పోయిన రెండవ కన్ను గుర్తుకొస్తోంది… ?
ప్రజాస్వామ్యానికి అధికార విపక్షాలు రెండు కళ్ళు. అయితే ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీయే అని తలపండిన చంద్రబాబు అనుకున్నారు, అహంకరించారు. అంతా నా ఇష్టం అన్న [more]
;
ప్రజాస్వామ్యానికి అధికార విపక్షాలు రెండు కళ్ళు. అయితే ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీయే అని తలపండిన చంద్రబాబు అనుకున్నారు, అహంకరించారు. అంతా నా ఇష్టం అన్న [more]
ప్రజాస్వామ్యానికి అధికార విపక్షాలు రెండు కళ్ళు. అయితే ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీయే అని తలపండిన చంద్రబాబు అనుకున్నారు, అహంకరించారు. అంతా నా ఇష్టం అన్న తీరునే అనాడు రాజ్యం చేశారు. ఆయన బాటలోనే జగన్ కూడా సర్కార్ ని నడుపుతున్నారు. నాడు 67 మంది ఎమ్మెల్యేలు గెలిచి కూడా జగన్ బాబు స్పీడుకు ఎక్కడా బ్రేకులు వేయలేకపోయారు. ఇపుడు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబూ చేసేది లేదు. ఇద్దరిదీ ఒక్కటే ఆలోచన. విపక్షం గొంతు పెగలకూడదు. తమ అధికార రధానికి ఎక్కడా అడ్డూ అదుపూ ఉండకూడదు. అయితే దాని వల్ల ఎన్నో విపరిణామాలు సంభవిస్తున్నాయని మేధావులు మొత్తుకున్నా ఫలితం మాత్రం లేకుండా పోతోంది.
గట్టిగా ఉండాలిగా …?
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంది. బాధ్యత కూడా ఉంది. అధికార పక్షం తప్పులు చేస్తే సరిదిద్దడం, నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం విపక్షం గురుతర బాధ్యత. అయితే ఆ విషయంలో గత పదేళ్ళుగా ఏపీ రాజకీయాల్లో చాలా తేడాలు వచ్చేశాయి. విపక్షం అంటే ప్రతీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించడమే అన్నట్లుగా కధ నడిపారు. నాడు చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు జగన్ కూడా ప్రతీ దానికీ విమర్శలు చేసేవారు. ఇక నాటి సర్కార్ కూడా కొన్ని మంచి పనులు చేసింది. వాటిని కనీసంగా కూడా మెచ్చుకోకుండా చిన్న తప్పు జరిగినా పట్టుకుని అగ్గి మీద గుగ్గిలం అయ్యేవారు. దాని వల్ల విపక్షాన్ని బాబు అసలు ఖాతరు చేయడం మానేశారు.
అదే విద్యతో అలా….
బాబు అసలే ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. అందువల్ల ఆయన ఊరుకుంటారా. జగన్ రెండేళ్ళ పాలన మీద చంద్రబాబు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు కానీ ఏ ఒక్క దాన్ని మెచ్చుకోరు. అలాగే లాజిక్ లేని విమర్శలు కూడా టీడీపీ చేసిన వాటిలో ఉంటున్నాయి. గద్దెనెక్కారుగా, కొండ మీద కోతిని అయినా తీసుకురండి అంటూ బాబు సహా తమ్ముళ్ళు గద్దిస్తున్నారు. ఇలా ప్రతీ దానికీ నానాయాగీ చేస్తూంటే వైసీపీకి మండిపోతోంది. కానీ బాబు ఆగుతారా. ఆయన వైసీపీ నేర్పిన విద్యనే వారి మీద ప్రయోగిస్తున్నారు. పైగా కేంద్రంలోని బీజేపీని పక్కన పెట్టి ఏపీ సర్కార్ ని కార్నర్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో బిత్తర పోతున్న వైసీపీ పెద్దలు బాణాలు వేయడం ఆపండి మహాప్రభో అంటున్నారు. ఆపద కాలంలో కూడా రాజకీయమేనా అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణాత్మకమట ….
నిర్మాణాత్మకమైన విపక్షంగా విమర్శలు చేయాలి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబుని కోరుతున్నారు. మీరు సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తామని అని కూడా అంటున్నారు. అయితే ఏపీలో టీడీపీ వైసీపీ రాజకీయ యుధ్ధం చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక అధికార విపక్షాల మధ్య సామరస్యం అన్నది కూడా లేకుండా పోతోంది. ఈ పరిస్థితులలో చంద్రబాబు తీరు మార్చుకోమని కోరినా ఉపయోగం ఉంటుందా. పైగా గత అయిదేళ్ళూ మీరేం చేశారు అని టీడీపీ నుంచి ఎదురు ప్రశ్న వస్తోంది. అంటే ప్రతిపక్షం పాత్ర ఏంటి అన్నది నాడూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. నేడూ అదే జరుగుతోంది. ఫలితంగా సమస్య కంటే సమరమే ధాటీగా దూసుకువస్తోంది. మొత్తానికి ఇప్పటికైనా వైసీపీ నుంచి సరైన సూచన విపక్షానికి వెళ్ళింది. మరి ప్రతిపక్షాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో పాలన గాడిన పడుతుంది. ప్రజలకు కూడా మేలు జరుగుతుంది.