టీడీపీని హ‌స్త గ‌తం చేసుకునే దిశ‌గా `నంద‌మూరి` ఫ్యామిలీ

తెలుగు వారి ఆత్మగౌర‌వ నినాదంతో 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం.. అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు.. ఆశ‌లు నెర‌వేర‌డం లేదా ? [more]

;

Update: 2021-03-07 14:30 GMT

తెలుగు వారి ఆత్మగౌర‌వ నినాదంతో 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం.. అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు.. ఆశ‌లు నెర‌వేర‌డం లేదా ? తెలుగు ప్రజ‌ల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పెద్దల ముందు మోక‌రిల్లకుండా చేయాల‌న్న.. ఎన్టీఆర్ ఆశయం నానాటికీ.. చిన్న బోతోందా? ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు పార్టీని స‌మ‌ర్ధవంతంగా న‌డిపించ‌లేక పోతున్నారా? ఎక్కడిక‌క్క‌డ ఆయ‌న రాజీ ప‌డుతున్నారా ? ప‌్రధానంగా యువ నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడును చంద్రబాబు త‌ట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నారా? ఒక స్ట్రాట‌జీ లేకుండా.. ఇత‌ర‌ పార్టీలతో ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి.. టీడీపీని కోలుకోలేకుండా చేస్తోందా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు స‌గ‌టు టీడీపీ అభిమాని మ‌దిని తెగ తొల‌చి వేస్తున్నాయి.

ఒక్కటైన నంద‌మూరి కుటుంబం….

ఇవి.. ఎవ‌రో సామాన్యులు.. టీడీపీ నేత‌లు.. ఆలోచిస్తున్న విష‌యాలు కానేకాదు! అన్నగారి కుటుంబం.. నంద‌మూరివార‌సులు.. ఆలోచిస్తున్న సంచ‌ల‌న విషయాలు. 1995లో టీడీపీని ఎన్టీఆర్ నుంచి దూరం చేసి.. త‌ను అధ్యక్షుడైనా.. చంద్రబాబును స్వాగ‌తించిన ఎన్టీఆర్‌ కుటుంబంలో ఇప్పుడు చంద్రబాబుపై అసంతృప్తి పెల్లుబుకుతోంది. పార్టీని ముందుకు న‌డిపిస్తార‌ని.. త‌మ తండ్రికంటే ఎక్కువ‌గా పార్టీని ప్రజ‌ల్లో నిల‌బెడ‌తార‌ని నంద‌మూరి కుటుంబం పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేర‌డం లేద‌ని ఈ కుటుంబంలోని కీల‌క నేత‌లుగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ, ఎన్టీఆర్ కుమార్తె.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురందేశ్వరి, ఆమె భ‌ర్త.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు, దివంగ‌త హ‌రికృష్ణ కుటుంబం కూడా భావిస్తోంది.

హ‌స్తగ‌తానికి కార‌ణాలు….

ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. పార్టీ మ‌రింత ప‌త‌నావ‌స్థకు చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని వీరు ఒక నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా నంద‌మూరి కుటుంబంలోని కీల‌క పెద్దలు అంద‌రూ ఇటీవ‌ల‌ చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అత్యంత ర‌హ‌స్యంగా ఓ హోట‌ల్‌లో భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ ప‌రిస్థితిపై వారు సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్టు అత్యంత విశ్వస‌నీయ స‌మాచారం. ఈ క్రమంలో పార్టీని ఇంకా చంద్రబాబు చేతుల్లోనే ఉంచ‌డం వల్ల ఎలాంటి లాభం లేద‌ని వారు భావించిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే సాధ్యమైనంత వేగంగా పార్టీని ఆయ‌న నుంచి తాము హ‌స్తగ‌తం చేసుకోవాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం.

పుంజుకోవాలంటే….

ఇప్పుడున్న ప‌రిస్థితిలో చంద్రబాబు నాయ‌క‌త్వం ఫేడ్ అవుట్ అయింద‌ని నంద‌మూరి కుటుంబం తేల్చేసింది. ముఖ్యంగా జ‌గ‌న్ దూకుడుకు చంద్రబాబు ఎక్కడా.. ఏద‌శ‌లోనూ అడ్డుక‌ట్టవేయ‌లేక‌పోతున్నా ర‌ని.. ప్రధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనే ఆయ‌న‌పై వ్యతిరేక‌త పెరుగుతోంద‌ని.. ఆయ‌న‌ను న‌మ్ముకుని పెట్టుబ‌డులు పెట్టిన వారు నిండా మునిగిపోయార‌ని.. అమ‌రావ‌తి వంటి కీల‌క ప్రాజెక్టునుముందుకు న‌డిపించ‌లేక పోగా.. ప్రత్యేక హోదా విష‌యంలోనూ ఆయ‌న వేసిన పిల్లిమొగ్గలు అంతిమంగా పార్టీని న‌ష్టప‌రిచాయ‌ని.. దీంతో త‌మ తండ్రి ఏ ఆశ‌యంతో పార్టీ పెట్టారో.. అది నెర‌వేర‌డం లేద‌ని ఒక నిర్ణయానికి వ‌చ్చారు.

ఆచితూచి.. వేచి చూసినా..

వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి ఉంటే.. నంద‌మూరి ఫ్యామిలీలో ఈ ఆవేద‌న చోటు చేసుకుని ఉండేది కాద‌ని తెలుస్తోంది. ఆ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోవ‌డం.. గెలిచిన నాయ‌కుల‌ను కూడా చంద్రబాబు నిల‌బెట్టుకోలేక పోవ‌డం.. ఆ త‌ర్వాత బీజేపీతో వ్యవ‌హ‌రించిన తీరు(త‌మ తండ్రి కాలంలో బీజేపీతో పొత్తు నిరాటంకంగా సాగిన తీరును చ‌ర్చించారు) వంటివి పార్టీకి శాపాలుగా మారాయ‌ని నంద‌మూరి ఫ్యామిలీ చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.

లోకేష్ కోసం బ‌లి చేస్తున్నారా?

నంద‌మూరి ఫ్యామిలీ జ‌రిపిన చ‌ర్చలో చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజ‌కీయంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న పుంజుకోలేక‌పోయిన విదానం. అదే స‌మ‌యంలో ఆయ‌న కోసం.. చంద్రబాబు పార్టీని ఫ‌ణంగా పెడుతున్న తీరును నంద‌మూరి కుటుంబం ఖండించింది. ఇది.. ఏ ఒక్కరికోస‌మో పుట్టిన పార్టీ కాద‌ని.. తెలుగు నేల‌కోసం.. ప్రజ‌ల‌కోసం స్థాపించిన పార్టీ అని.. దీనిని నిర్వీర్యం చేయ‌డాన్ని స‌హించేది లేద‌ని తెగేసి నిర్ణయం తీసుకోవాల‌ని భావిస్తున్నారు.

రంగంలోకి జూనియ‌ర్….

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల లోపే.. టీడీపీని త‌మ వైపు తిప్పుకోవాల‌ని నిర్ణయించుకున్నట్టు విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. అయితే.. పార్టీని న‌డిపించేది.. మ‌ళ్లీ ఎన్టీఆర్ చ‌రిష్మాను తీసుకువ‌చ్చేది ఎవ‌ర‌నే విష‌యంపై నంద‌మూరి ఫ్యామిలీ ప్రత్యేకంగా చ‌ర్చించిన‌ప్పుడు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. వాస్తవానికి నంద‌మూరి కుటుంబంలో ఐదుగురు కీల‌క నాయ‌కులు ఉన్నారు. అయిన‌ప్పటికీ.. పార్టీని న‌డిపించే స్థాయి జూనియ‌ర్ కు మాత్రమే ఉంద‌ని.. ఇటు మాస్‌లోను, అటు క్లాస్‌లోను జూనియ‌ర్‌కు ఫాలోయింగ్ ఉంద‌ని భావిస్తున్నారు.

నారా వైఫల్యాల వల్లనే…?

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాదిన్నరలోనే నంద‌మూరి కుటుంబం క‌లిసి క‌ట్టుగా ఒకే తాటిమీద‌కు వ‌చ్చే అవ‌కాశాలు అయితే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నుంచి తాను బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధమ‌ని పురందేశ్వరి.. తాను కూడా కీల‌క రోల్ పోషిస్తాన‌ని ద‌గ్గుబాటి వెల్లడించిన‌ట్టు స‌మాచారం. ఇలా మొత్తంగా చూస్తే.. చంద్రబాబు వైఫ‌ల్యాలు.. ఆయ‌న‌కు పార్టీని దూరం చేస్తున్నాయ‌నే విష‌యం అత్యంత విశ్వస‌నీయంగా తెలుస్తోంది. అయితే రాజ‌కీయ ఉద్దండుడు అయిన చంద్రబాబుకు నందమూరి కుటుంబం ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి ఎంత వ‌ర‌కు చెక్ పెడుతుంది ? అన్నది కూడా ఆస‌క్తిక‌ర‌మే ?

Tags:    

Similar News