నష్టం తక్కువేనంటున్నారు… లెక్కడితేగాని తెలీదు

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోకుండా ఉండేందుకు చరిత్రలో ఎప్పుడు చేయని సాహసానికి టిడిపి అధినేత దిగిపోయారు. క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ [more]

Update: 2021-01-28 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోకుండా ఉండేందుకు చరిత్రలో ఎప్పుడు చేయని సాహసానికి టిడిపి అధినేత దిగిపోయారు. క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ హిందుత్వ అజెండా లో టిడిపి ఎక్కడా వెనకబడలేదనే చాటి చెప్పేశారు. అంతర్వేది మొదలు రామతీర్ధం వరకు బిజెపి కన్నా ముందుగా చంద్రబాబు దూకుడు చూపించారు. అంతేకాదు నేరుగా క్రైస్తవ మతం ఓట్లు పడితే ఎంత పడకపోతే నాకెంత అనే స్థాయిలో ఆయన వ్యాఖ్యలు సాగాయి. ఇవి పెద్ద దుమారాన్నే సృష్ట్టించినా చంద్రబాబు లెక్క చేయడం లేదు. చంద్రబాబు ఈ తరహా పాలిటిక్స్ కి తెరతీస్తారని బిజెపి సైతం ఊహించలేదని తెలుస్తుంది.

వారు దూరం జరుగుతున్నారా …?

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అన్ని మతాలకు కులాలకు సముచిత ప్రాధాన్యత కనిపిస్తూ వచ్చింది. చంద్రబాబు తమ కులానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినా మిగిలిన మతాలు కులాలకు పదవుల పంపిణీలో సమతూకం పాటిస్తూ వచ్చేవారు. అయితే తాజాగా మారిన రాజకీయాలతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి ముందుగానే గమనించారు. దాంతో బిజెపి కి ఎలాంటి లబ్ది లేకుండా రెండడుగులు తానే ముందు వేసే వ్యూహంలో క్రైస్తవ మతస్తులు అయినందునే అంటూ నేరుగా సిఎం , హోమ్ మంత్రి, డిజిపిల పైనే విమర్శల దాడి చేశారు. ఇది టిడిపి లో ఎప్పటినుంచో ఉంటున్న క్రైస్తవ నేతలకు మింగుడు పడని వ్యవహారం గా మారింది. దాంతో మాజీ నామినేటెడ్ ఎమ్యెల్యే ఫిలిప్ థోచర్ వంటివారు అధినేత వైఖరితో విభేదించి పార్టీని వీడి బయటకు వస్తున్నారు.

బిజెపి తన్నుకుపోతే …

పార్టీ లో తొలి నుంచి ఉన్న ఇటువంటివారు గుడ్ బై కొట్టడం అంటే ఒక మతం తెలుగుదేశాన్ని పూర్తిగా వీడినట్లే అవుతుందని విశ్లేషకుల అంచనా. అయితే దీనివల్ల వచ్చే నష్టం తక్కువేనన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందంటున్నారు. టిడిపి సంప్రదాయ హిందూ ఓటు బ్యాంక్ దూరం అయితే పార్టీకి మరింత నష్టమని వైసిపి ఉన్నంత కాలం క్రైస్తవ ఓట్లు అత్యధికం ఆ పార్టీనే కైవసం చేసుకుంటుందని చంద్రబాబు లెక్క గా ఉన్నట్లు తెలుస్తుంది. సో తమ సంప్రదాయ హిందూ ఓటు బ్యాంక్ కు బిజెపి చిల్లు పెడితే అడ్రెస్ గల్లంతు అవుతుందనే చంద్రబాబు హాట్ కామెంట్స్ కి సిద్ధమయ్యారని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు ఒక్క సిపిఎం మినహా జై కొట్టినా అడ్వాంటేజ్ గులాబీ పార్టీ కే లభించింది. ఇప్పుడు కూడా చంద్రబాబు స్వయంగా కాషాయంబరుడిగా మారి త్రిశూలం పట్టినా జనం ఎంతవరకు నమ్ముతారాన్నదే ప్రశ్న.

Tags:    

Similar News