కుప్పంలో దారుణ ఓటమికి కారణాలివేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించలేదు. తన కంచుకోటలో తనదే ఆధిపత్యం అనుకున్నారు. 35 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలు పంచాయతీ ఎన్నికల్లోనూ తనకు [more]

;

Update: 2021-02-19 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించలేదు. తన కంచుకోటలో తనదే ఆధిపత్యం అనుకున్నారు. 35 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలు పంచాయతీ ఎన్నికల్లోనూ తనకు అండగా నిలబడతారని ఊహించారు. కానీ చంద్రబాబు లెక్క తప్పింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుప్పంలో చంద్రబాబు పార్టీ దారుణ ఓటమికి గురయింది. బయటకు బింకంగా కన్పిస్తున్నా చంద్రబాబుకు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశకు గురిచేశాయనే చెప్పాలి.

పైకి చెబుతున్నా….

కుప్పంలో తమ ఓటమికి వైసీపీ అరాచకాలే కారణమని, నలభై కోట్ల రూపాయలు వెచ్చించి పంచాయతీలను కైవసం చేసుకున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును కేవలం కుప్పం ప్రజలు డబ్బుతోనే దూరమవుతారని భావించలేం. డబ్బు కంటే తమ నేత ప్రతిష్టమనుకునే నిజంగా కుప్పం ప్రజలు భావించి ఉంటే ఈ రిజల్ట్ ను చంద్రబాబుకు ఇవ్వరు.

ఓట్ల పరంగా చూసుకున్నా…..

కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీల్లో వైసీపీ గెలిచింది. 14 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఓట్ల పరంగా చూసుకుంటే 74 పంచాయతీల్లో అన్నింటినీ కలుపుకుంటే వైసీపీకి దాదాపు ముప్ఫయి వేల ఓట్లకు పైగానే మెజారిటీ లభించింది. ఇక టీడీపీ గెలుచుకున్న 14 పంచాయతీల్లో అన్ని కలిపి ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ కేవలం 1800 మాత్రమే. దీన్ని బట్టే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారని స్పష్టమవుతుంది.

నిర్లక్ష్యం.. నిర్లిప్తత……

అయితే అంతర్గతంగా చంద్రబాబు ఓటమిగల కారణాలను కుప్పం నేతలతో విశ్లేషించినట్లు తెలిసింది. ఇందులో పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోకపోవడం ఒక కారణంగా చూస్తున్నారు. వైసీపీ దూకుడుగా వెళుతున్నా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా కిందకు చేరలేదని తెలుస్తోంది. అలాగే చంద్రబాబు కూడా కుప్పం నియోజకవర్గాన్ని దాదాపు ఇరవై నెలల నుంచి పట్టించుకోక పోవడం కూడా ఓటమికి ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తప్పిదం కూడా ఈ ఓటమిలో ఉందని తేలింది. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రజలు ఆయనను తిరస్కరించారన్నది వాస్తవం. పార్టీ గుర్తులు లేకపోయినా మద్దతు దారులు గెలిచినా కూడా చంద్రబాబు గెలిచినట్లే. కానీ కుప్పం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పరువును బజార్లో పెట్టేశారు.

Tags:    

Similar News