బాబుదేమీ లేదా.. ఇలా పంచేసుకుంటారా..?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో చంద్రబాబుకే తెలియదు. ఏపీలో గత ఇరవై నెలల్లో ఆ పార్టీ ఏమాత్రం పెరిగింది అన్నది అధినాయకత్వానికే తెలియదు. ఇక స్థానిక [more]

;

Update: 2021-02-13 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో చంద్రబాబుకే తెలియదు. ఏపీలో గత ఇరవై నెలల్లో ఆ పార్టీ ఏమాత్రం పెరిగింది అన్నది అధినాయకత్వానికే తెలియదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటూ మెజారిటీ ఓట్లూ సీట్లూ అధికార పార్టీకే వెళ్తాయి. దాంతో వచ్చే ఎన్నికల వరకూ టీడీపీ బండిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడమే చంద్రబాబు పని. ఆయనకు సహకరించి పార్టీ కట్టు తప్పకుండా చూడడం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇతర పెద్దల పని.

బాబుకే షాక్ …

అయితే తరచూ అరెస్టులతో అచ్చెన్నాయుడు ఏపీలో హైలెట్ అవుతున్నారు. జగన్ కూడా చంద్రబాబుని పక్కన పెట్టి అచ్చెన్న లాంటి వారినే టార్గెట్ చేస్తోంది. దాంతో టీడీపీలో ఫోకస్ మొత్తం అచ్చెన్న వైపే ఉంటోంది. ఈ పరిణామాలతో అచ్చెన్నాయుడు చాలానే ఊహిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తాను హోం మంత్రి అవుతాను అంటూ ఆయన బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది సడెన్ గా ఆవేశంలో వచ్చింది అనుకుంటే పొరపాటే. మనసులో ఎప్పటి నుంచో ఉంటేనే తప్ప ఇలా బయటకు రాదు అని పార్టీలో తమ్ముళ్లే అంటున్నారు. ఒక విధంగా ఇది అధినేత చంద్రబాబుకే షాక్ ఇచ్చే స్టేట్ మెంట్ అని కూడా అంటున్నారు.

మరీ ఇలాగనా…?

ఆలూ లేదూ చూలూ లేదు అని ఒక సామెత ఉంది. అలాగే ఇంకా అధికారంలో ఉన్న పార్టీకి గట్టిగా మూడున్నరేళ్ల కాలం ఉంది. ఆ తరువాతే ఎన్నికలు. అపుడు కూడా గ్యారంటీగా గెలుస్తామన్నదీ లేదు. కానీ ఆదికి ముందే ఈ మంత్రి పదవుల పంపిణీ ఏంటి అన్నదే పసుపు పార్టీలో చర్చగా ఉంది. ఇప్పటికే టీడీపీలో అచ్చెన్నకు చంద్రబాబు ఇస్తున్న వెయిట్ తో మిగిలిన సీనియర్ నేతలు తెగ గుస్సా అవుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న మేమేం తక్కువ అని కూడా వారు ఆఫ్ ది రికార్డుగా మండుతున్నారు. ఇపుడు టీడీపీలో చంద్రబాబు ప్రమేయం లేకుండా ఫలానా మంత్రి పదవి అంటూ తానే అచ్చెన్నాయుడు ఎంచుకోవడం అంటే అది పూర్తిగా పార్టీ విధానాలకే వ్యతిరేకం అంటున్నారు. ఎవరిని ఏ పదవి ఇవ్వాలో చంద్రబాబుకు బాగా తెలుసు అన్న మాట కూడా తమ్ముళ్ళ నుంచి వినిపిస్తోంది.

పట్టు జారుతోందా…?

అయితే అచ్చెన్న వ్యాఖ్యల మీద మరో వైపు పార్టీలోనే కాదు బయట కూడా వేరే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మునుపటి మాదిరిగా చంద్రబాబుకు పార్టీలో పట్టు లేదని దానికి ఉదాహరణే అచ్చెన్న లాంటి వారు మంత్రి పదవులు స్వయంగా ఎంచుకోవడం అని ఎత్తి చూపుతున్నారు. ఇదే రకమైన ధోరణి అచ్చెన్నలోనే కాదు, చాలా మంది పార్టీ నాయకులకు ఉందిట. ఇపుడు పార్టీలో గొంతు విప్పుతున్న చాలా మంది టీడీపీ మీడియా బేబీలు పవర్ లోకి వస్తే తామే మంత్రులమని అపుడే గట్టిగా చెప్పుకుంటున్నారుట. జనాలలో కనిపించని వారు, టీడీపీ అనుకూల మీడియా ద్వారా పెద్ద నోరు చేసే వారి వల్ల టీడీపీ ఎలా అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ అపుడే మంత్రి పదవుల పంపిణీ మాత్రం టీడీపీలో జోరుగా సాగుతోందని సెటైర్లు పడుతున్నాయి. ఇవన్నీ సరే కానీ లోకేష్ బాబుకు ఏ శాఖ అయినా తమ్ముళ్ళు మిగిల్చారా అన్నదే అసలైన ప్రశ్న.

Tags:    

Similar News