పాత నినాదానికి దుమ్ము దులిపిన

చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అంటారు. దానికి తగినట్లుగా ఆయన ఇంకా ప్రింట్ మీడియా యుగంలోనే ఉన్నారని అంటారు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో కధ నడిపితే [more]

Update: 2021-01-29 06:30 GMT

చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అంటారు. దానికి తగినట్లుగా ఆయన ఇంకా ప్రింట్ మీడియా యుగంలోనే ఉన్నారని అంటారు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో కధ నడిపితే మళ్లీ సీఎం సీటు నాదేనని చంద్రబాబు 2019 ఎన్నికల్లో అతి ధీమాకు పోయారు. కానీ అదే సమయంలో స్మార్ట్ ఫోన్ల యుగాన్ని తలచుకుని మరీ వైసీపీ సోషల్ మీడియాకు జై కొట్టింది. దాంతో బయట మీడియా మద్దతు టీడీపీకి కనిపించినా సోషల్ మీడియా అండదండలతో వైసీపీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా సులువుగా మార్చుకోగలిగింది. దీని వెనక ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కూడా వున్నాయి. మొత్తానికి ఫలితం దక్కింది.

అదే అస్త్రంతో….

ఇపుడు టీడీపీ పాత వాసనలను కాస్తా పక్కకు పెట్టింది. సోషల్ మీడియాను గట్టిగా నమ్ముకుంటోంది. ఏపీలో జరుగుతున్న ప్రతీ పరిణామాన్ని గత కొంతకాలంగా టీడీపీ సామాజిక మాధ్యమాలలో పెడుతూ వస్తోంది. దాని ద్వారా జనాల్లో చైతన్యం కలిగించాలని చూస్తోంది. ఏపీలో అభివృద్ధి అన్నది లేదని, అరాచకాలు ప్రబలిపోయాయన్నది టీడీపీ స్లోగన్. దాంతోనే వైసీపీని ఢీ కొట్టాలనుకుంటోంది. ఏపీని టీడీపీ అన్ని రంగాల్లో ముందు వరసలో పెడితే జగన్ మాత్రం అత్యంత వెనకకు తీసుకుపోతున్నాడని కూడా చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా సోషల్ మీడియాలో క్షణాల్లో వస్తోంది.

పప్పు బెల్లాలేనా…?

ఏపీలో సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీయార్ అంటారు. అంటే ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకుడు. మరి ఆయన పార్టీలో ఉంటున్న చంద్రబాబు ఇపుడు సంక్షేమానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. ఏపీ జనాలకు కావాల్సింది అభివృద్ధి తప్ప పప్పు బెల్లాలు కాదు అని కూడా చంద్రబాబు చెబుతున్నారు. ఇలా అప్పులు చేసి ఎంతకాలం ఏపీలో జనాలకు పందేరాలు ఇస్తారని కూడా నిలదీస్తున్నారు. తమ హయాంలో పాతిక వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని, వైసీపీ అక్కడ అంగుళం రోడ్డు అయినా వేసిందా అంటూ చంద్రబాబు సంధిస్తున్న ప్రశ్నలు జనాల్లోకి వెళ్ళాలన్నదే ఆ పార్టీ తపన.

అజెండా రెడీ…..

ఒక విధంగా స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం సిధ్ధపడుతున్నా ఆ పార్టీ 2024 ఎన్నికల అజెండా ఏంటి అన్నది కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు. అంటే 1999 నాటి చంద్రబాబు నినాదం అన్న మాట. నాడు ఎన్టీయార్ తో పడక వేరుగా మారి టీడీపీని హస్తగతం చేసుకున్న తరువాత చంద్రబాబు ఆయన సంక్షేమ పధకాలకూ నీళ్ళు వదిలారు. పైగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ అంటూ తిరిగారు. దాని ఫలితంగా 2004 ఎన్నికల్లో ఓడారు. అపుడు వైఎస్సార్ పఠించిన సంక్షేమ మంత్రం ఇప్పుడు జగన్ ఏలుబడిలో పదింతలు బిగ్గర‌గా వినిపిస్తోంది. చంద్రబాబు కూడా 2014 ఎన్నికల వేళ సంక్షేమమే తనకు శ్రీరామ రక్ష అనుకున్నారు. కానీ జగన్ ఆకాశమే హద్దుగా అన్నట్లుగా అనేక పధకాలు అమలు చేయడంతో ఇక పోటీ పడలేమనుకున్న టీడీపీ పెద్దలు ఇపుడు ఒక్కసారిగా రూట్ మార్చేస్తున్నారు. మరి జగన్ సంక్షేమానికి చంద్రబాబు అభివృద్ధికి మధ్య పోటీలో జనం ఎటు వైపు ఉంటారో చెప్పడానికి జస్ట్ ఒక శాంపిల్ గా స్థానిక ఎన్నికలు ఉంటాయన్న మాట.

Tags:    

Similar News