ఇంకా ఎర్లీ సెవంటీస్ లోనేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ నుంచి ఇంకా బయటపడడంలేదు. ఆయనకు చెప్పేవారు ఎవరూ లేరు కానీ ఒకవేళ చెప్పినా సలహా స్వీకరించే పరిస్థితి [more]

;

Update: 2021-04-14 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ నుంచి ఇంకా బయటపడడంలేదు. ఆయనకు చెప్పేవారు ఎవరూ లేరు కానీ ఒకవేళ చెప్పినా సలహా స్వీకరించే పరిస్థితి కూడా లేదు. సినిమాల్లో కొందరు హీరోలు అమాయకపు క్యారక్టర్లు వేసినా ఆ సినిమాలు జనాదరణకు నోచుకోవు. ఎందుకంటే వారిని ధీరుడి పాత్రలలోనే జనాలు మెచ్చుకుంటారు. చంద్రబాబు విషయం కూడా అంతే. ఆయనను బహు చక్కని వ్యూహకర్తగానే చూస్తారు. ఆయనను ఎవరైనా మోసం చేశారనో దెబ్బ తీశారనో చెబితే జనాలు ఎపుడూ నమ్మలేదు. చంద్రబాబు తెలివితేటల మీద జనాలకు అంత నమ్మకం అన్న మాట.

ఆనాడు రివర్స్…..

చంద్రబాబు మీద 2003 సంవత్సరంలో అలిపిరిలో నక్సల్స్ దాడి చేశారు. దాంట్లో దేవుడి దయ వల్ల బాబు అతి పెద్ద గండం నుంచి బయటపడ్డారు. అయితే ఆ తరువాత ఏ దాడిని సానుభూతి రూపంలో క్యాష్ చేసుకుందామని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఎన్నికలకు గడువు ఉండగానే ఆరు నెలల ముందు జనం తీర్పు కోరారు. ఈ విషయంలో కేంద్రంలోకి బీజేపీని కూడా లాగేశారు. మొత్తానికి ముందస్తుగా జమిలి ఎన్నికలు పెట్టించి మరీ తన సీఎం కుర్చీని వైఎస్సార్ కి వదిలేసుకున్నారు. అంటే చంద్రబాబు తన మీద దాడి జరిగింది అని జనాల్లో నాడు తిరిగినా కూడా సానుభూతి వర్కౌట్ కాలేదు అన్న మాట.

మోడీతో పోరుతో ….

ఇక 2014 నుంచి 2018 దాక బీజేపీతో మిత్రత్వం నెరిపి సడెన్ గా ఎన్నికలకు ఏడాది ముందర బయటకు వచ్చేసిన చంద్రబాబు తనను మోడీ మోసం చేశారని బేలగా దీనాలాపన చేశారు. కేంద్రం అన్నీ ఇస్తామని చెప్పి వంచించిందని తెగ వాపోయారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి ఏవీ ఢిల్లీ పెద్దలు ఇవ్వలేదని, ఈ పాపం అంతా మోడీదైతే మోసపోయిన పుణ్యం మాత్రం తనదేనని గగ్గోలు పెట్టారు. ధర్మపొరాటాల పేరిట ఊరూరా తిరిగి మరీ నానా యాగీ చేశారు. ఇక 2019 ఎన్నికల వేళ కూడా ప్రచారంలో భాగంగా వంగి మరీ జనాలకు దండాలు పెట్టారు. తాను తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించాలని కూడా కోరారు. కానీ జనం నిర్దాక్షిణ్యంగానే తీర్పు ఇచ్చేశారు. చంద్రబాబుకు ఏ సింపతీ కార్డు కూడా పనిచేయలేదు.

చాణక్యుడుగానే …?

చంద్రబాబు అంటే అపర చాణక్య అంటేనే జనాలు నమ్ముతారు. ఆయన జనం ముందు గోడు వెళ్లబోసుకున్నా అది నిజమైనా కూడా ఎందుకో సానుభూతి మాత్రం దక్కడంలేదు. సరిగ్గా మునిసిపల్ ఎన్నికల ముందు తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు రోజంతా నేల మీద కూర్చుని పోలీసులు దాష్టికం చేస్తున్నారు అంటూ గోల చేశారు. ఆ తరువాత కర్నూల్, తిరుపతి సభల్లో అదే అంశం ప్రస్తావించి మీ చంద్రబాబుని అన్నేసి గంటలు అలా ఎయిర్ పోర్టులో పోలీసులు నిర్భందిస్తే మీకు కోపం రాదా అంటూ రెచ్చగొట్టారు. కానీ మునిసిపల్ ఫలితాలు టీడీపీకి యాంటీగానే వచ్చాయి. ఇపుడు తిరుపతి ఉప ఎన్నికలో తన ఎన్నికల ప్రచార రధం మీద రాళ్ళు వైసీపీ వేయించిందని చంద్రబాబు మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా బాబు విషయంలో మాత్రం జనాలు ఎందుకో సింపతీ కార్డు చెల్లదు అని చెప్పేస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబుకు ఒకటి అర్ధం కావాలి. తాను ధీరుడినే కానీ బీరువులా సానుభూతి కోసం చూసేవాడిని కానని గ్రహించి రాజకీయం తీరు మార్చుకుంటే బాగుంటుందేమో.

Tags:    

Similar News