బాబు నోట ఆ మాట వస్తుందా..?

రాజకీయ నాయకులు వినకూడని, అనకూడని పదం ఏదైనా ఉందంటే అది రిటైర్మెంట్. దేవుడు ఎంత వరకు ఆయుష్షు ఇస్తే అంతవరకూ అందలాలు ఎక్కడానికే ఆరాటపడతారు, అంతే తప్ప [more]

;

Update: 2020-11-13 14:30 GMT

రాజకీయ నాయకులు వినకూడని, అనకూడని పదం ఏదైనా ఉందంటే అది రిటైర్మెంట్. దేవుడు ఎంత వరకు ఆయుష్షు ఇస్తే అంతవరకూ అందలాలు ఎక్కడానికే ఆరాటపడతారు, అంతే తప్ప ఇక చాలు అన్న మాట ఏ ఒక్కరి నోట రానే రాదు. అలాంటిది ఏం వయసు అయిపోయిందని బీహార్ సీఎం నితీష్ కుమార్ తన రిటైర్మెంట్ ని ప్రకటించేశారు ఈ ఎన్నికలు తనకు చివరివి అన్నారు. తనకు అవకాశం ఇస్తే సీఎంగా మరో అయిదేళ్ళు మాత్రమే పనిచేస్తాను అని నితీష్ చెప్పుకున్నారు.

పరుగు ఆపని బాబు….

నిజానికి నితీష్, మోడీ, చంద్రబాబు వీళ్ళంతా ఒకే వయసువారు. అందరూ డెబ్బైలు దాటిన వారే. మోడీకి ఇంకా మూడున్నరేళ్ళ పాటు అధికారం చేతిలో ఉంది. 2024 లోనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మోడీకి ఆనాటికి 75 ఏళ్ళు వస్తాయి. మరి ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్నది చూడాలి. ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు నోట రిటైర్మెంట్ అన్న మాట అసలు వినబడదు అని కచ్చితంగా ఎవరైనా చెప్పేయగలరు. ఆయన ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును చూసిన వారు కూడా ఆయన ఇంకా మరిన్ని టెర్ములు సీఎం కుర్చీలో ఉండడానికే చూస్తారని చెబుతారు.

అలా వాడుకుంటారా…?

నిజానికి రిటైర్మెంట్ విషయంలో కూడా ఒక అద్భుతమైన సక్సెస్ ఫార్ములా ఉందని అంటున్నారు. తమ ప్రియతమ నాయకుడు పోటీ చేయను అంటే జనాలు ఊరుకుంటారా. వద్దు అంటారు. రాజకీయమంతా కాదంటే అవును అనిలే తీరులోనే సాగుతుంది కదా. అందువల్ల రివర్స్ గేర్ లో వెళ్తే అదే ప్లస్ అవుతుంది. మరి దీన్ని చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో వాడుకునే వీలు ఉందని అంటున్నారు. 2024 నాటికి బాబు తాను ఈసారికి ప్రజలకు సేవ చేసుకుంటాను, తన అనుభవం పూర్తిగా వినియోగించి ఏపీని బాగు చేస్తాను అని విన్నపాలు చేసుకోవచ్చు. తనకు ఒక్క చాన్స్ ఇవ్వండి, అది చివరి చాన్స్ అని కూడా చంద్రబాబు అడిగినా అడగవచ్చు. ఓ విధంగా 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క చాన్స్ మాదిరిగా అన్న మాట. మరి దాన్ని జనాలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటే టీడీపీకి తిరుగు ఉండదేమో కూడా.

ఇరుక్కుపోయారా.?

ఇక పొరుగున ఉన్న కేసీయార్ కూడా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలకు దూరం అవుతారు అంటున్నారు. తన కుమారుడిని సీఎం చేసి తాను తప్పుకుంటారని కూడా వినిపిస్తోంది. వీలుంటే జాతీయ స్థాయిలో గట్టిగా ట్రై చేసుకోవడం, లేకపోతే పార్టీ పెద్దగా ఉండడం అన్నది కేసీయార్ ఆలోచనలుగా చెబుతున్నారు. చంద్రబాబుకు అలాంటి సదుపాయం ఉందా అన్నది ఇక్కడ చూడాలి. లోకేష్ కి పగ్గాలు ఇస్తాను అంటే జనాలే కాదు, పార్టీలో తమ్ముళ్ళే ఊరుకోరు, అందువల్ల టీడీపీ బండిని లాగించాలంటే బాబు తన బొమ్మతోనే కధ నడిపించాలి. ప్రాంతీయ పార్టీ అధినేతగా ఎవరికీ లేని చిత్రమైన సమస్యలతో బాబు ఇరుక్కుపోయారు. అందువల్ల నితీష్ వాడిన బ్రహ్మాస్త్రాన్ని సింపతీ కోసం వాడుకున్నా చివరి చాన్స్ అన్న ఒట్టును మాత్రం చంద్రబాబులాంటి వారు తీసి గట్టున పెట్టి ఏంచక్కా ఓపిక ఉన్నంతవరకూ రాజకీయాల్లో కొనసాగుతారు తప్ప రిటైర్మెంట్ అన్న ఊసే రానివ్వరు. మరి బాబు చివరి చాన్స్ అని ముందుకు వస్తే జగన్ ఏ వ్యూహంతో వస్తారో చూడాలి.

Tags:    

Similar News