బీజేపీ చెప్పులో బాబు కాలు ?

ఎవరి పాదాలకు తగినట్లుగా చెప్పులు వారి సైజువి ఉంటాయి. ఇంకొకరి చెప్పులు తొడుక్కోవాలని చూస్తే ఎబ్బెట్టుగా ఉండడమే కాదు అడుగులు కూడా తడబడతాయి. ఆ పైన పడినా [more]

;

Update: 2021-02-01 15:30 GMT

ఎవరి పాదాలకు తగినట్లుగా చెప్పులు వారి సైజువి ఉంటాయి. ఇంకొకరి చెప్పులు తొడుక్కోవాలని చూస్తే ఎబ్బెట్టుగా ఉండడమే కాదు అడుగులు కూడా తడబడతాయి. ఆ పైన పడినా పడవచ్చు. మరి అన్నీ తెలిసిన చంద్రబాబు బీజేపీ చెప్పుల్లో కాళ్ళు పెట్టారు. దాంతో తాను వాకింగ్ కాదు రన్నింగే చేస్తున్నారు. ఇంతకీ బీజేపీ చెప్పులకు అంతటి విలువ మర్యాదా ఎందుకు వచ్చాయన్నదే పాయింట్. ఏపీలో ఏమైనా హిందూత్వ గాలి బలంగా వీస్తే ఆ చెప్పులతో తాను అనుకున్న మార్గాన వేగంగా దూసుకుపోవచ్చు అన్న అతి తెలివితోనే చంద్రబాబు ఈ పని చేస్తున్నారు అనుకోవాలి.

రాజ్యాంగం ఏమైంది…?

ఎన్టీయార్ అందరి వాడుగా పార్టీ పెట్టారు. ఆయన సినీ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించి కులమత రహితంగా అందరికీ ఆరాధ్యుడు అయ్యారు. ఆ తరువాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. నాడు పార్టీ రాజ్యాంగాన్ని రామారావు తన సినీ అనుభవంతో, తాను పరకాయ ప్రవేశం ద్వారా పోషించిన పాత్రల అనుభవాన్ని రంగరించి తీర్చిదిద్దారు. పేదవాడు అజెండాగా పార్టీకి పరుగులు పెట్టించారు. అక్కడ రంగూ రుచి వాసన వంటివేమీ లేవు. కానీ ఆ పవిత్రమైన పార్టీ రాజ్యాంగం చంద్రబాబు అధ్యక్షుడు అయ్యాక ఎన్నో మార్లు సవరణలకు గురి అయింది.

కాంగ్రెస్ తో అలా….

ఇక ఎన్టీయార్ పార్టీ పెట్టడానికి అసలైన ప్రాతిపదికే కాంగ్రెస్ వ్యతిరేకత. కాంగ్రెస్ వట వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించేందుకు రామారావు తన పద్నాలుగేళ్ళ రాజకీయాన్ని పూర్తిగా వెచ్చించారు, దాని కోసమే విరామమెరుగని పోరాటం చేశారు. ఆ కృషి ఫలితమే దేశంలో 1989 నాటికి నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి రావడం. అలా మరో జయప్రకాష్ నారాయణ్ అయ్యారు రామారావు. మరి ఆయన కాంగ్రెస్ వ్యతిరేక పునాదిని కూడా చంద్రబాబు కుదిపి కదిపేశారు. 2018 ఎన్నికల వేళ తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అందులో తప్పు లేదని వాదించారు. రామారావు రాజ్యాంగాన్ని తానే స్వయంగా సవరించేశారు.

గాలివాటమేనా…?

ఏపీలో ఇపుడు బీజేపీకి ఏమైనా నాలుగు ఓట్లు రాలుతాయన్న భయాలు సందేహాలూ చంద్రబాబులో ఉన్నాయా అన్న డౌట్ వస్తోంది. లేకపోతే ఆయన అర్జంటుగా రామతీర్ధం రావడం, రచ్చ చేయడం ఎందుకు. అలాగే ధర్మ పరిరక్షణ దీక్ష పేరిట ఆందోళనలు టీడీపీ నుంచి కలలో కూడా ఎవరైనా ఊహించగలరా. నాడు బీజేపీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష అన్న చంద్రబాబు ఇపుడు అదే బీజేపీ లైన్ లో వెళ్తూ ధర్మ పరిరక్షణ అంటున్నారు. మరీ ఇలా గాలివాటం రాజకీయాలు చేస్తే ఎలా అన్నది పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉంటున్న వారి ఆవేదనగా ఉంది. నేల విడిచి సాము చేస్తే అటు ఆకాశానికి అందక, ఇటు భూమి మీద పాదాలు నిలువక ఎటు నుంచి ఎటు జారుతారో కూడా తెలియదు మరి. టీడీపీలో చంద్రబాబు చేస్తున్న ఈ ఫీట్లు రేపటి రోజుల ఏ తీరానికి చేరుస్తాయో చూడాల్సిందే.

Tags:    

Similar News