బాబుకు ఛాన్సు దొరుకుతోందా..?

తెలంగాణతో పాటుగా ఆంద్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. నిజానికి తెలంగాణలో నిన్నామొన్నటివరకూ పెద్దగా పొలిటికల్ హీట్ లేదు. కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్యమే కొనసాగింది. తాజాగా [more]

;

Update: 2021-01-04 15:30 GMT

తెలంగాణతో పాటుగా ఆంద్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. నిజానికి తెలంగాణలో నిన్నామొన్నటివరకూ పెద్దగా పొలిటికల్ హీట్ లేదు. కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్యమే కొనసాగింది. తాజాగా బీజేపీ సవాల్ చేయడం, ప్రతి విషయంలోనూ ఉద్రిక్తత పెంచి పతాక స్థాయికి తీసుకెళ్లడంతో పొలిటికల్ మీటర్ వేడెక్కింది. కానీ నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పట్నుంచీ రాజకీయ జ్వరం కొనసాగుతూనే వస్తోంది. తొలి ఎన్నికలో చంద్రబాబు బొటాబొటి ఓట్లతో టీడీపీని గట్టెక్కించారు. తర్వాత వైసీపీ నాయకులకు తీర్థమిచ్చి పార్టీని మరింత బలోపేతం చేసుకున్నట్లుగా భావించారు. కానీ ప్రజల్లో పట్టున్న వైసీపీ తొలి అయిదేళ్లలో తీవ్రైమైన దాడిని కొనసాగిస్తూనే వచ్చింది. ఫలితంగా వైసీపీ రికార్డు స్థాయి గెలుపుతో చరిత్ర సృష్టించింది. కొంతకాలంపాటు టీడీపీ సైలెన్స్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి ఆ చాన్సు ఇవ్వడం లేదు. నిరంతరం తనపై రాజకీయ దాడి చేసేందుకు అవసరమైన అస్త్రాలను ప్రతిపక్షాలకు అందిస్తూనే ఉన్నారు.

జగన్ అఫెన్స్ ఎటాక్…

రాజకీయాల్లో చాలామంది నాయకులు డిఫెన్స్ ఆడుతుంటారు. ఎదుటి వారి ఎత్తులను బట్టి ప్రతి వ్యూహంతో ఎదుర్కొంటుంటారు. చాలా రక్షణాత్మక వైఖరి తీసుకుంటారు. నిజానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ తరహా రాజకీయాలకు పెట్టింది పేరు. పరిస్థితులను అనుసరించి పోతుంటారు. తొలిసారిగా అఫెన్స్ అటాక్ చేద్దామనుకుని బీజేపీని టార్గెట్ చేశారు. బొక్కబోర్లా పడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఫెన్స్ అటాక్ కు పెట్టింది పేరు. పరిస్థితులు, పర్యవసానాల సంగతి పక్కనపెట్టి ముందుగా తానే అస్త్రం సంధిస్తారు. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే ప్రతిపక్షంలో ఈ ధోరణి కలిసొచ్చింది. కానీ అధికార పక్షంగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా దొరుకుతున్నాయి. మైనారిటీ మతావలంబీకునిగా ఇప్పటికే ముద్ర ఉండటానికి తోడు తాజాగా చోటు చేసుకుంటున్న దురద్రుష్ట కర సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. సాధారణంగా మతం పేరు చెబితే ఆచితూచి వ్యవహరించే చంద్రబాబు ఈ విషయాన్ని తన పార్టీకి అనుకూలంగా చేసుకునేందుకు చక్కగా పావులు కదుపుతున్నారు.

చకచకా చంద్రబాబు…

నాయకునిగా కంటే వ్యూహకర్తగానే చంద్రబాబు విజయాలు సాధించారని చెప్పవచ్చు. ఆయన ఎత్తుగడలు, ఆలోచనలు ఫెయిల్ అయినప్పుడు పార్టీ ఓడిపోయింది. 2004,2009,2019 ఆయన ఫెయిల్యూర్స్ కు ఉదాహరణలు. 1999, 2014 ఆయన రాజకీయ చాతుర్యానికి దక్కిన విజయాలు. రాజకీయవేత్తగా చంద్రబాబుకు ఫెయిల్యూర్స్ ఎక్కువ. స్వతహాగా ధైర్యవంతుడైన నాయకుడు కాదు. మాస్ ఇమేజ్ లేదు. మాట నిలబెట్టుకుంటాడనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లో లేదు. అదే చంద్రబాబుకు మైనస్. తెలివితేటలుగా సమీకరణలు, పోల్ మేనేజ్ మెంట్, పొత్తులు కుదుర్చుకోవడంలో ఉండే నైపుణ్యం చంద్రబాబుకు ప్లస్. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఇఫ్పట్లో టీడీపీ అధికారపార్టీ దరిదాపులకు చేరలేదని అంతా బావించారు. లక్షలాది ప్రజలతో ముడిపడిన ఇసుక నూతన విధానం, ప్రజల జీవితాలకు పెద్దగా సంబంధం లేని మూడు రాజదానులు, గిల్లికజ్జాలతో న్యాయవ్యవస్థతో వైరం వంటివన్నీ జగన్ దుందుడుకు స్వభావానికి నిదర్శనాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి వైఖరినే అనుసరించాలని జగన్ భావిస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకుంటూ చంద్రబాబు రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల్లో చావు దెబ్బతిన్న టీడీపీ మూడో నెలనుంచే పోరాటానికి సర్వం సిద్ధం చేసుకోగలిగింది. అదే తెలంగాణలో ప్రతిపక్షాలు కోలుకోవడానికి ఆరేళ్లు పట్టింది.

మతం మత్తు చల్లితే…

ప్రజలలో పర్సప్షన్ అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యం. తమకేమీ అన్యాయం జరగకపోయినా ఒక్కోసారి ప్రజలు తిరగబడుతుంటారు. దీనికి ముఖ్యంగా మనోబావాలు దెబ్బతిన్నాయని పేరు పెడుతుంటారు. అటు వంటి సందర్భాలను స్రుష్టించి రాజకీయ లబ్ధి పొందడంలో బీజేపీ దిట్ట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అట్టడుగున ఉన్న బీజేపీ హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి శతథా ప్రయత్నిస్తోంది. అయితే దాని బలం సరిపోవడం లేదు. ఈ అంశం ఆధారంగా బీజేపీ బలపడితే టీడీపీకి నూకలు చెల్లినట్లే. అందుకే అజెండాలోని ఆ అంశాన్ని అందిపుచ్చుకోవాలని టీడీపీచూస్తోంది. మతపరమైన అంశాల్లో సంఘటన పూర్వాపరాలతో సంబంధం లేకుండానే ప్రజల్లో ఒక మాస్ సైకాలజీ ఏర్పడుతుంది. వీటిని తట్టుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్ లో తాజా సంఘటనలు ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఎప్పుడూ అఫెన్స్ లో అటాక్ చేసే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డిపెన్స్ లో పడిపోయింది. చంద్రబాబు నాయుడు అటు వైసీపీని టార్గెట్ చేస్తూ అదే సమయంలో బీజేపీ బలపడకుండా ఈ అస్త్రాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. సీనియర్ రాజకీయవేత్తగా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం ఆయన కు వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోతే ప్రజల్లో అసహనం పెరిగే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాల వంటి తాయిలాలు కొన్ని సందర్బాల్లో మనోభావాల మీద పనిచేయవు. అందులోనూ మతం విషయంలో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను భయపెడుతున్న అంశమదే. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ రకమైన భావనలు ఏర్పడితే అధికారపక్షానికి చిక్కులు తప్పవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News