బాబు నిర్ణయం ఒక జీవిత‌కాలం లేటా..?

టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం జీవితకాలం లేటా ? ఆయ‌న నిర్ణయం తీసుకునే లోపు.. నేత‌లు విసిగివేసారి పోవాల్సిందేనా ? అంటే.. ఔన‌నే అంటున్నారు శ్రీకాకుళం నేత‌లు. [more]

Update: 2021-07-04 14:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం జీవితకాలం లేటా ? ఆయ‌న నిర్ణయం తీసుకునే లోపు.. నేత‌లు విసిగివేసారి పోవాల్సిందేనా ? అంటే.. ఔన‌నే అంటున్నారు శ్రీకాకుళం నేత‌లు. ఇక్కడి చాలా మంది నేత‌లు.. ఇప్పుడు రాజ‌కీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు. చంద్రబాబు ఔనంటే పుంజుకుంటాం.. లేక‌పోతే.. ప‌రిస్థితి ఏంట‌నే విధంగా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో 'మార్పులు' అనివార్యంగా మారాయి. చంద్రబాబు ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో, టిక్కెట్లు విష‌యంలో నాన్చి నాన్చి.. పార్టీ నాయ‌కుల‌ను, నేత‌ల‌ను టెన్షన్ పెట్టి పెట్టి కాని నిర్ణయం తీసుకోరు. ఈ విష‌యంలో వైఎస్‌కు, చంద్రబాబుకు కంపేరిజ‌న్ చేసిన ప‌లువురు మేథావులు వైఎస్ ఈ విష‌యంలో ఫ‌టాఫ‌ట్‌, తాడోపేడో తేల్చేస్తార‌ని.. చంద్రబాబు మాత్రం పీక‌ల మీద‌కు వ‌చ్చే వ‌ర‌కు నిర్ణయం తీసుకోర‌నే అంటారు.

రాజాం నియోజకవర్గంలో….

క‌ట్ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు నిర్ణయం కోసం ప‌లువురు కీల‌క నేత‌లు కొండంతో ఆశ‌ల‌తో ఉన్నారు. రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ కుమార్తె గ్రీష్మను నిల‌బెట్టాల‌ని.. మాజీ స్పీక‌ర్ ప్రతిభా ఎప్పటి నుంచో.. చంద్రబాబును కోరుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీని అంద‌లం ఎక్కించారు చంద్రబాబు. ఇప్పుడు ఆయ‌న పార్టీని గాలికొదిలేశారు. గ్రీష్మకు రాజాం ప‌గ్గాలు ఇవ్వాల‌ని నెత్తినోరు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రతిభ ఫ్యామిలీ గోడు ప‌ట్టించుకోవ‌డం లేదు.

సాక్ష్యాధారాలు ఇచ్చినా…?

త‌న నియోజ‌క‌వ‌ర్గంపై 'పెద్దల‌' పెత్తనాన్ని నిలువ‌రించాల‌ని.. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న గౌతు శిరీష్ విజ్ఞప్తి చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆమె.. అప్పటి నుంచి మౌనంగానే ఉంటున్నారు. త‌న ఓట‌మికి .. సొంత పార్టీ నేత‌లు.. ఇక్కడ చ‌క్రం తిప్పిన పెద్దలే కార‌ణ‌మ‌ని.. త‌న తండ్రిపై కోపంతో.. త‌న‌పై క‌క్ష సాధించార‌నేది ఆమె ఆవేద‌న‌. గ‌త ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో.. ఆమె సాక్ష్యాధారాల‌తో పాటు చంద్రబాబుకు అప్పగించినా.. ఇప్పటి వ‌ర‌కు చ‌ర్యలు తీసుకోలేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో గ‌ట్టిగా పోటీ చేసి.. బ‌లంగా డ‌బ్బులు ఖ‌ర్చు చేసిన ఓ నేత‌.. ఓడిపోయారు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామంటూ….

అయితే.. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాన‌ని.. పార్టీ త‌ర‌ఫున కొంతైనా ఎమౌంటు ఇవ్వాల‌ని.. ఆయ‌న అడిగి ఏడాది అయింద‌ట‌. ఈ విష‌యంలో జిల్లా ఇంఛార్జ్‌ల‌ను చంద్రబాబు ఆదేశించార‌ని.. అయితే.. ఇప్పటి వ‌ర‌కు చ‌ర్యలు తీసుకోలేద‌ని తెలుస్తోంది. దీంతో స‌ద‌రు నేత‌.. పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, పార్టీ త‌ర‌ఫున ప్రచారం చేసేందుకు గ‌త ఎన్నిక‌ల్లో ఖ‌ర్చులు పెట్టిన వారు ఇప్పటికీ.. పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నార‌ని.. ఈ విష‌యంలోనూ చంద్రబాబు మౌనంగా ఉన్నార‌ని.. అంటున్నారు.

స్థాయికి మించి ఖర్చు చేసి….

ఇక‌, కొంద‌రు టీడీపీ నాయ‌కులు.. పార్టీలోనే ఉంటూ.. వైసీపీ నేత‌ల‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నార‌ని.. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు కోల్పోతున్నామ‌ని.. సో ఆ అవ‌కాశం మాకు ఇస్తే.. పార్టీని ప‌రుగులు పెట్టిస్తామ‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి చంద్రబాబుకు త‌మ్ముళ్ల విజ్ఞప్తి వినిపిస్తూనే ఉంది. అయినా.. కూడా ఆయ‌న ఎక్కడా ప‌ట్టించుకోలేదేనే విమ‌ర్శలు ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొంద‌రు నేత‌లు, పారిశ్రామిక‌వేత్తల‌కు చంద్రబాబు మీరు ఖ‌ర్చు పెట్టండి.. మ‌న‌మే అధికారంలోకి వ‌స్తున్నాం అని చెప్పడంతో వారు స్థాయికి మించి మ‌రీ ఖ‌ర్చు పెట్టారు. అస‌లు ఇప్పుడు వారి ఫోన్లు ఎత్తడం లేదు స‌రిక‌దా ? వారికి అపాయింట్‌మెంట్లు, భ‌రోసాలు కూడా లేని ప‌రిస్థితి. ఇలా.. మొత్తంగా చంద్రబాబు ఎప్పటికి వీరిని సంతృప్తి ప‌రుస్తారు ? వీరి బాధ‌లు ఎప్పటికి తీరుస్తారో ? కాని ఈ లోగా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి.. బాబుపై సొంత పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి జ్వాలలు ర‌గ‌ల‌డం మాత్రం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News