అన్నింటిలో అందరికంటే.. ముందుగానే?

తిరుపతి ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. జగన్ ప్రభుత్వంపై [more]

;

Update: 2021-01-15 08:00 GMT

తిరుపతి ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపించాలంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరమని చంద్రబాబు నేతలకు ఉద్బోధ చేశారు. ఎవరూ నిర్లిప్తతగా వ్యవహరించవద్దని, కేసులుకు భయపడవద్దని చంద్రబాబు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నేతలకు భరోసా ఇచ్చారు.

తిరుపతి ఉప ఎన్నిక కోసం…..

ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ ను కూడా నిర్ణయించారు. ఈ నెల 17వ తేదీ నుంచి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండగ అనంతరం ఇక నేతలందరూ జనంలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా జనంలోకి వెళ్లి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించాలని, ప్రజలకు ఈ ఉప ఎన్నికతో వైసీపీకి బుద్ధి చెబితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న సంకేతాలను పంపాలని చంద్రబాబు కోరారు.

70 మంది సీనియర్ నేతలకు….

తిరుపతి ఉప ఎన్నిక కోసం బాధ్యులను కూడా నియమించారు. దాదాపు 70 మంది సీనియర్ నేతల సేవలను ఈ ఉప ఎన్నిక కోసం చంద్రబాబు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యులను నియమించారు. ఈ నెల17వ తేదీన తిరుపతిలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి పది రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.

నిత్యం టచ్ లోనే…..

ముఖ్యంగా దేవాలయాలపై జరుగుతున్న వరస దాడులపై ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చంద్రబాబు ప్రచార సభలను విస్తృతంగా పార్టీ ఏర్పాటు చేయనుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ లో రెండు, మూడు సభలు ఉండేలా ప్లాన్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. బాధ్యులతో నిత్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో చంద్రబాబు ముందస్తు ప్రచారానికి దిగనున్నారు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించిన చంద్రబాబు ప్రచారాన్ని కూడా ఇతర పార్టీలకంటే ముందుండాలనుకుంటున్నారు.

Tags:    

Similar News