టాప్ టూ బాటమ్ భ్రమల్లోనే టీడీపీ ?

అదేంటో దేశంలో ఏ రాజకీయ పార్టీలోనైనా భిన్న వాదనలు ఉంటాయి. రెండో అభిప్రాయం కూడా ఉంటుంది. కానీ మైండ్ గేమ్ లో నిపుణుడు అయిన చంద్రబాబు నాయకత్వం [more]

;

Update: 2020-11-30 11:00 GMT

అదేంటో దేశంలో ఏ రాజకీయ పార్టీలోనైనా భిన్న వాదనలు ఉంటాయి. రెండో అభిప్రాయం కూడా ఉంటుంది. కానీ మైండ్ గేమ్ లో నిపుణుడు అయిన చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న టీడీపీలో మాత్రం ఒకే మాట. ఒకే తీరు. జగన్ కి అధికారం కలలో కూడా దక్కదని, ఆయన ఈ జన్మలో సీఎం కాలేడని చట్ట సభల సాక్షిగా గొంతు చించుతున్న పసుపు తమ్ముళ్ళు జగన్ సీఎం అన్న రెండు పదాలను ఇప్పటికీ కలపి చదవలేకపోతున్నారు. అంతలా భ్రమల్లో టీడీపీని ఉంచి తాను నిండా మునిగిన చంద్రబాబు లేస్తే మనిషిని కాను అంటూ భారీ స్టేట్ మెంట్లు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు.

లాటరీగానా…?

జగన్ ది అసలైన గెలుపు కాదు, ఈ మాటను కనుగొన్నది అచ్చంగా చంద్రబాబే. ఆయన ఓడిపోయిన మొదట్లో కొన్ని నెలల వరకూ జగన్ ది అసలు విజయమే కాదని డప్పు వాయించారు. తానే గెలిచాను కానీ ఈవీఎమ్ లు మ్యానేజ్ చేసి జగన్ సీఎం అయ్యారని కూడా బండలు వేశారు. అలా అనుకున్నా కూడా జగన్ విపక్షంలో ఉన్న నేత. అది ఎలా సాధ్యమని కనీసం తమ్ముళ్లు అయినా ఆలోచించలేకపోయారు. ఆ తరువాత జగన్ కి ఒక్క చాన్స్ మాత్రమే జనం ఇచ్చారని ఆయన మళ్ళీ సీఎం అయితే ఒట్టు అంటూ చంద్రబాబు లంకించుకున్నారు. అదే భ్రమల్లో ఉన్న తమ్ముళ్ళు కూడా ఆ పాటే పదే పదే పాడుతున్నారు. అనంతపురం లో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి అయితే జగన్ దీ ఒక గెలుపెనా అది ఫక్త్ లాటరీ అనేస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత లేదుట…

చంద్రబాబు మీద ఏపీ జనంలో అసలు ప్రజా వ్యతిరేకత లేదు అంటూ దీపక్ రెడ్డి సూత్రీకరిస్తున్నారు. చంద్రబాబు పాలన చాలా బాగున్నా కూడా ఏపీ ప్రజలు జగన్ కి ఒక్క చాన్స్ ఇద్దామనుకున్నారని, అందుకే జగన్ గెలిచాడు అంటూ కొత్త లాజిక్ ని చెబుతున్నారు. బహుశా ఆయన మాటలు చంద్రబాబుకు మిగిలిన తమ్ముళ్ళకు ఆత్మ తృప్తిని ఇస్తాయేమో కానీ ఏపీ జనాలకు మాత్రం అవి వెగటుగానే ఉంటాయని దీపక్ రెడ్డి లాంటి వారు అసలు ఊహించలేకపోతున్నారు. పైగా ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే చంద్రబాబే వస్తారని బీరాలు పలుకుతున్నారు. మరి ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎటూ ఉన్నాయి. తిరుపతి లోక సభ ఉప ఎన్నికలు కూడా రెడీగా ఉన్నాయి. మరి అక్కడ ఢంకా భజాయించవచ్చు కదా అంటే మాత్రం తమ్ముళ్ళు ఫుల్ సైలెంట్ అవుతున్నారుగా.

కొంప ముంచుతుందేమో…?

అతి విశ్వాసంతోనే చంద్రబాబు 2019 ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారని విశ్లేషణలు ఉన్నాయి. ఆయనకు ఓటమి తప్పకపోయినా కూడా ఇంతటి పరాభవం కలగడానికి కారణం జగన్ ని తక్కువ చేసి చూడడమేనని కూడా అంటారు. అపుడు విపక్షంలో జగన్ ఉన్నారు. అయినా తేలిక చేసి చూసిన పాపానికి ఇపుడు ఫలితం టీడీపీ మొత్తం అనుభవిస్తోంది. ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు. మరి ఇపుడు కూడా జగన్ ని ఏమీ కానట్లుగా తీసిపారేస్తే ఎదురు దెబ్బలు తప్పవని గత చరిత్ర చెబుతోంది. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో ఇప్పటిదాకా చంద్రబాబు నుంచి దిగువ స్థాయి నేత వరకూ సమగ్ర విశ్లేషణ చేసుకోనేలేదు. ఆత్మ పరిశీలన అంతకంటే లేదు అన్నది వాస్తవం. ఇపుడు చూస్తే చంద్రబాబుని జనం ఓడించలేదు అనుకుంటూ తమ్ముళ్ళు తమను తాము ఆత్మ వంచన చేసుకుంటూ భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది అటూ ఇటూ తిరిగి మళ్ళీ అసలుకే ఎసరు పెడుతుందన్నది మాత్రం గ్రహించలేకపోతున్నారు. మొత్తానికి భ్రమల నుంచి టీడీపీ బయటపడాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News