ఆ భయం ఎంతపని చేసింది బాబూ?

నేనెవరికీ భయపడనంటారు.. తనకు భయం లేదంటారు. అయితే ఆయన భయమే తమ కొంపముంచిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భయమే తమకు అన్ని రకాలుగా [more]

;

Update: 2021-03-21 03:30 GMT

నేనెవరికీ భయపడనంటారు.. తనకు భయం లేదంటారు. అయితే ఆయన భయమే తమ కొంపముంచిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భయమే తమకు అన్ని రకాలుగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయి అరుదైన రికార్డు సృష్టించారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కేవలం అమరావతి, పోలవరంపై పెట్టిన ఫోకస్ పార్టీపై పెట్టలేదు.

నామినేటెడ్ పోస్టులు…..

కనీసం నామినేటెడ్ పోస్టులను కూడా చంద్రబాబు భర్తీ చేయలేకపోయారు. ముఖ్యమైన టీటీడీ ఛైర్మన్ వంటి పదవులు తప్పించి జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయలేకపోయారు. ఎక్కడ పదవులు భర్తీ చేస్తే పార్టీలో అసంతృప్తి తలెత్తుతుందేమోనన్న భయం ఆయనకు ఉండటం కారణంగానే అనేక మంది నేతలు అవకాశం ఉన్నా పదవులు దక్కించుకోలేకపోయారు. వారంత ఇప్పడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకోవడానికి అదే ప్రధాన కారణం.

స్థానిక సంస్థల ఎన్నికలకూ….

నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు 2018లోనే జరగాలి. అప్పుడే చంద్రబాబు ధైర్యం చేసి ఉంటే పంచాయతీ ఎన్నికలు జరిగేవి. ఫలితాలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉండేవి. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా జరిపించి ఉంటే ఎక్కువ మంది టీడీపీ నేతలకు పదవులు దక్కేవి. వారంతా మొన్నటి ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా టీడీపీని కొంత గట్టెక్కించే ప్రయత్నం చేసేవారు.

పవర్ లో ఉన్నప్పుడే…..?

అధికారంలో ఉంది కాబట్టి నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ తరహాలోనే మున్సిపాలిటీల్లో కూడా అత్యధికం టీడీపీ సొంతమయ్యేవి. అయితే సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఏం ఫలితాలు వస్తాయోనన్న భయం ఒకవైపు, రెండోసారి కూడా అధికారం తనదేనన్న ధీమా మరొక వైపు చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేకపోయారు. ఇప్పుడు దాని ఫలితాన్ని దారుణంగా చూడాల్సి వస్తుంది. చంద్రబాబు భయమే పార్టీకి పెద్ద శాపమని టీడీపీ వర్గాలే అనుకుంటుండం విశేషం.

Tags:    

Similar News