కొత్త వారి ఎంపికలో చంద్రబాబు…. అందుకేనట

ఎంతసేపూ ఒకే హీరో అయితే చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు టీడీపీ మాదిరి ప్రాంతీయ పార్టీలలో ఒక్కరే ఏళ్ల తరబడి నాయకులుగా ఉంటారు. [more]

;

Update: 2021-05-09 11:00 GMT

ఎంతసేపూ ఒకే హీరో అయితే చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు టీడీపీ మాదిరి ప్రాంతీయ పార్టీలలో ఒక్కరే ఏళ్ల తరబడి నాయకులుగా ఉంటారు. వారిని అట్టేబెట్టుకుని కొంతమంది నేతలు సీనియర్ల రూపంలో కొనసాగుతారు. చివరికి వీరంతా కలసి ఒక రొటీన్ పొలిటికల్ సినిమాను చాలా ఏళ్ళుగా ఏపీ జనాలకు చూపిస్తున్నారు. దాంతో విసిగిన జనాలు వేరే పార్టీల వైపు జారుతున్నారు. అయితే ఇది అత్యంత సహజమైన పరిణామంగానే చూడాలి. ఎల్లకాలం ఒకరినే చూడమంటే అది చికాకుగానే ఉంటుంది. ఈ రోత ఎక్కువ అయ్యే తెలుగుదేశం పార్టీ ఇపుడు ఇబ్బందులు పడుతోంది.

చీల్చి చెండాడేవారు …

అధికారంలో ఉన్న వైసీపీని చీల్చి చెండాడే కొత్త ముఖాలు అర్జంటుగా టీడీపీకి కావాలిట. ఎంతసేపూ దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి వారే జగన్ మీద గొంతు చించుకుంటారు. ఇక రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, లోకేష్ నోరు చేసుకుంటారు. కానీ వీరంతా కూడా అసెంబ్లీలోనూ ఇలాగే జగన్ మీద చెడుగుడు ఆడుతూ కనిపిస్తారు. పైగా ఇలా ఏళ్ళూ పూళ్ళూ సాగుతున్న జగన్ వర్సెస్ బాబు రాజకీయాన్ని చూసిన జనాలు అసలు పట్టించుకోవడం కూడా మానేస్తున్నారు అన్నది టీడీపీ పెద్దలకు అందుతున్న సమాచారంగా ఉందిట.

పెద్ద పీట వేయడమే…?

ఇలాంటి ప్రయోగాలు చేయడంలో చంద్రబాబు ఎపుడూ వెనకడుగు వేస్తారు అని పేరు. ఆయన పాత కాపులనే నమ్ముతారు. కొత్త వారికి ఒక పట్టాన చాన్స్ ఇవ్వరు. కానీ ఇపుడు చంద్రబాబు కూడా మారుతున్నారుట. న్యూట్రల్ గా ఉన్న వారిని కొత్త వారిని టీడీపీ మీద అభిమానం ఉండి పార్టీ ఫిలాసఫీని అధ్యయనం చేసిన వారిని ఇక మీదట అక్కున చేర్చుకోవాలని చూస్తున్నారుట. వారినే మీడియా ముందు పెట్టి జగన్ మీద విమర్శలు చేయిస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారుట. జనాలు కూడా ఇలాంటి వారితో తొందరగా కనెక్ట్ అవుతారు అని కూడా చంద్రబాబు భావిస్తున్నారుట. ఇలా కరడు కట్టిన టీడీపీ సిద్ధాంతకర్తలను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకుని వారికే పెద్ద పీట వేయాలని చంద్రబాబు నిర్ణయించారని అంటున్నారు.

తెర వెనక ఉంటూ …?

ఇక చంద్రబాబు కూడా ఎక్కువ మాట్లాడకుండా తెర వెనక ఉండాలని, కేవలం దర్శకత్వానికే పరిమితం కావాలని ఆలోచిస్తున్నారుట. ఇలా చంద్రబాబు అమలు చేయబోయే మాస్టర్ ప్లాన్ లో టీడీపీ అంటే ఇష్టపడే విద్యావంతులు యువకులు, మాజీ అధికారులు, వివిధ రంగాల నిపుణులు కూడా ఉంటారని తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చే కొత్త ముఖాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారుట. మంచి మాటకారులను తెచ్చి పసుపు పార్టీ వేదికల మీద కూర్చోబెట్టడం ద్వారా ఏపీలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల మీద వారి నోటి నుంచే విమర్శల జల్లు కురిపించబోతున్నారుట. వారినే అధికార‌ ప్రతినిధులుగా తీరుకోవడంతో పాటు, ఇతర పార్టీ పదవులను ఇస్తారని టాక్. మొత్తానికి చంద్రబాబు వ్యూహం కనుక అమలు అయితే షష్టి పూర్తి బ్యాచ్, సీనియర్లు టీడీపీ తెర మీద పెద్దగా కనిపించే చాన్స్ లేదని అంటున్నారు.

Tags:    

Similar News