‘సోనూ’ సూర్యునికి ‘చంద్ర’ గ్రహణం ?

వీస్తున్న గాలిని గమనించి తెర చాప వేసి రాజకీయ నావను తనకు అనుకూలంగా నడపటంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరు. ప్రతికూల పరిస్థితులను సైతం తనకు [more]

Update: 2021-06-14 05:00 GMT

వీస్తున్న గాలిని గమనించి తెర చాప వేసి రాజకీయ నావను తనకు అనుకూలంగా నడపటంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరు. ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుగుణంగా మలచుకోవడంలో దిట్ట. ఆ వ్యూహ చాతుర్యమే తనకు మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. సందర్భాన్ని బట్టి ఇతరుల బలాన్ని సైతం తనతో కలుపుకుని చక్రం తిప్పి విజయం సాధించగలరు. తిమ్మిని బమ్మిని చేయగల రాజకీయవేత్తగా నూటికి నూరు మార్కులు సాధిస్తారు. అయితే ప్రతి సందర్బాన్ని రాజకీయ కోణంలోనే చూడటంతోనే చిక్కు వచ్చి పడుతుంది. తాజాగా సినీ నటుడు సోనూ సూద్ అందిస్తున్న సేవలు ఆయన దృష్టిలో పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా సేవల్లో ఏ నాయకుడికి, అధికారికి రానంత పేరు ప్రఖ్యాతులు సోనూ ఖాతాలో పడ్డాయి. సేవల విషయంలో ముఖ్యమంత్రులు సైతం ఆయన ముందు దిగదుడుపుగానే మిగిలిపోయారు. వలస కూలీల తరలింపు, కరోనా బాధితులకు సర్వీసు విషయంలో తన ఆస్తులన్నిటినీ పణంగా పెట్టాడు. ఈ క్రెడిట్ లో తాను భాగమవుతానంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తాజాగా ప్రతిపాదించారు. తెలిసో తెలియకో చంద్రబాబు నాయుడి స్నేహహస్తం అందుకుంటే అంతే సంగతులు. ఆయనతో భాగస్వామిగా మారితే తర్వాత విచారించడానికి కూడా సోనూకు ఇక ఏమీ మిగలదంటున్నారు రాజకీయ విమర్శకులు. సహాయక చర్యలు కూడా రాజకీయ మయంగా మారిపోయే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఏపీ రాజకీయాలు ఎరగనివా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎడ్డెమంటే తెడ్డెమనే తీరు. ప్రతిపక్ష నాయకుడు చేసే ప్రతి చర్యనూ విమర్శిస్తుంది అధికార పార్టీ. ప్రభుత్వం చేసే ప్రతిపనిపైనా మంచి చెడ్డలతో సంబంధం లేకుండా యాగీ చేస్తుంది తెలుగుదేశం. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలన్నా, సేవలు అందించాలన్నా ఒకటికి రెండు సార్లు పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటీవల ఆనందయ్య మందు విషయంలోనూ నానా యాగీ సాగింది. రాష్ట్ర రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని సోనూ సూద్ మానవతా కారణాలతో తన ఆర్థిక శక్తికి మించి కరోనా బాధితులకు సహాయం చేస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపైనా స్పందిస్తున్నారు. రెండు రాష్ఠ్రాల్లోనూ వ్యవస్థీ కృతమైన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సైతం ఇంత మంచిపేరు తెచ్చుకోలేకపోతున్నాయి. సోనూ కు పెరిగిన ఆదరణను గమనించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల తాను నిర్వహించే వెబినార్ కు ఆహ్వానించారు. సోనూ పాల్గొన్నారు. ఆయనతో కలిపి పనిచేస్తానంటూ చంద్రబాబు ఈ సందర్భంగా ప్రతిపాదించారు. సోనూ ఇప్పటికే తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు, ప్రజలు ఆయనకు సహకరిస్తున్నారు. తెలుగుదేశం ముద్ర పడితే ఆయన సేవలకు ఆటంకం కలుగుతుంది. చంద్రబాబు నాయుడి ప్రచార యావలో అసలు విషయం పక్కదారి పడుతుంది. వైసీపీ ప్రభుత్వం కూడా వ్యతిరేక భావనతో సోనూ సేవలకు ఆటంకాలు కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

భ్రష్టు పట్టించేస్తారు…

చంద్రబాబు నాయుడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారనేది నిజం. అందులో ఎక్కువ భాగం రాజకీయాలు, ప్రచారానికే కేటాయిస్తారు. పుష్కరాల వంటి పవిత్ర సందర్బాలనూ తన ఇమేజ్ బిల్డప్ కోసం వాడుకుని విషాద సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణమయ్యారు. సినీ దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా కోసం మాహిష్మతి పేరిట గ్రాపిక్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆ అద్భుతానికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అమరావతి కలను ప్రజల ముందు ఆవిష్కరించడానికి, అరచేతిలో స్వర్గం చూపించడానికి రాజమౌళిని సైతం చంద్రబాబు ఆశ్రయించారు. రాజధానికి డిజైన్లు ఇవ్వమని కోరారు. నిజానికి అతనిచ్చే డిజైన్లు వినియోగించడం సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. కానీ రాజమౌళికి ప్రజల్లో ఉన్న క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకోవడానికే ఈ రాజకీయం. ప్రజలకు అమరావతి పేరిట అద్భుతం రాబోతుందనే భ్రమలు కల్పించడం అంతర్గత ఉద్దేశం. మూడు నెలల లోపుగానే రాజమౌళి తన ఆలోచనలను ప్రభుత్వానికి అందించారు. కానీ అవేమై పోయాయో తెలియదు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పదవి దిగిపోయారు. తాత్కాలిక రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం మినహా శాశ్వతంగా వారి సేవలను సార్థకం చేసుకుందామనే ఆలోచన చంద్రబాబుకు ఉండదు. ఇప్పుడు సోనూ సూద్ కు ఉన్న పేరు ప్రతిష్టలు రాజకీయంగా తనకు ఉపయోగడపడతాయనే ఉద్దేశంతో ఆయనతో కలిసి పనిచేస్తామంటున్నారు. సోనూ కు ఉన్న పేరులో వాటా కోసమే ఈ తాపత్రయం.

సేవ చేసుకోనివ్వండి…

తెలుగుదేశం పార్టీ కి పటిష్టమైన నిర్మాణం ఉంది. సోనూతో చేతులు కలిపి, అతని మీద ఆధారపడి సేవలందించాల్సిన పరిస్థితి లేదు. లక్షల మంది కార్యకర్తలతో చంద్రబాబు తన పని తాను చేసుకుంటూ పోవచ్చు. సోనూ సూద్ రాజకీయాలకు అతీతంగా , ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా పని చేసుకుంటూ పోతున్నాడు. టీడీపీ అందించే ప్రతి సేవకూ భవిష్యత్తులో ప్రజల నుంచి ప్రయోజనం కోరుకుంటుంది. ఇవి రెండు పరస్పర భిన్నమైన మార్గాలు. అందువల్ల సోనూ సూద్ ను అతని దారిలో అతనిని వదిలేయడం మంచిది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే కరోనా సందర్బంగా టీడీపీ ఎంతో కొంత సేవలు చేస్తున్న మాట నిజం. అదే బాటను మరింత విస్తరించుకోవచ్చు. సోనూ సూద్ తో చేతులు కలపడం, భాగస్వామ్యం వహించడం అంటే విమర్శలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాలకు చెందనప్పటికీ ప్రజలకు మానవతా సాయం చేస్తున్న సోనూకు సీనియర్ రాజకీయ వేత్తగా చంద్రబాబు నాయుడి ప్రశంస, అభినందన, ప్రోత్సాహం చాలు. భాగస్వామ్యం, కలిసి పని చేయడం మాత్రం వద్దంటే వద్దు. అది ఇద్దరికీ చేటు తెస్తుంది. ముఖ్యంగా అసలు ఉద్దేశం పక్కదారి పడుతుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News