ఒక్క నేత కోసం.. చంద్రబాబు ఇంత మందిని వ‌దులుకున్నారా…?

ఒక్క ఎంపీ.. ఒకే ఒక్క ఎంపీ కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. పార్టీలో సెగ‌లు రేపుతోంది. బాబు నిర్ణయంపై అల‌క బూనిన సీనియ‌ర్ నాయ‌కులు, [more]

;

Update: 2021-05-25 12:30 GMT

ఒక్క ఎంపీ.. ఒకే ఒక్క ఎంపీ కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. పార్టీలో సెగ‌లు రేపుతోంది. బాబు నిర్ణయంపై అల‌క బూనిన సీనియ‌ర్ నాయ‌కులు, పార్టీ కోసం నాయ‌కులు కూడా ఇప్పుడు కీల‌క స‌మ‌యంలో మౌనం పాటిస్తున్నారు. ముఖ్యంగా విజ‌యవాడ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వర‌రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్నలు.. కొన్ని రోజులుగా మౌనం పాటిస్తున్నారు. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో పొడ‌చూపిన విభేదాల‌తో వీరు అల‌క‌పాన్పు ఎక్కార‌ని విజ‌య వాడ‌లో జోరుగా ప్రచారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

పట్టున్న నాయకుడిగా…?

బోండా ఉమాను తీసుకుంటే.. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. విజ‌య‌వాడ‌పై మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. అదే స‌మ‌యంలో అధికార వైసీపీని కార్నర్ చేయ‌డంలోనూ బొండా ముందున్నారు. అయితే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీని కించ‌ప‌రిచార‌ని, ముఖ్యంగా చంద్రబాబును అవ‌మానించార‌నే కార‌ణంగా.. స్థానిక ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. టికెట్ ఇవ్వడం వ‌ల్లే కేశినేని నాని విజ‌యం ద‌క్కించుకున్నార‌ని.. బాబు ప్రమేయం లేక‌పోతే.. రాజీనామా చేసి విజ‌యం ద‌క్కించుకోవాల‌ని స‌వాల్ విసిరారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో…

ఇక‌, ఈ కోవ‌లోనే.. ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న కూడా ఫైర‌య్యారు. ఎంపీ నాని కేంద్రంగా తీవ్ర విమ‌ర్శలు చేశారు. అయితే.. చంద్రబాబు మాత్రం వీరి ర‌గ‌డ‌ను ప‌ట్టించుకోకుండా.. ఇరు ప‌క్షాల‌ను స‌ర్దిచెప్పకుండా.. కేశినేని వైపు మొగ్గు చూపారు. దీంతో ఎన్నిక‌ల్లో తీవ్రస్థాయిలో ప్రభావం ప‌డింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో గెలిచి తీరుతుంద‌ని అంచ‌నాలు వేసుకున్నా.. విఫ‌ల‌మైంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. నాని గ‌ప్‌చుప్‌ అయ్యారు. అదే స‌మ‌యంలో పార్టీ వాయిస్ వినిపించే ఈ ఇద్దరు నాయ‌కులు బొండా, బుద్దా వెంక‌న్న‌లు కూడా మౌనం పాటిస్తున్నారు.

ఎంపీకి అనుకూలమని….

ఈ మొత్తానికి కార‌ణం.. చంద్రబాబు వైఖ‌రేన‌ని.. ఆయ‌న ఎంపీకి అనుకూలంగా ఉన్నార‌ని.. కానీ, ఆ ఎంపీ గెలిచేందుకు కూడా తాము జెండా ప‌ట్టుకుని తిర‌గ‌డం వ‌ల్లేన‌ని.. వీరి మ‌ద్దతు దారులు చెబుతున్నారు. ఇప్పుడు ఎవ‌రికి ఎలాంటి ప్రాధాన్యం ఉందో చంద్రబాబు చెప్పాల‌ని.. కేవ‌లం ఎంపీ వైపు మొగ్గు చూప‌డం స‌మంజ‌సం కాద‌ని.. ఆయ‌న అవ‌స‌ర‌మైతే.. బీజేపీలోకి చేరిపోతార‌ని.. కానీ, వీళ్లు మాత్రం పార్టీనే న‌మ్ముకుని ఉంటార‌ని.. ఈవిష‌యాన్ని కూడా చంద్రబాబు గ్రహించ‌లేక పోతున్నార‌ని న‌గ‌ర టీడీపీలో కొంద‌రు నాయ‌కులు వాపోతున్నారు. అటు నాని బెదిరింపుల నేప‌థ్యంలోనే చంద్రబాబు ఆయ‌న వైపు మొగ్గు చూపార‌ని.. మ‌రి ఇప్పుడు వీరు కూడా అదే పంథాలో వెళితే చంద్రబాబు ఏం చేస్తార‌ని పార్టీలోనే పెద్ద టాక్ ?

Tags:    

Similar News