బెదిరింది… చంద్రం…?

చంద్రబాబు పరిస్థితి ఇపుడు చాలా ఇబ్బందికరంగా ఉందని టాక్. ఒక వైపు పార్టీ మరో వైపు పుత్ర రత్నం. ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయలేక చంద్రబాబు సతమతమవుతున్నారు [more]

Update: 2021-04-18 08:00 GMT

చంద్రబాబు పరిస్థితి ఇపుడు చాలా ఇబ్బందికరంగా ఉందని టాక్. ఒక వైపు పార్టీ మరో వైపు పుత్ర రత్నం. ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయలేక చంద్రబాబు సతమతమవుతున్నారు అంటే సబబే అనాల్సిందేగా. సీనియర్ నేతలు తనను గౌరవించినట్లుగా లోకేష్ కి విలువ ఇవ్వాలంటే అది కుదిరే పని కాదు, మరో వైపు చూస్తే ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్లుగా లోకేష్ ని పార్టీకి భావి వారసుడిగా ప్రకటించకపోతే సొంత ఇంటిలోనే గొడవలు జరిగిపోతాయి అన్నట్లుగా సీన్ ఉందిట‌. దాంతో ఇంట్లో వాళ్ళకు చెప్పలేక బయట పార్టీని సముదాయించలేక చంద్రబాబు పడుతున్న పాట్లు ఆయన టోటల్ పొలిటికల్ లైఫ్ లో ఎన్నడూ అనుభవించి ఉండరేమో అంటున్నారు.

నాడు అలాగే మరి…

లోకేష్ కి మంత్రి పదవి ఇస్తే తన పదవికి ఎసరు వస్తుంది అన్నది విశేష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియనిది కాదు, కానీ ఇంట్లో వారి వత్తిడి ఆయన మీద విపరీతంగా ఉండడం వల్లనే చినబాబుని మంత్రిగా చేశారు అన్న ప్రచారం అయితే అప్పట్లో వచ్చింది. ఆ తరువాత చంద్రబాబుకు అసలైన కష్టాలు కూడా మొదలయ్యాయి. నాటి నుంచే సీనియర్లు తోక జాడించడం మొదలుపెట్టారు. ఇక పార్టీలో కూడా చినబాబు అతి జోక్యం వల్ల పట్టు తప్పి కట్టు కూడా దాటింది. ఇవన్నీ కలగలసి 2019 ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోర ఓటమిని నెత్తికెత్తుకుంది.

అనుకున్నది ఒకటైతే …?

ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారాన్ని లోకేష్ సీరియస్ గానే తీసుకున్నాడు అంటున్నారు. ఆయన తండ్రి కంటే చాలా ముందుగానే తిరుపతికి వెళ్ళి మరీ ఎర్రటి ఎండలో రోడ్డు మీద పడి ప్రచారం నిర్వహించాడు. అయితే చంద్రబాబు తరువాత రావడం తనదైన శైలిలో ప్రచారం చేయడంతో లోకేష్ కొంత తేలిపోయాడు. ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధికి ఓట్లను పెంచడం, వైసీపీ మెజారిటీని తగ్గించడం ద్వారా తాను ధీటు అయిన నేతగా పార్టీలో ఎస్టాబ్లిష్ కావాలని లోకేష్ పెద్ద కలలే కన్నారుట. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది వేరొకటి అంటున్నారు. అచ్చెన్నాయుడు ఏకంగా తన పరువు తీసేలా వీడియోలో అన్న మాటలతో చినబాబు హర్ట్ అయ్యారని కూడా చెబుతున్నారు. దాంతో అచ్చెన్న అది ఫేక్ వీడియో అని ఎంత మొత్తుకుంటున్నా షాక్ వీడియోగానే లోకేష్ చూస్తున్నారు అంటున్నారు.

లోకేష్ అలిగాడా..?

తనను పార్టీలో ఉన్న విలువ మర్యాదా అచ్చెన్న మాటల ద్వారా తెలుసుకున్న మీదట లోకేష్ మండిపోతున్నారని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిగా ఉండకుండానే ముందుగానే హైదరాబాద్ ఆయన చేరుకున్నారు అంటున్నారు. దీంతో లోకేష్ అలిగాడు అన్న ప్రచారం కూడా పార్టీలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఇక చంద్రబాబు ఈ విషయంలో అచ్చెన్నాయుడిని వివరణ అడగకుండా మౌనం వహించడం చినబాబుకు నచ్చలేదని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ నేత అయిన అచ్చెన్నకు చెప్పలేక లోకేష్ ని సముదాయించలేక బాబు అతి పెద్ద ఇరకాటంలో పడ్డారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే అదిరిపోయే పంచులే వేస్తున్నారు. చినబాబు అలిగి ముందే హైదరాబాద్ చెక్కేశాడని, అచ్చెన్న ఇక వేరే పార్టీలో చేరిపోవడానికి దారి చూసుకోవచ్చంటూ సాయిరెడ్డి వేస్తున్న సెటైర్లు టీడీపీలో మరింతగా మంట పుట్టిస్తున్నాయిట.

Tags:    

Similar News