దరి చేర్చుకున్నా …దుమ్మెత్తి పోస్తున్నారే… కాలం అంటే ఇదేనేమో?

టీడీపీ విష‌యంలో మాజీ నేతలు చేస్తున్న కామెంట్లు క‌ల్లోలం సృష్టిస్తున్నాయి. పార్టీ త‌ర‌ఫున ల‌బ్ధి పొంది.. త‌ర్వాత .. ఆయా ప‌ద‌వుల‌ను సైతం ఫ‌ణంగా పెట్టి బ‌య‌ట‌కు [more]

Update: 2021-01-21 11:00 GMT

టీడీపీ విష‌యంలో మాజీ నేతలు చేస్తున్న కామెంట్లు క‌ల్లోలం సృష్టిస్తున్నాయి. పార్టీ త‌ర‌ఫున ల‌బ్ధి పొంది.. త‌ర్వాత .. ఆయా ప‌ద‌వుల‌ను సైతం ఫ‌ణంగా పెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నాయ‌కులు మౌనంగా ఉండ‌లేక పోతున్నారు. వైసీపీ మెప్పుకోసం మాట్లాడుతున్నార‌నే అనుకున్నా.. ఆ రేంజ్‌ను దాటి చంద్రబాబును ఏక‌ప‌క్షంగా కార్నర్ చేస్తున్నారు. గ‌తంలో గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ దూకుడు అంద‌రికీ తెలిసిందే. ఏకంగా చంద్రబాబును, ఆయ‌న కుమారుడు లోకేష్‌ను కూడా క‌లిసి ఉతికేశారు. అస‌లు టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబు, లోకేష్ వంశీని కాద‌ని.. అప్పటి మంత్రి దేవినేని ఉమాకు ప్రయార్టీ ఇవ్వడంతో లోలోన ర‌గులుతూ వ‌చ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక పార్టీకి దూర‌మ‌వుతోన్న క్రమంలో చంద్రబాబు, లోకేష్‌.. పార్టీని ఉతికి ఆరేశారు.

మారినోళ్లందరూ…

ఇక‌, ఆ త‌ర్వాత‌.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి కూడా ఒకింత అస‌హ‌నం ప్రక‌టించారు. పైగా జిల్లాలో టీడీపీ నేత‌ల‌ను. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని దారుణంగా టార్గెట్ చేశారు. ఇక క‌ర‌ణం బ‌ల‌రాం కూడా బాబును ముందు స్ట్రాంగ్‌గా విమ‌ర్శించినా ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యారు. ఇక విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌తో పాటు తోట త్రిమూర్తులు, అడారి ఆనంద్ కుమార్ ఇలా చాలా మంది పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక చంద్రబాబుపై తీవ్రంగా దుమ్మెత్తిపోసినోళ్లే. ఇక‌, తాజాగా టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ అయి.. ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ.. పోతుల సునీత‌ వైసీపీకి మ‌ద్దతు తెలిపారు. స‌రే.. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ మామూలే అనుకున్నా.. ఆ త‌ర్వాత టీడీపీపైనా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు.

నరకం చూపారంటూ…..

కుట్ర కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని బాబుపై విరుచుకుప‌డ్డారు. దేవున్ని కూడా చంద్రబాబు వదలడం లేదు అని అన్నారు. బాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న ఆమె 20 ఏళ్లు టిడిపిలో పని చేశా ఆ సమయంలో చంద్రబాబు నరకం చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి 20 ఏళ్లుగా బాబు న‌ర‌కం చూపిస్తే.. ఆమె ఆపార్టీలో ఎందుకు ఉన్నారో ? చెప్పలేదు కానీ.. ఈ వ్యాఖ్యలు చేయ‌డం మాత్రం చంద్రబాబు గ్రాఫ్‌ను అమాంతం ప‌డేసింది. ఆ మాట‌కు వ‌స్తే ఎక్కడో ఉన్న ఆమెను 2014 ఎన్నిక‌ల వేళ తీసుకువ‌చ్చి చీరాల సీటు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సాయం చేసినా ఆమె ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు.

వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ….

ఇదేదో.. రాజ‌కీయంగా ఆమెకు ఎదురైన అనుభ‌వం నుంచి వ‌చ్చిన కామెంట్లు కాద‌ని.. వ్యక్తిగ‌తంగా ఆమెను చంద్రబాబు టార్గెట్ చేశారా? అనే సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. నిజానికి గ‌తంలో వైసీపీ నుంచి కూడా నాయ‌కులు జంప్ చేశారు. కానీ, ఎవ‌రూ ఇలా జ‌గ‌న్‌ను వ్యక్తిగ‌తంగా టార్గెట్ చేయ‌లేదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు మాత్రం కార్నర్ అయిపోతున్నారు. పార్టీలో ఏక‌స్వామ్యం కొన‌సాగ‌డం, కింది స్థాయి నేత‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివే ప్రధాన కార‌ణాలు అనుకోవాలా? లేక ఇంకేమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. త‌మ‌కు ప‌ద‌వులు ఇచ్చిన చంద్రబాబుపై ఇలాంటి కామెంట్లు చేయ‌డం వెనుక ఏదో జ‌రిగే ఉంటుంద‌నే భావ‌న మాత్రం వ్యక్తమ‌వుతోంది. దీని వెన‌క వైసీపీ అధిష్టానం డైరెక్షన్ ఉందా ? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు వీటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం త‌క్షణ అవ‌స‌రంగా నేత‌లు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News