పాతికేళ్ళ తరువాత పిరికిమందును నూరిపోసి ?

నాయకుడు అంటే నమ్మాల్సిందే. ఆయనతో కలసి మరణమో విజయమో అన్నట్లుగా బరిలో దూకాల్సిందే. నాయకుడు ఏది చెప్పినా మన మంచికే అన్న విశ్వాసం కేడర్ కి కలగాలి. [more]

;

Update: 2021-04-04 05:00 GMT

నాయకుడు అంటే నమ్మాల్సిందే. ఆయనతో కలసి మరణమో విజయమో అన్నట్లుగా బరిలో దూకాల్సిందే. నాయకుడు ఏది చెప్పినా మన మంచికే అన్న విశ్వాసం కేడర్ కి కలగాలి. అది ఉన్న నాడు వారి మధ్యన ఎన్ని శక్తులు దూరినా ఏమీ చేయలేవు. గాలి కూడా చొరబడని విధంగా గాఢమైన బంధంగా అది ఉండాలి. కానీ తెలుగుదేశం అధినాయకుడి విషయంలో చూస్తే తొలిసారి తడబడ్డాడు, అంతే కాదు పొరపడ్డాడు అన్న మాట ఏకంగా సొంత తమ్ముళ్ళ నుంచే వస్తోంది. ఇది ఒక విధంగా టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు పనితీరుకు అతి పెద్ద రిమార్క్ గానే చెప్పుకోవాలేమో.

ఎన్టీఆర్ కంటే కూడా….

తెలుగుదేశానికి ఎన్టీఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా ఆయన మాట కంటే కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు మాటనే క్యాడర్ ఎక్కువగా వినేవారు. చంద్రబాబు సైతం వారి నమ్మకాన్ని ఎపుడూ వమ్ము చేయలేదు ఎన్ని దెబ్బలు తిన్నా కూడా క్యాడర్ ని తాను కాసుకుంటానని చెప్పి ముందుకు తోసేవారు. ఏనాడు చంద్రబాబు పిరికి మందు కార్యకర్తలకు నూరిపోయలేదు. పోరాట పటిమను వీడలేదు. అలాంటి చంద్రబాబు ఇపుడు ఎందుకిలా అయిపోయారు అన్నదే క్యాడర్ లో చర్చగా ఉంది.

జగన్ లాంటి వ్యక్తిని…

చంద్రబాబు రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఆయన ఎంతో మంది ముఖ్యమంత్రులతో పనిచేశారు. చాలా మందితో ఎదురొడ్డి పోరాడారు కానీ ఆయనకు ఎక్కడా జగన్ లాంటి క్యారక్టర్ తారసపడలేదు. అందుకే బాబు ఎత్తులు జిత్తులూ జగన్ ముందు ఒక్కోటిగా చిత్తు అవుతున్నాయి. ఆ దిగులుతనంతో ఆ ఆలోచన లేమితో చంద్రబాబు ఏదేదో చేస్తున్నారు అన్న మాట అయితే పార్టీ నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు జగన్ ని ఎదుర్కోవడంతో విఫలం అయ్యారు అని ఇపుడు తమ్ముళ్ళే అంటున్నారు అంటే అధ్యక్షుడిగా ఆయన మీదనే పార్టీ జనానికి విశ్వాసం తగ్గిపోతోంది అనుకోవాలేమో.

తల దించుకున్నారా…?

చంద్రబాబుకు ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయనే తీసుకున్నారో తెలియదు కానీ పరిషత్ ఎన్నికల బహిష్కరణతో ఒక్కసారిగా తమ్ముళ్ళు గ్రామాలలో తలలు దించుకునేట్లు చేశారని అంటున్నారు. నిజానికి గ్రామాలలో ఢీ అంటే ఢీ అనే సీన్ ఉంటుంది. అక్కడ జగన్ చంద్రబాబు ల పేరిట క్యాడర్ కత్తులు దూసుకుంటారు. ఓటమి వస్తే బాధపడతారు గెలుపు వస్తే జబ్బలు చరుస్తారు. అయినా సరే ఎన్నికలు అంటే ముందుకు ఉరుకుతారు. అలాంటిది ఎన్నికల జోలికే అసలు పోకుండా తన ప్రత్యర్ధులకు సునాయసం చేస్తూ ఇంట్లో కూర్చోమంటే క్యాడర్ ఎంతలా రగిలిపోతారో కదా. ఇపుడు తమ్ముళ్ళు అదే అంటున్నారు. మాకు సిగ్గు పోతోంది అని కూడా వారు బాధపడుతున్నారు. పార్టీకి చంద్రబాబు సారధి కావచ్చు కానీ రోడ్డు మీదకు వచ్చి పోరాడేది మాత్రం కార్యకర్తలే. మరి వారిని వెనక్కి పిలవడం ద్వారా బాబు తన వారికే వెన్నుపోటు పొడిచారా. లేక తమ శక్తి సామర్ధ్యాలనే అవమానించుకున్నారా. మొత్తానికి దీక్షా దక్షుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఫస్ట్ టైమ్ తన పొలిటికల్ కెరీర్ లో తడబడ్డారు.

Tags:    

Similar News