అంత ఫోకస్ పెడితే… కష్టమవుతుందేమో?

ఎప్పుడైనా అంత హైప్ ఇవ్వకూడదు. దేనికి మంచిది కాదు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోతే మళ్లీ కథ మొదటికొస్తుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీ అధినేత [more]

Update: 2021-01-29 13:30 GMT

ఎప్పుడైనా అంత హైప్ ఇవ్వకూడదు. దేనికి మంచిది కాదు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోతే మళ్లీ కథ మొదటికొస్తుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు తీరు అలాగే ఉంది. నిత్యం వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకూ పరవాలేదు. కానీ గెలిచి తీరాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, తిరుపతి ప్రజలు ఖచ్చితంగా టీడీపీ వైపు నిలుచుంటారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏ నియోజకవర్గంలోనూ…..?

కానీ క్షేత్రస్థాయిలో తిరుపతి లోక్ సభ పరిధిలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతి అసెంబ్లీ మినహా మరెక్కడా ప్రభావం చూపే అవకాశాలు లేవు. వైసీపీ మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉంది. అధికార పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కొనడం కష్టమే. అయినా చంద్రబాబు తిరుపతి పార్లమెంటు పరిధిలోని నేతలకు టార్గెట్ విధిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ముందుగానే ప్రకటించినా…..

తిరుపతి ఉప ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కార్యాలయం కూడా ప్రారంభమయింది. పనబాక లక్ష్మి అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళుతున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా కీలక నేతలందరూ తిరుపతిలో మొహరించారు. దాదాపు 70 మంది నేతలకు చంద్రబాబు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. అయితే ఇంత హైప్ తీసుకుని రేపు ఓటమి పాలయితే పరిస్థిితి ఏంటన్నది తెలుగు తమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్న.

చాప కింద నీరులా…..

చాపకింద నీరులా పనిచేసుకు పోవాల్సిన సమయంలో చంద్రబాబు నిత్యం తిరుపతిపైనే ఫోకస్ చేయడం పార్టీకి ఇబ్బంది అనే వారు కూడా లేకపోలేదు. హిందుత్వ అజెండాను భుజానకెత్తుకోవడంతో చంద్రబాబుకు కొన్ని వర్గాలు ఇప్పటికే దూరమయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ పతనాన్ని కోరుకుంటున్న చంద్రబాబు అదే ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోతారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో ఫలితం తర్వాత వ్యూహం మార్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారట. తిరుపతిలో తేడా రిజల్ట్ కొడితే హిందుత్వ అజెండాను పక్కన పెడతారంటున్నారు.

Tags:    

Similar News