మాయా బాణాలు ఎన్ని వేసినా….?

రామాయణంలో ఒక కధ ఉంది. ఇంద్రజిత్తు కనబడకుండా ఆకాశం మీద నుంచి మాయా బాణాలు వేస్తాడని. శత్రువులను అలా నిర్జిస్తాడు అని. రాజకీయాల్లో చూసుకుంటే టీడీపీ అధినేత [more]

;

Update: 2021-05-18 13:30 GMT

రామాయణంలో ఒక కధ ఉంది. ఇంద్రజిత్తు కనబడకుండా ఆకాశం మీద నుంచి మాయా బాణాలు వేస్తాడని. శత్రువులను అలా నిర్జిస్తాడు అని. రాజకీయాల్లో చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు తెర వెనక ఉండడమే మొదటి నుంచి ఇష్టం అంటారు. ఆయన బయటకు కనబడకుండా కావాల్సింది చక్క బడతారు అని చెబుతారు. ఎన్టీయార్ ని గద్దె దించినపుడు కూడా కుటుంబ సభ్యులకు లక్ష్మీ పార్వతిని రెండవ పెళ్ళి ఎన్టీయార్ చేసుకోవడం ఇష్టం లేదంటూ వారిని ముందు పెట్టారు. ఇక టీడీపీలో లక్ష్మీపార్వతి పెత్తనం మీద తమ్ముళ్ళు రగులుతున్నారంటూ మరో తెరను పెట్టారు. వెనకాల ఉన్నది మాత్రం చంద్రబాబు అని ఎన్టీయార్ గ్రహించేలోగానే ఆయన సీటు ఎగిరిపోయింది.

కలి పెట్టి …

పొరుగు పార్టీలో కలి పెట్టి తమాషా చూడడం చంద్రబాబుకు అలవాటు అంటారు. ఆ పార్టీ కలహాలతో కకావికలం అవుతూంటే అందులో నుంచి రాజకీయ లాభాన్ని తీసుకోవాల‌న్నది ఆయన వ్యూహం. చేతికి మట్టి అంటకుండా చేసే ఇలాంటి పనుల వల్ల అంతిమంగా తనకే ఫలితం దక్కుతుందని, తాను మాత్రం తెర వెనక పవిత్రంగా ఉండిపోవచ్చు అన్నది చంద్రబాబు మార్క్ ఆలోచన. కానీ ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఎవరు ఏ విధంగా ధిక్కార స్వరాలు వినిపించినా వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నది సగటు జనాలకు ఈజీగా అర్ధమైపోతోంది. వైసీపీలో అందరిలాగానే ఒక ఎంపీ అయిన రఘురామ క్రిష్ణం రాజు జగన్ వంటి బలమైన నేతను ధిక్కరిస్తున్నారు అంటే ఆయన వెనక ఎవరో ఉంటారు అన్నది ఊహించలేనంత రాజకీయ అజ్ణానంతో ఏపీ జనం లేదు అన్నదే విశ్లేషణ.

అందుకోవడానికి రెడీ…?

జగన్ని నాడు జైలులో పెట్టించి తన పార్టీని విచ్చిన్నం కాకుండా చంద్రబాబు కాపాడుకున్నారు అంటారు. ఇపుడు ఏపీలో మధ్యాహ్న మార్తాండుడుగా మారిన జగన్ని తప్పిస్తేనే తప్ప విపక్షం బతికి బట్ట కట్టదు అని గుర్తెరిగే ఆయన బెయిల్ పిటిషన్ కధను తెర పైకి తెచ్చారు అంటారు. అయితే తామే అది చేస్తే రాజకీయ కక్ష కావేశం అని జనాలు అనుకుంటారని అతి తెలివితోనే రఘురామ క్రిష్ణం రాజు చేత బెయిల్ రద్దు పిటిషన్ వేయించారు అన్నది ప్రచారంలో ఉంది. అయితే ఇలాంటి రాజకీయం వల్ల జగన్ ఇబ్బందులో పడితే భారీ లబ్ది పొందడానికి తెలుగుదేశమే సిద్ధంగా ఉంటుంది. మరి ఆ సంగతి తెలిసిన వారు ఎవరైనా రాజు అమాయకంగా జగన్ మీద యుద్ధం చేస్తున్నారు అనుకోగలరా అన్నదే చర్చ.

చెల్లవిక…?

ఏపీ రాజకీయం ఇపుడు పీక్స్ చేరింది. చంద్రబాబుకు పొరపాటున ఏం జరిగినా జగనే కారణం అంటారు. ఇక జగన్ కి ఏ రకమైనా ఇక్కట్లు ఎదురైనా కూడా బాబే చేయించాడు అని కూడా అంటారు. అంతలా ముఖాముఖీ ఢీ అంటే ఢీ కొడుతున్నా రాజకీయాల్లో ఇంకా ముసుగులు ఎందుకు అన్నదే ప్రశ్న. మాయా బాణాలు వేస్తూ ఏమీ ఎరగనట్లుగా కబుర్లు చెబితే కూడా జనం నమ్మడానికి సిధ్ధంగా లేరు అన్నది నిజం. ఇక పోతే జనాలకు ఈ కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు కూడా అవసరం లేదు. వారికి కావాల్సినవి సమకూర్చినంతకాలం ఆ ఏలికను నెత్తిన పెట్టుకుంటారు. తమకు మోజు ఉన్నంతకాలం ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మాట వినరు సరికదా గెలిపిస్తూనే ఉంటారు. అందువల్ల మాయా యుద్ధం మానేసి రాజ మార్గంలో దర్జాగా జనాలకు గట్టి మేలు చేసే పని చేపట్టి అభిమానం పొందితేనే విపక్షాలకు అధికారం దక్కేది. అలా కాకుండా చిల్లర రాజకీయాలకు తెర తీస్తే ఇంకా కర్సు అయిపోవడం మాత్రం ఖాయం.

Tags:    

Similar News