స్టాలిన్ ప్రయోగం ఏపీలో కుదరదంతే… ?
రాజకీయాల్లో ప్రత్యర్ధులే తప్ప శత్రువులు ఎవరూ ఉండరని చెబుతారు. ఇక ఎన్నికల వేళ కాస్తా ఆవేశపడినా ఆ తరువాత అంతా ఒక్కటిగా ప్రజా శ్రేయస్సు కోసం పాటు [more]
;
రాజకీయాల్లో ప్రత్యర్ధులే తప్ప శత్రువులు ఎవరూ ఉండరని చెబుతారు. ఇక ఎన్నికల వేళ కాస్తా ఆవేశపడినా ఆ తరువాత అంతా ఒక్కటిగా ప్రజా శ్రేయస్సు కోసం పాటు [more]
రాజకీయాల్లో ప్రత్యర్ధులే తప్ప శత్రువులు ఎవరూ ఉండరని చెబుతారు. ఇక ఎన్నికల వేళ కాస్తా ఆవేశపడినా ఆ తరువాత అంతా ఒక్కటిగా ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడాలని కూడా అంటారు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఉన్న అందమే అది. ఎవరూ ఇక్కడ పరాజితులు కారు. కాకపోతే అవకాశం ఒకరికి ముందు వస్తే మరొకరికి తరువాత వస్తుంది. ఇక సింహాసనాలు కూడా ఎవరికీ శాశ్వతం కాదు. తమను మెచ్చి జనాలు అప్పగించిన బాధ్యతను ఎంత సమర్ధంగా చేశామన్న దాని మీదనే వారు చిర కీర్తిని సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే రాజకీయాలు చాలా మారిపోయాయి.
అపర శత్రువులే…?
ప్రతిపక్షాలను శత్రువులుగానే అధికార పక్షం చూస్తున్న ఉదంతాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ లెక్కలేనట్లుగా ప్రవరిస్తోంది. తమకే జనం పవర్ ఇచ్చారు కాబట్టి ఎవరి సలహాలు అవసరం లేదు అని భావిస్తోంది. ఫలితంగా అధికార విపక్షాల మధ్య అతి పెద్ద అగాధమే ఏర్పడుతోంది. ఇక ప్రత్యేకించి తెలుగు రాజకీయాలు చాలా కాలంగా ఈ తీరు కనిపిస్తోంది. అఖిల పక్షం అన్న మాట విని చాలా కాలమే అయింది. నాడు వారు అలా చేశారు కాబట్టి ఇపుడు మనం కూడా అదే చేయాలి అన్నదే దుష్ట సంప్రదాయంగా పెట్టుకున్నారు. దీంతో రాజకీయ కక్షలకు తెర లేస్తోంది తప్ప ప్రజా కాంక్ష ఎక్కడా కనిపించడంలేదు అనే చెప్పాలి.
నిజంగా అపోజిషనే ….?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చూస్తే అధికార ప్రతిపక్షాల మధ్య సమరమే అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. తాతల నాటి తగవులను కూడా తలచుకుంటూ ముందుకు పోతున్నారు తప్ప ఎక్కడో ఒక చోట కటాఫ్ అని భావించడంలేదు. నిజానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన సీనియర్ రాజకీయ నేత చంద్రబాబే తొలుత తప్పటడుగులు వేశారు. ఆయన అయిదేళ్ల ఏలుబడిలో ఏ రోజూ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ని గుర్తించలేదు అని వైసీపీ నేతలు అంటారు. అమరావతి రాజధానికి పునాది రాయి వేసిన వేళ బాబు స్వయంగా జగన్ కి ఫోన్ చేసి పిలిస్తే బాగుండేది అని అంతా అనుకున్నా ఆయన ఆ పని చేయలేదు. అలాగే అఖిల పక్ష సమావేశం నిర్వహించమని అనేక సార్లు కోరినా కూడా చంద్రబాబు ఆ వూసే తలవలేదు. పైగా విపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తీసుకుని అందులో నలుగురుని మంత్రులుగా చేశారు.
ఈ కధ ఇంతేగా …?
తమిళనాడులో నిన్న కాక మొన్న సీఎం అయిన స్టాలిన్ కరోనా కట్టడి కోసం మొత్తం విపక్ష నేతలతోనే ఒక సలహా మండలిని వేయడం దేశ రాజకీయాల్లోనే చర్చగా ఉంది. మరి అలాంటి ఆలోచన కలలో అయినా తెలుగు రాజకీయ నాయకులు చేయగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న. అంత వరకూ ఎందుకు అసెంబ్లీలో తప్పించి చంద్రబాబు జగన్ బయట ఎపుడైనా పలకరించుకున్నారా. ఇద్దరూ కలసి రాష్ట్ర సమస్యల మీద ఒక్కటిగా పోరాడాలని కనీసంగా అనుకున్నారా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వడంలేదు, విభజన హామీలు అలాగే ఉన్నాయి. పోలవరం నిధులకు ఠికానా లేదు. అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణాతోనూ తీరని తగవులు చాలా ఉన్నాయి. కానీ ఏపీకి చెందిన అధికార విపక్ష నేతలు కలసికట్టుగా ముందుకురాకపోతే ఎప్పటికీ ఇవి అలాగే ఉంటాయి. స్టాలిన్ ఇచ్చిన సందేశంతో అయినా ఏపీ రాజకీయాల్లో మార్పు రావాలని నెటిజన్లు ఓ వైపు ఊదరగొడుతున్నారు. మరి చంద్రబాబు, జగన్ దీన్ని పట్టించుకుంటారా.