నీవు నేర్పిన విద్యయే చంద్రబాబూ ?

చంద్రబాబుది చాలా విచిత్రమైన రాజకీయం. ఏదైనా తాను చేస్తే ఒప్పు అదే పక్కవారు చేస్తే తప్పు అన్నట్లుగా ఆయన వైఖరి ఉంటుంది. పూర్తి మెజారిటీతో చేతికి అధికారాన్ని [more]

Update: 2021-03-19 13:30 GMT

చంద్రబాబుది చాలా విచిత్రమైన రాజకీయం. ఏదైనా తాను చేస్తే ఒప్పు అదే పక్కవారు చేస్తే తప్పు అన్నట్లుగా ఆయన వైఖరి ఉంటుంది. పూర్తి మెజారిటీతో చేతికి అధికారాన్ని 2014 ఎన్నికల్లో ప్రజలు అప్పగించిన నాడు చంద్రబాబు పాలన మానేసి ఫిరాయింపుల పర్వానికి తెర తీశారు. ఆ విధంగా వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాగేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి వైసీపీని నిర్వీర్యం చేయాలనుకున్నారు. కానీ సీన్ సితారై అవే 23 సీట్లు 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి వచ్చాయి.

ద్రొహం చేశారా….?

ఇపుడు చంద్రబాబు తాపీగా జనాల ముందుకు వచ్చి తనకు సొంత పార్టీ నేతలే ద్రోహం చేస్తున్నారు అని కన్నీరు కారుస్తున్నారు. పార్టీ కష్టకాలంలో విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగి వెళ్లిపోయారని, పార్టీ ఫిరాయించారని చంద్రబాబు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఆయనను రెండు సార్లు ఎమ్మెల్యేను చేస్తే విపక్షంలో పార్టీ ఉన్న వేళ పోరాడకుండా అధికార పార్టీకి జై కొట్టడమేంటి అని తెగ గుస్సా అవుతున్నారు. మరిది ఎంతవరకూ న్యాయమని ఆయన జనాలనే తిరిగి ప్రశ్నించడం విడ్డూరమే.

నైతికత ఉందా….?

తమ నాయకుడిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేనేలేదని వాసుపల్లి గణేష్ కుమార్ అనుచరులు అంటున్నారు. తమ నేతకు టికెట్ ఇచ్చానని అంటున్నారని, కానీ ఆయన జనాల్లో ఉండి గెలిచారని, గెలుపులో ఆయన కష్టమే ఎక్కువగా ఉందని కూడా చెబుతున్నారు. ఇక చంద్రబాబు ఫిరాయింపుల మీద మాట్లాడడం హాస్యాస్పదమని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. చంద్రబాబు ఇపుడు ఏమీ చేయలేక నిస్సహాయంగా మాట్లాడుతున్నారని, కానీ ఆయన గతంలో చేసినది ఏంటి అని కూడా నిగ్గదీస్తున్నారు. ఇక జనాలు కూడా బాబు దీనాలాపలను ఏ మాత్రం సీరియస్ గా తీసుకోవడంలేదు అంటే ఆ తప్పు బాబుదే కదా.

ఎవరి చాన్స్ వారిదే….?

మూడు దశాబ్దాల క్రితం రాజకీయాలు ఇంతలా భ్రష్టు పట్టిపోలేదని తలపండిన రాజకీయ మేధావులు చెబుతారు. ఒక పార్టీ నుంచి గెలిచి నిస్సిగ్గుగా మరో పార్టీలోకి మారిపోవడం అన్నది తొంబై దశకం నుంచి పెచ్చుమీరిందని కూడా అంటారు. ఇక తెలుగు రాజకీయాల్లో ఫిరాయింపులు బాగా పెరిగినా, ఎన్నికలు ఖరీదుగా మారిపోయినా రాజకీయ అవినీతి పెరిగినా దానిలో తెలుగుదేశం పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. చంద్రబాబు 2014లో చేసిన ఫిరాయింపుల నిర్వాకం అలా కళ్ళ ముందు ఉండగానే వాసుపల్లిని పట్టుకుని విమర్శలు చేయడమేంటని కూడా అన్న వారూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే కానీ గతంలో చంద్రబాబు ఇలాంటివి ప్రోత్సహించి ఇపుడు సానుభూతి చూపించాలని జనాలను కోరితే ఫలితం ఏముంటుంది అన్న వారూ ఉన్నారు. ఎవరికి అవకాశం వచ్చినపుడు వారు జెండా ఎగరేస్తారు. ఆ సంగతి రాజకీయ దురంధరుడైన చంద్రబాబుకు తెలియనిది కాదు, కానీ ఆయనే తనకు వీలు కానపుడల్లా ధర్మ పన్నాలు వల్లించడమే బాగాలేదని అంటున్నారు.

Tags:    

Similar News