చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనా?

రాజకీయాల్లో కాళ్లు పట్టుకునే విద్య తెలిసుండాలి. బెదిరించే ప్రజా బలముండాలి. సామ,దాన,భేదోపాయాలను నేర్పుగా ప్రదర్శించే నైపుణ్యమూ అవసరమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈవిషయంలో చక్కగా పావులు కదుపుతున్నారు. [more]

Update: 2020-12-18 15:30 GMT

రాజకీయాల్లో కాళ్లు పట్టుకునే విద్య తెలిసుండాలి. బెదిరించే ప్రజా బలముండాలి. సామ,దాన,భేదోపాయాలను నేర్పుగా ప్రదర్శించే నైపుణ్యమూ అవసరమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈవిషయంలో చక్కగా పావులు కదుపుతున్నారు. స్వతస్సిద్ధంగా అభివృద్ధి అవకాశాలు, వనరులూ కలిగిన తెలంగాణకు కేంద్రం ఏ విషయంలోనూ మోకాలడ్డకుండా పనులు చక్కబెట్టుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడూ కేంద్రాన్ని బెదిరిస్తున్నారు. అదే సమయంలో అవసరమైనప్పుడు మైత్రిని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. అధికార, ప్రతిపక్షాల నాయకత్వ బలహీనతలు కేంద్రానికి అలుసుగా మారాయి. కేంద్రాన్ని నిలదీసి రావాల్సిన హక్కులు, రాష్ట్రానికి వనరులు రాబట్టుకోలేక చతికిలపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే సాహసం చేయలేకపోతున్నారు. పొరుగున ఉన్న కేసీఆర్ కీలకమైన అంశాల్లో కేంద్రంతో విభేదిస్తూ తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్రం చెప్పిన ప్రతి విషయానికి తల ఊపుతూ ఏపీలో నేతలు దాదాపు సామంతులుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నాయకులైన జగన్, చంద్రబాబు పోటీలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర నాయకత్వం ముందు సాగిలపడుతున్నారు. సొంత అజెండాలతో ప్రాంతీయ పార్టీల నాయకత్వం కునారిల్లడంతోనే కేంద్ర ప్రభుత్వానికి ఆడింది ఆటగా మారింది.

బాబు నిర్వీర్యం…

రాజకీయపుటెత్తుగడలో భాగంగా చంద్రబాబు బీజేపీతో తగవు పెట్టుకుని పార్టీని తీవ్రంగా దెబ్బతీసుకున్నారు. ఎన్నికల వంటి కీలక ఘట్టంలో కేంద్ర సంస్థల దాడులతో ఎన్నికలకు వనరులు సమకూర్చాల్సిన పెద్దలు చేతులెత్తేశారు. ఆ తర్వాత వారంతా బీజేపీలో కలిసి పోయారు. వైసీపీకి కేంద్రం ప్రత్యక్షంగా సహకరించిందని చెప్పలేం. కానీ చంద్రబాబును నియంత్రించింది. అది పరోక్షంగా వైసీపీకి వరంగా మారింది. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని మార్చుకోక తప్పని అనివార్యత కూడా చంద్రబాబు స్వయంకృతాపరాధమే. టీడీపీ పతనానికి అప్పుడే నాందిప్రస్తావన జరిగింది. తన పాలన కాలంలోరాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టి ఉంటే సరిపోయేది. కానీ ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ మోహన్ రెడ్డిపై కేసుల దర్యాప్తును వేగవంతం చేయమని చంద్రబాబు డిమాండ్ చేసేవారని బీజేపీ వర్గాల ప్రధాన అభియోగం. అయితే కేంద్రం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఉదాసీన వైఖరి తీసుకోవడంతో వైసీపీకి లాభించింది. జగన్ కు ఉన్న ప్రజాబలాన్ని అంచనా వేసే మోడీ, షా ద్వయం వ్యూహాత్మక జాప్యం చేసింది. కేంద్రం తన మాట వినడం లేదని కినిసిన చంద్రబాబు అవిశ్వాసంతో బీజేపీకి దూరమయ్యారు. ఫలితాన్ని చవిచూశారు. మోడీ, షాల రాజకీయ పటిమ కు దిమ్మతిరిగిన చంద్రబాబు తర్వాత కేంద్రం ఊసెత్తడం లేదు. విద్యుత్తు సంస్కరణలు, రైతు చట్టాలు, పౌరసత్వ సవరణల వంటివి ప్రాంతీయ పార్టీలకు రాజకీయంగా మైలేజీ ఇచ్చే అంశాలు. అయినప్పటికీ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో జాతీయస్థాయి కలిగిన నేత చంద్రబాబు తనను తాను నిర్వీర్యం చేసేసుకుంటున్నారు. కనీసం రాష్ట్రానికి చట్టప్రకారం రావాల్సిన హక్కుల విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయడం లేదు. తనకు రాజకీయంగా చేటు చేస్తారనే భయంతో కేంద్ర పెద్దల వైపు వేలెత్తి చూపడం లేదు.

జగన్ దాసోహం…

కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో అధికార పార్టీదే ప్రధాన పాత్ర. పోలవరం వంటి చట్టపరమైన హామీ కలిగిన ప్రాజెక్టు విషయంలో కేంద్రం తన బాధ్యతను కుదించుకునేందుకు చూస్తోంది. అయినా పోరాట పంథాను తీసుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి. కేంద్రంపై పైసా భారం పడని మూడు రాజధానులు, మండలి రద్దు వంటి పొలిటికల్ అజెండాతోనే ముందుకు వెళుతున్నారు. జగన్ పై నమోదైన కేసుల దర్యాప్తును న్యాయస్థానాలు వేగవంతం చేయడంతో పరిష్కారం చూపమని కేంద్ర పెద్దల ముందు మోకరిల్లుతున్నట్లు రాజకీయ అభియోగాలున్నాయి. తిరుగులేని ప్రజాబలం ఉన్నప్పటికీ ఏ విషయంలోనూ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోవడం వైసీపీ నాయకత్వ బలహీనత. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విభజన హామీల అమలు వంటి వాటిపై వైసీపీ సన్నాయి నొక్కులే తప్ప పోరాటం చేయడం లేదు. తాడోపేడో తేల్చుకునే వైఖరి తీసుకోవడంలేదు. విద్యుత్తు సంస్కరణలు, రైతు చట్టాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన వ్యతిరేకతకు కారణాలనూ చెబుతున్నాడు. కానీ వైసీపీ మాత్రం కేంద్రానికి మద్దతు ఇస్తోంది. తన బేషరతు మద్దతు కారణాలను చూపించలేకపోతోంది. ఇక్కడే బీజేపీ, వైసీపీల మధ్య రాజకీయ క్విడ్ ప్రో కో ఏదో చోటు చేసుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయంలో ప్రధానప్రతిపక్ష నేత చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. కానీ కేంద్రాన్ని నిందించలేకపోతున్నారు. పదిసార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారంటూ జగన్ ను ప్రశ్నించారు చంద్రబాబు. మరి తన పాలనలో 29 సార్లు ఢి్ల్లీ వెళ్లి చంద్రబాబు ఏం సాధించారనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నకు ప్రశ్నే సమాధానమవుతోంది.

మోడీ బలమే కేంద్ర బలగం…

కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ నాయకత్వంలో అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. నోట్ల రద్దు ప్రజలపై చూపిన ప్రభావం, అనాలోచిత తక్షణ లాక్ డౌన్ , జీఎస్టీ అమలు, వ్యవసాయ చట్టాలు వంటివన్నీ కొన్ని వర్గాలను బాధించేవే. అయినా నరేంద్రమోడీపై అవినీతి ముద్ర లేకపోవడం, వారసత్వ జంజాటం లేకపోవడం, కులపరమైన జాడ్యం వెన్నాడకపోవడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. తమను కష్టపెట్టినా మోడీని స్వచ్ఛమైన నాయకునిగానే చూస్తూ మద్దతిస్తున్నారు. ఆ నాయకత్వ బలమే కేంద్రానికి కలిసి వస్తోంది. ప్రాంతీయ పార్టీల విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. అవినీతి, నేరపూరితమైన కేసులు, వారసత్వం, కుల ముద్ర ప్రాంతీయ నాయకులను కేంద్రం ముందు బలహీనపరుస్తోంది.ఈ ఊబిలో కూరుకున్న చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిలు కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. రాష్ట్రం అజెండా పక్కకు పోయి వ్యక్తిగత అజెండాలే రాజ్యం చేస్తున్నాయి. ప్రత్యక్షంగా తెలంగాణలో ప్రత్యర్థి అయినప్పటికీ కేసీఆర్ కు కేంద్రంలో దక్కిన మన్నన ఏపీ నాయకులకు లభించడం లేదు. అన్ని వనరులు కలిగిన ఆంధ్రప్రదేశ్ కు ఇది విషాదకర రాజకీయ అధ్యాయం.

Tags:    

Similar News