బాబు క‌న్నెర్ర.. వారికి ప‌ద‌వులు ఉంటాయా ? ఊడతాయా ?

స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అయితే.. ఈ ఘోర త‌ప్పిదాన్ని ఎవ‌రి ఖాతాలో వేయాలి ? ఎవ‌రిని బాధ్యుల‌ను చేయాలి ? అనే అంశాలు [more]

;

Update: 2021-04-02 15:30 GMT

స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అయితే.. ఈ ఘోర త‌ప్పిదాన్ని ఎవ‌రి ఖాతాలో వేయాలి ? ఎవ‌రిని బాధ్యుల‌ను చేయాలి ? అనే అంశాలు పార్టీలో ఇప్పుడు తీవ్ర చ‌ర్చనీయాంశాలుగా మారాయి. అయితే.. ఇప్పుడు అంద‌రి వేళ్లూ కొత్తగా ప‌దవులు చేప‌ట్టిన పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల‌వైపే చూపుతున్నాయి. ప్రధానంగా స్థానిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ ప‌ద‌వుల‌ను సృష్టించి ఇచ్చారు. అదే స‌మ‌యంలో మండ‌ల‌స్థాయి పార్టీ నేత‌ల‌ను కూడా నియ‌మించారు. వీరంద‌రికీ చంద్రబాబు నిర్దేశించిన ల‌క్ష్యం ఒక్కటే.. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీని ముందుకు న‌డిపించ‌డ‌మే.

ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని……

అయితే.. ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌డంలోనూ.. చంద్రబాబు వ్యూహాల‌ను అందిపుచ్చుకోవ‌డంలోనూ ఎవ‌రూ ముందుకు రాలేక పోయారు. పార్టీ సీనియ‌ర్లు, మాజీ మంత్రులు కూడా యాక్టివ్ కాలేక పోయారు. ఫ‌లితంగా.. స్థానిక స‌మ‌రంలో టీడీపీ వెనుక‌బ‌డింది. కొంద‌రు పార్లమెంట‌రీ పార్టీ ఇన్‌చార్జ్‌లు బాగా క‌ష్టప‌డ్డారు… అయినా ఫ‌లితాలు రాలేదు. దాదాపు మూడొంతుల మంది అయితే త‌మ‌కేం ప‌ట్టన‌ట్టు వ్యవ‌హ‌రించారు. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. స్థానిక నేత‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇదంతా త‌మ త‌ప్పుకాద‌ని.. పార్టీ కీల‌క నేత‌లు త‌మ‌కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేద‌ని వారు వాద‌న వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాము ఆశించిన విధంగా ముందుకు సాగ‌లేక పోతున్నామ‌ని.. వారు కొన్నాళ్లుగా చెబుతున్నారు.

ఇప్పట్లో సాధ్యమేనా?

'మాకు ప‌ద‌వులు ఇచ్చారు. కానీ.. స్వేచ్ఛలేకుండా చేశారు'-అని ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కీల‌క నాయ‌కులు వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో చంద్రబాబు వైఖ‌రిని కూడా త‌ప్పుబ‌డుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం తాను త‌ప్పుకొని.. త‌ప్పంతా.. కింది స్థాయిపై నెట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నే వాద‌న మరోవైపు వినిపిస్తోంది. ఏదెలా ఉన్నప్పటికీ.. టీడీపీలో ప్రక్షాళ‌న చేయ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు చంద్రబాబు ఇప్పటికే పంపించారు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది సాధ్యం కాద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

సామాజిక వర్గాల పరంగా…?

ఎవ‌రిని ప‌క్కన పెట్టినా.. సామాజిక వ‌ర్గాల కోణంలో చూసుకుంటే.. చంద్రబాబుకు, పార్టీకి కూడా ఇబ్బందులు త‌ప్పవ‌ని తెలుస్తోంది. అలా కాకుండా.. ప‌రిస్థితిని చ‌క్కదిద్దేందుకు మ‌రే మార్గం ఉందో గ‌మ‌నించి.. ఆదిశ‌గా ముందుకు సాగాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఇక చంద్రబాబు కూడా పార్టీ ఓట‌మిపై జ‌రిపిన స‌మీక్షల్లో పార్టీ కార్యక‌ర్తలు చెప్పే మాట‌ల‌ను ఏ మాత్రం విన‌కుండా… త‌న త‌ప్పేం లేద‌న్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇది కూడా పార్టీ నేత‌ల్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. మ‌రి చంద్రబాబు ఎప్పట‌కి మారి.. పార్టీని ఎప్పటికి లైన్లో పెడ‌తారో ? చూడాలి.

Tags:    

Similar News