గడియారం తిరుగుతోందా..?
అధికారం వంతుల వారీ పంచుకునే వారసత్వపు ఆస్తి కాదు. ప్రజలకు తాము తప్ప ప్రజలకు ప్రత్యామ్నాయం లేదని ఒకటో రెండో పార్టీలు భావించే పాక్షిక నియంతృత్వానికీ రోజులు [more]
;
అధికారం వంతుల వారీ పంచుకునే వారసత్వపు ఆస్తి కాదు. ప్రజలకు తాము తప్ప ప్రజలకు ప్రత్యామ్నాయం లేదని ఒకటో రెండో పార్టీలు భావించే పాక్షిక నియంతృత్వానికీ రోజులు [more]
అధికారం వంతుల వారీ పంచుకునే వారసత్వపు ఆస్తి కాదు. ప్రజలకు తాము తప్ప ప్రజలకు ప్రత్యామ్నాయం లేదని ఒకటో రెండో పార్టీలు భావించే పాక్షిక నియంతృత్వానికీ రోజులు చెల్లిపోతున్నాయి. తాజాగా గడియారం ముల్లు తిరుగుతుంది. తిరిగి తాము అధికారంలో వస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టాయి. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, తమ పరిధిని మించి అతిగా ప్రవర్తిస్తున్న అధికారయంత్రాంగానికి హెచ్చరిక పంపడానికి ఆయన గడియారం సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పవర్ లో ఉన్న వైసీపీ మీద వ్యతిరేకత తమకు పట్టం గడుతుందని టీడీపీ అధినేత భావిస్తే అంతకంటే అత్యాశ మరొకటి ఉండదు. చంద్రబాబు నాయుడికి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్రలో మరొక సారి మొత్తంగా మూడు సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రతిపక్షంలోనూ కూర్చోబెట్టారు. తన పనితీరు మీద ఆధారపడకుండా గడియారం ముల్లు తిరిగినట్లు తిరిగి తాను అధికారంలోకి వచ్చేస్తాననుకోవడం కల గనడమే అవుతుంది. గతంలో మూడు సందర్బాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రత్యేకమైన కారణాలే పనిచేశాయి. కాలభ్రమణంలో భాగంగా ఆటోమాటిక్ గా ఆయన పవర్ లోకి వచ్చేయలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులు గతంలో మాదిరిగానే తనకు అనుకూలంగా ఉన్నాయా? అనేది ఆత్మావలోకనం చేసుకోవాలి.
ఆ రోజులు వేరు…
గతంలో కాంగ్రెసు పార్టీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉండేది. ఆ పార్టీలోని నాయకుల ముఠాలే వారికి సరిపోయేవి. పవర్ కోసం వాళ్లు కొట్టుకోవడంతోనే సమయమంతా గడిచిపోయేది. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలన్న తాపత్రయం సమష్టిగా కనిపించేది కాదు. అందరూ కలిసి ఒకే మాట -ఒకే బాటగా టీడీపీని ఎదుర్కొన్న సందర్బాలూ అరుదు. అందువల్ల కాంగ్రెసు కంటే ప్రజల్లో తెలుగుదేశానికే ఎక్కువ ఆదరణ లభించేది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత ఆ ధోరణి పోయింది. కాంగ్రెసు పార్టీ బలంగా మారింది. ముఠా కుమ్ములాటలను తన ఆధిపత్య ధోరణి, ప్రజాదరణతో వై.ఎస్. దాదాపు అణచివేశారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడిని పూర్తిగా అణగదొక్కేయాలనే వ్యక్తిగత కక్షతో ప్రవర్తించిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం జగన్, చంద్రబాబుల మధ్య రాజకీయ వైరం ఆత్మహత్యాసదృశంగా మారిపోయింది. అందువల్లనే వైసీపీ వ్యూహంలో భాగంగానే టీడీపీని ప్రభుత్వ వర్గాలు వెంటాడి వేటాడుతున్నాయి. క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది. నాయకులు నిర్వీర్యమైపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తున్నారని తెలిసినా ప్రజల నుంచీ పెద్దగా మద్దతు లభించడం లేదు. ప్రజలు ఇది తమకు సంబంధించిన అంశంగా అనుకోవడం లేదు. పార్టీల రాజకీయంగానే చూస్తున్నారు . ఫలితంగానే టీడీపీ చేపట్టే వర్చువల్ ఉద్యమాలు, ఆందోళనలకు ఎక్కడా స్పందన కనిపించడం లేదు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ చంద్రబాబు లెక్కలు వేసుకోవడం గాలిలో మేడలు కట్టడమే.
టీడీపీ అధికారానికి చారిత్రక కారణాలు…
ఎన్టీరామారావు హయాంలో తెలుగుదేశం విజయాలు ప్రజా సంకల్పాలు. చంద్రబాబు సమయంలో లభించిన విజయాలన్నీ సందర్భోచితాలు. 1999లో బీజేపీ కార్గిల్ యుద్ధ నేపథ్యంలో మంచి ఉత్సాహం తో ఉన్నప్పుడు దానితో జట్టుకట్టడం టీడీపీకి బాగా లాభించింది. వై.ఎస్. నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీకి చివరి క్షణాల్లో అదృష్టం తారుమారైంది. 2004, 2009లలో చంద్రబాబు నాయుడికి పరాజయం తప్పలేదు. 2014 నాటికి నిజానికి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ కి ప్రజల్లో అపరిమితమైన మద్దతు ఉంది. కానీ రాష్ట్ర విభజన తో ప్రజలు పునరాలోచనలో పడ్డారు. సీనియర్ నాయకుడు కావాలని ఆశించారు. ఆకాంక్షించారు. కొత్తగా జాతీయ నేతగా రంగంలోకి వచ్చిన మోడీ, పవన్ కల్యాణ్ తోడయ్యారు. జగన్ అదృష్టం తలకిందులైంది. ఇటువంటి ప్రత్యేక కారణాలతోనే చంద్రబాబు నాయుడి హయాంలో టీడీపీ అధికారంలోకి రాగలిగింది. ఒంటరిగా, సొంత అజెండాతో అధికారం దక్కిన దాఖలాలు ఒక్కటీ లేవు. ఇది చరిత్ర చెప్పే పాఠం. దానిని మసి పూసి మారేడు కాయ చేయాలంటే సాధ్యం కాదు.
క్రెడిబిలిటీ గ్యాప్…
తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపన కాలం నుంచి తీసుకుంటే ఇప్పుడున్నంత సంక్షోభం గతంలో ఎన్నడూ లేదు. ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ చంద్రబాబు నాయుడి క్రెడిబిలిటీ దారుణంగా దిగజారిపోయింది. నాయకత్వం నైతికత కోల్పోవడం పార్టీకి పెద్ద ముప్పు. 34 ఏళ్లపాటు పశ్చిమబెంగాల్ ను పాలించిన వామపక్షాలు ఇప్పుడు ఒక్క సీటు కూడా లేక అసెంబ్లీలో చాప చుట్టేశాయి. అక్కడ గడియారం ముల్లు కమ్యూనిస్టులకు తిరిగి అధికారం కట్టబెట్టలేదు. అప్రతిహతంగా బిహార్ ను పాలించిన ఆర్జెడీకి ఆ రాష్ట్ర ప్రజలు గడియారం ముల్లు సూత్రం వర్తింప చేయలేదు. ప్రతి నాయకుడు తనకు అధికారం ఇచ్చిన కాలంలో ప్రజలకు ఏం చేయగలమనే దానిపైనే ద్రుష్టి పెట్టాలి. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములతో లింకు పెట్టుకోకూడదు. చంద్రబాబు నాయుడు చేసిన ఘోరమైన తప్పు అదే. రైతుల వ్యవసాయ రుణాలు పూర్తిగా తీర్చకుండా రెండు విడతలు పక్కన పెట్టారు. తిరిగి తనను అధికారంలోకి తెస్తేనే తీరుస్తానని ప్రజలకు ఒక అనివార్యత కల్పించాలని చూశారు. అదే విధంగా అమరావతి మహానగరం నిర్మించాలంటే తనకే మళ్లీ అధికారం ఇవ్వాలనే కంపల్సన్ కల్పించాలనుకున్నారు. తన టైమ్ లో పూర్తి చేయాల్సిన వాటిని వచ్చే ఎన్నికల గెలుపుతో ముడి పెట్టడంతోనే చంద్రబాబు క్రెడిబిలిటీ దెబ్బతింది. ఏమి ఆశించి ప్రజలు తనను అధికారంలో కూర్చోబెట్టారో వాటిని నెరవేర్చలేకపోయారు. ఫలితంగానే ప్రతిపక్ష స్థానంలోకి రావాల్సి వచ్చింది. ఇది ప్రజల తప్పు కాదు. వారిని తక్కువగా అంచనా వేసిన నాయకత్వ లోపం. చంద్రబాబు కు ప్రజలు రాజకీయంగా చాలా మంచి అవకాశాలే ఇచ్చారు. ప్రతిపక్షంగా తన పనితీరుతోనే మళ్లీ వారి మనసులు గెలుచుకోవాలి. రాజకీయపరమైన ఎత్తుగడలతోనే కాలం తిరిగినంత వేగంగా పవర్ పగ్గాలు వచ్చేస్తాయనుకుంటే భ్రమే మిగులుతుంది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా అభివద్ధి అజెండాను ఆవిష్కరించి ముందుకెళితేనే ప్రజల్లో ఆదరణ దక్కుతుంది. టీడీపీ నాయకులపై సర్కారీ వేధింపులు సాగుతున్నాయి కాబట్టి సానుభూతితో ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం అత్యాశే.
-ఎడిటోరియల్ డెస్క్