భజనకు వేళాయరా?

పోలవరం ప్రాజెక్టుకు జనాలను తీసుకెళ్లి చంద్రబాబు భజనలు చేయించుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ఒక వీడియోను ప్రదర్శించారు. పోలవరానికి జనాలను తీసుకెళ్లడానికి చంద్రబాబు 83 కోట్లు [more]

;

Update: 2020-12-09 03:30 GMT

పోలవరం ప్రాజెక్టుకు జనాలను తీసుకెళ్లి చంద్రబాబు భజనలు చేయించుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ఒక వీడియోను ప్రదర్శించారు. పోలవరానికి జనాలను తీసుకెళ్లడానికి చంద్రబాబు 83 కోట్లు ఖర్చు చేశారని జగన్ చెప్పారు. చంద్రబాబు భజనలకే ఇంత ఖర్చు చేశారని జగన్ చెప్పి పడి పడి నవ్వారు. చంద్రబాబు నలభై ఏళ్ల పాటు జరిపిన రాజకీయంలో గత పాలనలో అది చేశారు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నదేంటి? అన్న ప్రశ్న వైసీపీ అధినేతకు ఎదురుకాకతప్పదు.

అప్పటి వరకూ …..

నిజమే చంద్రబాబు 2014కు ముందు వరకూ బాగానే ఉండేవారు. 2004 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకూ చంద్రబాబు తన పేర్లను కూడా ఏ పథకాలకూ పెట్టుకోలేదు. ఎన్టీఆర్ కు విలువ ఇచ్చేవారు. ప్రధానంగా ప్రజాసమస్యలను చంద్రబాబు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. విజన్ ఉన్న నేతగా అనేక కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారంచుట్టారు. అయితే 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయి చంద్రబాబు కూడా మారిపోయారు.

మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాతే…..

ఆయన తన భజనకే ఎక్కువ విలువ ఇచ్చేవారు. తనకు ఎదురు ఎవరు ప్రశ్నించినా చిందులేసేవారు. నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు ఫైర్ అయిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును కూడా క్రమంగా పక్కన పెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు 2014 నుంచి ప్రారంభించారు. పథకాలకు, కార్యక్రమాలకు చంద్రన్న పేరును చేర్చారు. ఇదే చంద్రబాబును అనేక మందిని దూరం చేసిందని చెప్పకతప్పదు.

జగన్ కూడా……

మరి ఇప్పుడు చంద్రబాబు బాటలోనే జగన్ నడుస్తున్నాడన్న వాదనలు విన్పిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట పథకాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అన్నీ జగనన్న పేరు మీదనే కనపడుతున్నాయి. చంద్రబాబుకు తన పేరిట పథకాలను పెట్టుకోవాలంటే 9 ఏళ్లు పడితే జగన్ కు మాత్రం 9 నెలలు కూడా పట్టలేదన్న విమర్శలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. ఒకరిని చూసి నవ్వే ముందు మన సంగతేంటని చూసుకుంటే మంచిదేమో చూసుకోమని సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News