షర్మిలకు పోటీగా బ్రాహ్మణి… నిజమేనటగా?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎంతసేపూ ఒకరిని అనుసరించడమే చేస్తారు అన్న టాక్ అయితే ఉంది. ఆయన సొంతంగా ఆలోచన చేసి తన మార్క్ [more]
;
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎంతసేపూ ఒకరిని అనుసరించడమే చేస్తారు అన్న టాక్ అయితే ఉంది. ఆయన సొంతంగా ఆలోచన చేసి తన మార్క్ [more]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎంతసేపూ ఒకరిని అనుసరించడమే చేస్తారు అన్న టాక్ అయితే ఉంది. ఆయన సొంతంగా ఆలోచన చేసి తన మార్క్ ని గట్టిగా చాటుకోవడం కంటే నలిగిపోయిన అలవాటు పడిన రాజకీయం చేయడం ద్వారా సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటారు. ఇపుడు కూడా ఆయన అదే చేయబోతున్నారు. తెలంగాణా రాజకీయాలో వైఎస్సార్ లెగసీ ఏదో విధంగా ప్రవేశిస్తోంది. షర్మిల రూపంలో తెలంగాణాలో జెండా పాతడానికి వైఎస్సార్ ఫ్యామిలీ చూస్తోంది అన్న టాక్ అయితే ఉంది. దాంతో చంద్రబాబు పార్టీలోనూ దీని మీద అతి పెద్ద చర్చ సాగుతోందిట.
ఆమె రావాలి ….
తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీని ఏలిన చంద్రబాబు హైదరాబాద్ కే తన పాలనలో పెద్ద పీట వేశారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి బాబు చేసిన కృషిని కూడా ఎవరూ మరచిపోలేరు. ఇక చంద్రబాబు మార్క్ విజన్ సైబరాబాద్ సిటీ రూపంలో ఎప్పటికీ కళ్ల ముందు ఉంటుంది. మరో వైపు చూసుకుంటే తెలంగాణాలో టీడీపీకి ప్రాణం ఇచ్చే క్యాడర్ కూడా ఉంది. ఇలా ఎన్ని బలాలు ఉన్నా కూడా చంద్రబాబు మాత్రం అక్కడ పార్టీని అర్ధాంతరంగా వదిలిపెట్టేశారు. ఏపీ మీదనే తండ్రీ కొడుకులు దృష్టి పెట్టి పోరాడుతున్నారు. ఇపుడు మాత్రం షర్మిల రాజకీయం టీడీపీలో కూడా కలకలం రేపుతోందిట. చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణిని తెలంగాణా రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని బాబు మీద వత్తిడి పెరుగుతోంది అంటున్నారు.
ఫోకస్ అంతా ….
ఇక షర్మిల పార్టీ పెట్టడాన్ని తెలంగాణావాదులు వ్యతిరేకిస్తున్నా ఆ సౌండ్ పెద్దగా లేదు. ఎందుకంటే తెలంగాణా వచ్చేసి ఏడేళ్లు దాటిపోయాయి. ఇపుడు సుపరిపాలన మీదనే చర్చ బాగా ఉంది. అంటే ఉమ్మడి ఏపీ నాటి వాతావరణం మళ్లీ కనిపిస్తోంది. దాంతో ఆంధ్రా మూలాలు ఉన్న షర్మిల పార్టీ అంటే దాన్ని కూడా రాజకీయంగానే ఎదుర్కోవాలనే అంతా చూస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాహ్మణిని కూడా తీసుకువస్తే రాణిస్తారు అన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి మహిళా పారిశ్రామికవేత్తగా ఉంటున్న బ్రాహ్మణి అయితే అటు నారా, ఇటు నందమూరి వారి వారధిగా ఫోకస్ అవుతారని కూడా అంచనా వేస్తున్నారుట.
బిగ్ ఫైట్…..?
తెలంగాణాలో టీయారెస్ అధికారంలో ఉంది. బీజేపీ పవర్ మీద గురి పెట్టి ఉంది. మరో వైపు కాంగ్రెస్ విపక్షంగా ఉంది. ఈ పరిస్థితుల్లో షర్మిల కొత్త పార్టీ వస్తే సహజంగా ఇపుడు ఉన్న పార్టీలకు గట్టి దెబ్బ తగులుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ లీడర్ మళ్ళుతుంది అంటున్నారు. ఇక టీడీపీకి సరైన లీడర్ షిప్ ఇవ్వకపోతే వారు కూడా షర్మిల వైపు జారుకుంటారు అన్న భయం పసుపు పార్టీ పెద్దలలో ఉందిట. అందుకే తెలంగాణాలో టీడీపీ అస్థిత్వం కాపాడుకోవడంతో పాటు మారుతున్న రాజకీయాలకు తగినట్లుగా వ్యూహాలు రచిస్తే మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అన్న ఆలోచన అయితే చంద్రబాబుకు ఉందని అంటున్నారు. అంటే షర్మిలకు పోటీగా బ్రాహ్మణి వస్తే మాత్రం బిగ్ ఫైట్ కి వేదికగా తెలంగాణా అవుతుంది అని చెప్పాలి.