అక్కడ పార్టీ అనాధ అయినా పట్టించుకోరా?

ఏపీలో గ‌త ఆరేడు నెల‌ల వ‌ర‌కు పార్టీకి ఓ నాథుడంటే లేని నియోజ‌క‌వ‌ర్గాలు 50 వ‌ర‌కు ఉండేవి… చంద్రబాబు ఎన్నో క‌స‌ర‌త్తులు చేసి… ఎంతోమందిని బ‌తిమిలాడి.. వెతికి [more]

;

Update: 2021-03-27 11:00 GMT

ఏపీలో గ‌త ఆరేడు నెల‌ల వ‌ర‌కు పార్టీకి ఓ నాథుడంటే లేని నియోజ‌క‌వ‌ర్గాలు 50 వ‌ర‌కు ఉండేవి… చంద్రబాబు ఎన్నో క‌స‌ర‌త్తులు చేసి… ఎంతోమందిని బ‌తిమిలాడి.. వెతికి వెతికి ఓ 15 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించారు. వీటికే చంద్రబాబుకు త‌ల‌ప్రాణం తోక‌మీద‌కు వ‌చ్చింది. పార్టీలో అవుట్ డేటెడ్ నేత‌లు.. ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు మ‌రో 30 పై మాటే ఉన్నాయి. రాయ‌ల‌సీమ‌లో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలా ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పార్టీ ఇన్‌చార్జ్ పోస్టు ఇస్తాం తీసుకోండి చంద్రబాబు అని మొత్తుకుంటున్నా ఎవ్వరూ ముందుకు రాని ప‌రిస్థితి. ప్రొద్దుటూరులో ఏదోలా మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి సోద‌రుడు త‌న‌యుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డిని నిల‌బెట్టారు.

ఎవరిని అడిగినా…?

క‌డ‌ప‌, జ‌మ్మల‌మ‌డుగు, పులివెందుల లాంటి చోట్ల చంద్రబాబు పిలిచినా ఎవ్వరూ ముందుకు రావ‌డం లేదు. క‌నీసం మండ‌ల స్థాయి నేత‌ల‌ను అడుగుతున్నా వారు లైట్ తీస్కొంటున్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన‌, జ‌రుగుతోన్న స్థానిక ఎన్నిక‌ల‌ను చూస్తే ప్రతిప‌క్ష టీడీపీ పూర్తిగా క‌నుమ‌రుగు అయ్యింది. పులివెందుల నుంచి ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఎమ్మెల్యేగా ఉంటే… దాని ప‌క్కనే ఉన్న జ‌మ్మల‌మ‌డుగులో సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యే. పులివెందుల‌లో ఐదుసార్లు వ‌రుస‌గా వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ స‌తీష్‌రెడ్డి అస్త్రస‌న్యాసం చేశారు. పార్టీ త‌న‌కు అన్యాయం చేసింద‌ని ఆయ‌న రాజీనామా చేయ‌డంతో పులివెందుల టీడీపీ అనాథ అయ్యింది.

రవికి బాధ్యతలను ఇచ్చినా…..

అక్కడ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వికి బాధ్యత‌లు చంద్రబాబు ఇచ్చినా ఆయ‌న వ‌ల్ల ఏ మాత్రం యూజ్ లేదు. ఇక జమ్మల‌మ‌డుగులో మాజీ మంత్రి ఆది, రామ‌సుబ్బారెడ్డి బాబుకు హ్యాండ్ ఇవ్వడంతో అక్కడ కూడా ఎవ్వరూ ముందుకు రాక‌పోవ‌డంతో జ‌మ్మల‌మ‌డుగు బాధ్యత‌లు కూడా బీటెక్ ర‌వి చేతుల్లోనే పెట్టారు. పులివెందుల‌లోనే బీటెక్ ర‌వికి డిపాజిట్ తెచ్చే ద‌మ్మైనా ఉందా ? అన్న సందేహం ఉంటే… పైగా ఆయన‌కు జ‌మ్మల‌మ‌డుగు ఆప్షన్ కూడా చంద్రబాబు ఇచ్చారు. దీంతో టీడీపీ వ‌ర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఎంత దారుణం అంటే బీ టెక్ ర‌వి స్వగ్రామం అయిన పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని సింహాద్రిపురం మండ‌లం క‌సనూరు పంచాయ‌తీలో కూడా ఆయ‌న పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేక‌పోయారు.

జనరల్ అయినా….?

ఈ పంచాయ‌తీ జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ అయినా ర‌వి త‌న కుటుంబం నుంచి ఎవ్వరిని పోటీలోకి దింప‌నే లేదు. ఇక పులివెందుల మున్సిపాల్టీలో 33 వార్డుల‌కు 33 వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక జ‌మ్మల‌మ‌డుగులో అయినా టీడీపీకి వైసీపీకి పోటీ లేదు. అక్కడ బీజేపీలో ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి మాత్రమే ఆ పార్టీ త‌ర‌పున క‌నీసం కొన్ని చోట్ల అయినా అభ్యర్థుల‌ను నిల‌బెట్టుకోగా… అక్కడ టీడీపీ బీజేపీకి స‌పోర్ట్ చేస్తోన్న దుస్థితి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు మాట అటు ఉంచితే క‌నీసం ఈ దుస్థితి నుంచి టీడీపీని బ‌య‌ట‌పడేసి అభ్యర్థుల‌ను నిల‌బెట్టే నేతలు అయినా చంద్రబాబుకు ఎప్పటికి దొరుకుతారో ? చూడాలి.

Tags:    

Similar News