బాబుకు దడ మొదలయిందా?

తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుంది. మరికొందరి కోసం గాలం వేసింది. అయితే చంద్రబాబు నాయుడు [more]

;

Update: 2020-11-29 12:30 GMT

తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుంది. మరికొందరి కోసం గాలం వేసింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటి వరకూ వల్లభనేని వంశీ మీద తప్పించి స్పీకర్ కు ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. వల్లభనేని వంశీ విషయంలోనే అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు లేఖ ఇచ్చింది. మిగిలిన వారి విషయంలో మాత్రం మౌనంగానే ఉంది.

నలుగురు పార్టీని వీడినా…..

వల్లభనేని వంశీ టీడీపీని వీడిన తర్వాత మద్దాలిగిరి, కరణం బలరాం తో పాటు ఇటీవల వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీని వీడారు. వీరంతా అధికారికంగా పార్టీని వీడకపోయినా వారి వారసులకు వైసీపీ కండువా కప్పేశారు. వీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో చంద్రబాబు ప్రత్యామ్నాయ నేతలను కూడా నియమించారు. అంటే వీరు పార్టీతో కటీఫ్ చెప్పినట్లే. అయినా మిగిలిన ముగ్గురి మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు.

ముగ్గురిపై ఫిర్యాదు చేయకుండా….

వల్లభనేని వంశీ విషయంలో స్పీకర్ కు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా వల్లభనేని వంశీకి శాసనసభలో స్పీకర్ ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అందుకే చంద్రబాబు కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని భావించి మిన్నకుండిపోయారంటారు. వారు సాంకేతికంగా టీడీపీలో ఉన్నట్లే. అయితే అందుకు తగిన ఆధారాలు బలంగా లేకపోవడంతో చంద్రబాబు మిగిలిన ముగ్గురిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు.

మరికొందరిని…..

దీంతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మరికొందరిని కూడా వైసీపీ లాగేసుకోవాలని చూస్తుంది. కొందరిని ఇప్పటికే నయానా, భయానా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరో ఇద్దరు పార్టీని వీడితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. దీంతోనే చంద్రబాబు పార్టీని వీడిన వారిపై కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటున్నారు. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలంటేనే చంద్రబాబుకు దడ మొదలయిందంటున్నారు. ఈ నెల 30 వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. మరి ఈసారి సమావేశాల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News