క్రమశిక్షణ కొరవడింది…ఇక చర్యలు తప్పవా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా పార్టీపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకుంటే మరీ బలహీనంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలుత ప్రజల కన్నా పార్టీ నేతల్లో [more]

;

Update: 2021-04-29 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా పార్టీపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకుంటే మరీ బలహీనంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలుత ప్రజల కన్నా పార్టీ నేతల్లో విశ్వాసం కల్గించే చర్యలను చంద్రబాబు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకుండా పోయింది. నేతలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో అదే లోపం ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

కమిటీలను నియమించినా….?

చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత పార్టీపైనే దృష్టి పెట్టారు. ఇటు ప్రజలలోకి వెళుతూ పార్టీలో జోష్ ను నింపాలని ప్రయత్నించారు. అనేక సమస్యలపై చంద్రబాబు ఆందోళనలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నేతలనుంచి సహకారం కొరవడటాన్ని చంద్రబాబు గుర్తించారు. దీంతో పార్టీని పటిష్టం చేయాలనుకుని రాష్ట్ర స్థాయి కమిటీని నియమించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు.

సమీక్షలు వాయిదా?

కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పూర్తిగా పడకేసింది. లోకేష్ నాయకత్వాన్ని కూడా నేతలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ సమయంలో చంద్రబాబు పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాలంటున్నారు. ఎన్నికల పూర్తయిన తర్వాత చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. అన్ని జిల్లాల సమీక్షలను నిర్వహించలేదు. కరోనా కారణంగా సమీక్షలు వాయిదా పడ్డాయి. చంద్రబాబు తమ్ముళ్లపై పెట్టుకున్న ఆశలు నీరుగారి పోయాయి.

జిల్లాల పర్యటన….

దీంతో మరోసారి చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు. నేరుగా జిల్లాలకే వెళ్లి ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాల టూర్ ప్లాన్ చేయాలని చంద్రబాబు సీనియర్ నేతలకు సూచించినట్లు తెలిసింది. తొలుత పార్టీలో ఐక్యత తీసుకుని వచ్చి, నేతల్లో నమ్మకం కల్గించడమే ఇప్పుడు చంద్రబాబు ముందున్న లక్ష్యం.

Tags:    

Similar News