ఆమె ఏ తప్పు చేసింది బాబూ ?
తెలుగుదేశం పార్టీలో వారసత్వాలకు కొదవ లేదు. బాబే పార్టీకి పెద్ద కాబట్టి లోకేష్ ఆ పార్టీకి భావి వారసుడు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ప్రతీ నాయకుడి [more]
;
తెలుగుదేశం పార్టీలో వారసత్వాలకు కొదవ లేదు. బాబే పార్టీకి పెద్ద కాబట్టి లోకేష్ ఆ పార్టీకి భావి వారసుడు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ప్రతీ నాయకుడి [more]
తెలుగుదేశం పార్టీలో వారసత్వాలకు కొదవ లేదు. బాబే పార్టీకి పెద్ద కాబట్టి లోకేష్ ఆ పార్టీకి భావి వారసుడు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ప్రతీ నాయకుడి వారసుడికీ చంద్రబాబు పదవులు ఇస్తూ పోతున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల విషయమే తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు బతికుండగానే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడుని ప్రోత్సహించిన చంద్రబాబు ఎర్రన్న మరణానంతరం కుమారుడు రామ్మోహననాయుడుని తెచ్చి ఎంపీని చేశారు. పార్టీ పదవులు కూడా అయనకు కట్టబెడుతున్నారు.
అందరికీ ఇచ్చేశారుగా….
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత గౌతు శ్యామ సుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషకు జిల్లాకు గత ఎన్నికల్లో పలాసా టికెట్ ఇచ్చారు. నిన్నటిదాకా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవిని నిర్వహించారు. ఇక ఇపుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇక ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావుకు త్రిబుల్ బొనాంజా ఇచ్చారు. ఆయనకు ఏకంగా పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ ఇచ్చారు. ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుని రాష్ట్ర కారదర్శిని చేశారు. ఇక మరదలు కిమిడి మృణాళినికి అప్పట్లో మంత్రి పదవి ఇచ్చారు. ఆమె కొడుకు కిమిడి నాగార్జునకు గత ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఇపుడు ఏకంగా జిల్లా ప్రెసిడెంట్ కిరీటం ఆయనకు పెట్టారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పొలిట్ బ్యూరోలో తీసుకున్నారు. కుమారుడు విజయ్ ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశారు.
ప్రతిభ లేదా …?
ఇక శ్రీకాకుళం జిల్లాలో ఆది నుంచి పార్టీని నమ్ముకున్న కావలి ప్రతిభా భారతిని మాత్రం చంద్రబాబు కావాలనే సైడ్ చేశారని అంటున్నారు. ఆమెని తాజాగా పొలిట్ బ్యూరో నుంచి తప్పించి పేరుకు పదవి అన్నట్లుగా జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేశారు. ఇక ఆమె తన కుమార్తె గ్రీష్మకు రాజాం ఎమ్మెల్యే టికెట్ ఇమ్మనమని చంద్రబాబుని గత ఎన్నికల వేళ కోరారు. అయినా సరే కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావుకు టికెట్ ఇప్పించారు కళా వెంకటరావు. ఇక ఇపుడు ఆయన పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. కాబట్టి తన కుమార్తెను రాజాం పార్టీ ఇంచార్జిని చేయామని ప్రతిభ కోరుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉలకడంలేదు, పలకడంలేదు అని ఆమె మధనపడుతున్నారు.
న్యాయమేనా …?
పార్టీలో అందరి వారసులకూ స్థానం కల్పించిన చంద్రబాబు తన కుమార్తెకు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారు అన్నదే ప్రతిభ ప్రశ్నగా ఉందిట. జిల్లా పార్టీలో వర్గ విభేదాల వల్ల కూడా తనకు అన్యాయం జరుగుతోందని ఆమె నమ్ముతున్నారు. ఇక ఆమె తన రాజకీయ జీవితం చాలు అనుకుంటున్నట్లుగా భోగట్టా. తన కుమార్తెను వారసురాలిగా చూడాలని మాత్రం ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కనుక తమ ఆశలు నెరవేరకపోతే వైసీపీ బాటన కూడా పట్టేందుకు తల్లీ కూతుళ్ళు వెనకాడబోరని కూడా ప్రచారం సాగుతోంది. మరి ప్రతిభాభారతి పట్ల చంద్రబాబు ఎందుకు ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు అన్నది తమ్ముళ్లకు కూడా అర్ధం కావడంలేదుట.