టీడీపీలో పెయిడ్ బ్యాచ్‌ ను.. బాబు దూరం పెట్టారా ?

టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. `మా నాయ‌కుడు చంద్రబాబు పార్టీ ప‌ద‌వులు ఇచ్చారు. కానీ.. చాలా మందిని ప‌క్కన పెట్టారు. దీంతో వాళ్లంతా కోపంతో ఉన్నారు. [more]

;

Update: 2021-01-25 05:00 GMT

టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. 'మా నాయ‌కుడు చంద్రబాబు పార్టీ ప‌ద‌వులు ఇచ్చారు. కానీ.. చాలా మందిని ప‌క్కన పెట్టారు. దీంతో వాళ్లంతా కోపంతో ఉన్నారు. వాళ్లకు చంద్రబాబు ఏదో అన్యాయం చేశాడ‌ని, త‌న వ‌ర్గానికే చెందిన వారికి ప‌ద‌వులు ఇచ్చార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. ఓ పెయిడ్ బ్యాచ్ త‌యారైంది. పార్టీ కోసం ఏమీ చేయ‌రు. కానీ, ప‌ద‌వులు కావాలి. పోనీ.. ప‌ద‌వులు ఇచ్చాక అయినా.. చేస్తార‌నే గ్యారెంటీ ఉందా ? అంటే.. అది కూడా లేదు. పార్టీ మారిపోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. నిల‌క‌డ‌లేదు. త‌మ‌కు అనుకూలంగా ఉంటే.. ఒక‌ర‌కంగా ఉంటారు. ఇది మంచి ప‌రిణామం కాదు !'- టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు ఇటీవ‌ల విశాఖ‌లో చేసిన వ్యాఖ్య ఇది.

వాయిస్ విన్పించని వారిని….

'మా వోళ్లకు ప‌ద‌వులు కావాల‌య్యా ప‌ద‌వులు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎప్పుడైనా.. మీడియా ముందుకు వ‌చ్చి.. టీడీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించారా ? ఈ 20 నెల్లలో పోనీ.. ఎక్కడైనా కార్యక్రమం నిర్వహించారా ? అవ‌కాశం వ‌స్తే.. వైసీపీలోకి వెళ్లిపోవాల‌ని చూస్తున్నమాట నిజం కాదా ?!“ – కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ చేసిన కామెంట్ ఇది. ఈ కామెంట్ల వెనుక దండ‌లో దారం మాద‌రిగా ఉన్న విష‌యం ఒక్కటే. పార్టీలో చాలా మంది మౌనంగా ఉండ‌డం, ముఖ్యంగా గ‌తంలో వైసీపీ నుంచి జంప్ చేసి.. వ‌చ్చిన వారు ఇప్పుడు ఫుల్లు సైలెంట్ అయిపోవ‌డం, చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌పున యాక్టివ్ ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం… అస‌లు మాట్లాడే వాళ్లే లేక‌పోవ‌డం వంటి ప‌రిణామాలు ఉన్నాయి.

వారికి పదవులు ఇవ్వకపోవడానికి…..

గ‌త రెండు నెల‌ల కింద‌ట టీడీపీలో ప‌ద‌వులు పంచారు. చాలా మంది యువ నాయ‌కుల‌కు, బీసీల‌కు చంద్రబాబు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. వీరిలో కొంద‌రు సీనియ‌ర్లు.. చాలా మంది జూనియ‌ర్లు (వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన‌వారు) ఉన్నారు. కానీ, వీరికి ప‌ద‌వులు ద‌క్కలేదు. దీంతో బాబు త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని, ఇలా అయితే.. పార్టీ ఎలా ఎదుగుతుంద‌ని సోష‌ల్ మీడియాలో త‌మ అనుచ‌రుల‌తో కామెంట్లు చేయిస్తున్నారు. వార్తలు కూడా రాయిస్తున్నార‌ట‌. దీంతో టీడీపీ అంత‌ర్మథ‌నంలో ప‌డిన మాట వాస్తవం. ఈ క్రమంలోనే సీనియ‌ర్లకు దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

నమ్మకం లేకనే….

“వారు పార్టీలో ఉంటారో లేదో తెలియ‌దు. ప‌ద‌వి ఇచ్చినా.. దూకుడు చూపిస్తారో లేదో సందేహ‌మే. అలాంటి వారికి ప‌ద‌వులు ఇచ్చి.. పార్టీ ని న‌మ్ముకున్నవారికి అన్యాయం చేయ‌లేను“ అని కుండ‌బ‌ద్దలు కొట్టార‌ట చంద్రబాబు. దీంతో ఈ విష‌యాన్ని సీనియ‌ర్లు ఇప్పుడు అవ‌కాశం తీసుకుని ప్రచారం చేస్తున్నారు. అంటే.. పార్టీపై మ‌ర‌క‌లు ప‌డ‌కుండా.. చంద్రబాబు ఉద్దేశ్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇక‌, బాబు చెప్పిన మాట‌ల్లోనూ వాస్తవం క‌నిపిస్తోంది. చాలా మంది జంప్ జిలానీలు.. నిజంగా అవ‌కాశం కోసం చూస్తున్నారు. వైసీపీ గేట్లు ఎత్తేస్తే.. వెళ్లిపోయేందుకు మాజీ ఎమ్మెల్యేలు దాదాపు 15 మంది వ‌ర‌కు ఉన్నార‌ని తెలుస్తోంది. వీరిలో మార్పు కోస‌మే చంద్రబాబు ఇలాంటి వ్యూహం అనుస‌రించార‌ని చెబుతున్నారు. మ‌రి వారు వ్యక్తిగ‌తంగా మార‌తారో.. లేక పార్టీనే మార‌తారో చూడాలి.

Tags:    

Similar News