ఆ జ్వరంతో బాబు.. పులిహోర కలుపుతున్నారుగా ?

చంద్రబాబు లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్పడంతో తనకు తానే సాటి. అలాంటిది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట జమిలి ఎన్నికలు అన్న మాట వచ్చిన తరువాత [more]

;

Update: 2021-02-03 12:30 GMT

చంద్రబాబు లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్పడంతో తనకు తానే సాటి. అలాంటిది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట జమిలి ఎన్నికలు అన్న మాట వచ్చిన తరువాత అసలు ఊరుకుంటారా. అందుకే ఆయన జూమ్ యాప్ మీటింగుల్లో జమిలి జపం చేస్తూ తమ్ముళ్ళకు తెగ బోరు కొట్టిస్తున్నారు. రేపో మాపో ఎన్నికలు వస్తాయని అంతా రెడీగా ఉంటే అందలం మనదేనంటూ తెగ ఉబ్బేస్తున్నారు. జగన్ సర్కార్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదంటే ఉండదని సర్వేలు, జాతకాలు కలిపి పెద్ద పులిహోరే వండేస్తున్నారు.

అయ్యే పనేనా….?

ఏపీలో చూస్తే చంద్రబాబుకు జమిలి ఎన్నికలు కావాలి. కానీ అయిదేళ్ళు పూర్తిగా నిండకుండా అధికారాన్ని వదులుకోమంటే ఏ ముఖ్యమంత్రి వదులుకుంటాడు. అసలు 2014 నుంచి జమిలి ఎన్నికల మాట వినిపిస్తూనే ఉంది. నాడు చంద్రబాబు కానీ ఆయన తనయుడు లోకేష్ కానీ చెప్పిన మాటలు ఏంటి. అయిదేళ్ళలో చివరి ఘడియ అధికారాన్ని కూడా తాము వదులుకోమని పెదబాబు, చినబాబూ నాడు భారీ స్టేట్మెంట్లు ఇచ్చిన వారే కదా. మరి చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి జమిలి ఎన్నికలు పెట్టాలని అంటున్నారు. కానీ దేశంలో చాలా మంది నాయకులు జమిలి వద్దు అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, వామపక్షాలు అయితే ససేమిరా అనేస్తున్నాయి. ఇక బలమైన ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.

ఈజీ కాదుగా …

ఓ వైపు దేశంలో గడువు తీరిన అసెంబ్లీలకు ఎన్నికలు చకచకా జరిగిపోతున్నాయి. వేటికీ ఎక్కడా బ్రేకులు లేవు. ఈ ఒక్క ఏడాదే ఆరు రాష్ట్రాలో ఎన్నికలు ఉన్నాయి. నిజంగా జమిలి ఎన్నికల గురించి ఆలోచన కేంద్రానికి సీరియస్ గా ఉంటే ఈ పాటికి వీటిని ఆపించేసి ఉండేవారు కదా అన్న లాజిక్ పాయింటుని రాజ్యాంగ నిపుణులు కొంతమంది తీస్తున్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నో పార్టీలు ఉన్నాయి. భిన్న ఆలోచనలు, విభిన్న పోకడలతో ఉన్న దేశ రాజకీయాల్లో ఒకే ఎన్నిక అంటే అసలు కుదరదు అంటున్నారు. బీజేపీకి ఎంత బలం ఉన్నా కూడా మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతో పాటు ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం అంటే అది సంక్లిష్టమైన వ్యవహారమే అంటున్నారు.

యాంటీ సెంటిమెంట్ గా ….

ఇక బీజేపీకి జమిలి ఎన్నికలు లేక ముందస్తు ఎన్నికలు అంటే యాంటి సెంటిమెంట్ కూడా ఉంది. కమలనాధులు అసలే సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. 2004 లో కూడా ఆరు నెలల ముందు ఎన్నికలను జరిపించాలని చంద్రబాబు బీజేపీ పెద్దలను ఒప్పించారు. చివరకు అక్కడా ఇక్కడా కూడా రెండు పార్టీలూ ఓడాయి. ఇక బీజేపీకి గట్టిగా మూడేళ్ళ అధికారం ఉంది. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు అనుకున్నా మరో రెండేళ్ల పవర్ ని త్యాగం చేయాల్సిందే. పైగా రైతుల ఉద్యమంతో పాటు, దిగజారిన ఆర్ధిక రంగం, పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం దేశంలో బీజేపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత ఇవన్నీ కలసి నట్టేట ముంచితే గతేంటి అన్న బెంగ కూడా ఉందిట. దాంతో బీజేపీకి మదిలో జమిలి మోజు ఉన్నా బెంగ కూడా అదే తీరున ఉందని చెబుతున్నారు. కానీ ఇవేమీ ఆలోచించని చంద్రబాబు మాత్రం 2022లో జమిలి ఎన్నికలు అనుకుని తెగ కలలు కంటున్నారు అంటున్నారు. ఒక వేళ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు 2024లో జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏంటో అని సొంత పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయట.

Tags:    

Similar News