ఆ కొత్త క‌మ్మ నేత ఎంట్రీతో టీడీపీ బాగుప‌డేనా..?

ప్రకాశం జిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ద‌ర్శిలో టీడీపీ అనేక ఉత్థాన ప‌త‌నాల‌ను చ‌విచూస్తోంది. కీల‌క నేత‌లుగా భావిస్తున్నవారు సైతం ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కలేక పోతున్నారు. దీనికి [more]

;

Update: 2020-12-02 06:30 GMT

ప్రకాశం జిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ద‌ర్శిలో టీడీపీ అనేక ఉత్థాన ప‌త‌నాల‌ను చ‌విచూస్తోంది. కీల‌క నేత‌లుగా భావిస్తున్నవారు సైతం ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కలేక పోతున్నారు. దీనికి తోడు ఎప్పటిక‌ప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయోగాలు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేయ‌లేక పోతున్నాయి. దీంతో పార్టీ ఇక్కడ పుంజుకునేనా ? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ప్ర‌భుత్వం అధికారంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్న శిద్ధా రాఘ‌వ‌రావు గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సిద్ధా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక గ‌త ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసి ఓడిన క‌దిరి బాబూరావు సైతం ఫ్యాన్ గూటి కింద‌కు చేరిపోయారు. దీంతో పార్టీకి జెండా పట్టే నేతే లేక‌పోవడంతో చంద్రబాబు కొత్త నేత‌ను ఇక్కడ అప్పాయింట్ చేశారు చంద్రబాబు. మ‌రి ఇప్పుడైనా.. పార్టీ పుంజుకుంటుందా ? అన్నది సందేహంగానే ఉంది.

రెండు దశాబ్దాలుగా…

గ‌త రెండు ద‌శాబ్దాల్లో ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని ఒక్క‌సారి చూద్దాం. 2004లో టీడీపీ త‌ర‌ఫున క‌దిరి బాబూరావు పోటీ చేసి ఓడిపోయారు. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన బాబూరావు పార్టీని నిల‌బెట్టే ప్రయ‌త్నం చేశారు. ఈ క్రమంలో 2009 ఎన్నిక‌ల నాటికి చంద్రబాబు మ‌ళ్లీ ఇక్కడి ప‌గ్గాల‌ను త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఎన్నారై మ‌న్నెం వెంక‌ట ర‌మ‌ణ చౌద‌రికి అప్పగించారు. ఆయ‌న కూడా ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

అభ్యర్థులను మారుస్తూ…..

ఇక‌, 2014 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. వైశ్య సామాజిక వ‌ర్గానికిచెందిన శిద్దా రాఘ‌వ‌రావుకు అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న బాగానే క‌ష్టప‌డ్డారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్నా శిద్ధా విభ‌జ‌న వాదం కూడా క‌లిసి వ‌చ్చి గెలుపు గుర్రం ఎక్కారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు చంద్రబాబు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మ‌ళ్లీ ఇక్కడ టీడీపీ స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. శిద్దాను ఒంగోలు ఎంపీగా పంపారు చంద్రబాబు. మ‌రోసారి క‌దిరి బాబూరావుకు అవ‌కాశం ఇచ్చారు. క‌నిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న క‌దిరి 15 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ద‌ర్శిలో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

తన సామాజికవర్గానికి…..

దీంతో మ‌ళ్లీ శిద్దాకే నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు అప్పగించాల‌ని ప్రయ‌త్నించినా.. ఆయ‌న పార్టీ మారిపోయారు. ఇటు క‌దిరి బాబూరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. దీందో కొద్ది నెల‌ల పాటు ద‌ర్శి టీడీపీ అనాథ‌లా మారిపోయింది. దీంతో నేత‌ల కొర‌త ఏర్పడి పార్టీ అస్తవ్యస్తంగా మారింది. దీంతో చంద్రబాబు త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ప‌మిడి ర‌మేష్‌కు బాధ్యత‌లు అప్పగించారు. ప‌మిడి ర‌మేష్ గ‌తంలో జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడిగా ప‌నిచేశారు. ర‌మేష్ సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ద్దిపాడు మండ‌లానికి చెందిన వ్యక్తి.

బాబు వ్యూహంతో…..

ద‌ర్శి ప‌గ్గాల కోసం దామ‌చ‌ర్ల కుటుంబానికి చెందిన దామ‌చ‌ర్ల స‌త్యతో పాటు మాజీ ఎమ్మెల్యే నార‌పుశెట్టి పాపారావు పేర్లు వినిపించినా.. చంద్రబాబు చివ‌ర‌కు ఆర్థిక కార‌ణాల నేప‌థ్యంలో ర‌మేష్‌కే ప‌గ్గాలు ఇచ్చారు. ఇప్పుడు.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం.. వైసీపీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌డం.. నేత‌ల‌ను ఒకే తాటిపైకి న‌డిపించ‌డం.. వంటివి ప‌మిడికి పెను స‌వాలుగా మారింది. ఈ క్రమంలో ఆయ‌న ఏమేర‌కు విజ‌యం సాధిస్తార‌నేది ఆస‌క్తిగా చూడాలి. మరి చంద్రబాబు క‌మ్మ వ్యూహం ద‌ర్శిలో ఈ సారైనా ఫ‌లిస్తుందా ? అనేది చూడాలి.

Tags:    

Similar News