేయనుండటం విశేషం. నిజానికి కేంద్ర సంస్థల నుంచి పవార్ పార్టీ అనేక రకాల కేసులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఈ క్రిటికల్ సమయంలో బీజేపీకి ఎదురొడ్డి మమతకు అండగా నిలవడంలో పవార్ నిబద్దత తేటతెల్లమవుతోంది. కష్ట కాలంలో స్నేహహస్తం అందించడమే నిబద్ధత. అంతా సాఫీగా ఉన్నప్పుడు మేమూ ఉన్నామనడం పచ్చిఅవకాశవాదమేమో. తెలుగు నేతలు చంద్రబాబు, కేసీఆర్ లు ఆత్మావలోకనం చేసుకోవాలి.
-ఎడిటోరియల్ డెస్క్