ఇంకా ఆశ చావలేదే?
తెలంగాణ తెలుగుదేశం పార్టీని భరించేందుకు నాయకులు కావాలి. కీలక నాయకులు, అధ్యక్షులుగా పని చేస్తున్నవారు సైతం ఫిరాయించేయడంతో పదవులిస్తాం. రమ్మంటూ తెలుగుదేశం పిలుస్తోంది. అయినా ఎవరూ సాహసించలేకపోతున్నారు. [more]
;
తెలంగాణ తెలుగుదేశం పార్టీని భరించేందుకు నాయకులు కావాలి. కీలక నాయకులు, అధ్యక్షులుగా పని చేస్తున్నవారు సైతం ఫిరాయించేయడంతో పదవులిస్తాం. రమ్మంటూ తెలుగుదేశం పిలుస్తోంది. అయినా ఎవరూ సాహసించలేకపోతున్నారు. [more]
తెలంగాణ తెలుగుదేశం పార్టీని భరించేందుకు నాయకులు కావాలి. కీలక నాయకులు, అధ్యక్షులుగా పని చేస్తున్నవారు సైతం ఫిరాయించేయడంతో పదవులిస్తాం. రమ్మంటూ తెలుగుదేశం పిలుస్తోంది. అయినా ఎవరూ సాహసించలేకపోతున్నారు. వేరే చోట స్థానం లేక, రాజకీయ భవిష్యత్తుపై పెద్దగా ఆశలు పెట్టుకోని నాయకులు మాత్రమే టీడీపీలో మిగిలారు. వారు కూడా ముఖ్య బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా లేరు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికైతే ఇంకా రాష్ట్రంలో ఆశ చావలేదు. ఓటుకు నోటు కేసు వంటి స్వయంకృతాపరాధంతో పార్టీకి సమాధి కట్టేసి అయిదేళ్లు దాటిపోయింది. వరస తప్పిదాలతో తెలంగాణలో పార్టీ పరిస్థితి క్రమేపీ దిగజారిపోయింది. నిత్యం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కళకళలాడిన ఎన్టీయార్ భవన్ వెలవెల బోతోంది. 2004నుంచి 2014 వరకూ పార్టీ అధికారంలో లేకపోయినా ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదు. బీసీల పార్టీగా ముద్ర ఉన్న తెలుగుదేశానికి ఇంతటి దీనస్థితి రావడానికి నాయకత్వ లోపాలూ కారణమే. రాష్ట్ర విభజనతో పర నాయకత్వం అనే అంశం నుంచి బయటపడేందుకు అధిష్టానం కృషి చేయలేదు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని మరో పొరపాటు చేశారు. రేవంత్ వంటి వారు దూకుడు కనబరిచేందుకు తొలుత ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి ఊపు తీసుకురావడం సాధ్యం కాదని గ్రహించే కాంగ్రెసులోకి జంప్ చేసేశారు. ఇప్పుడు మళ్లీ పార్టీని పునరుద్ధరించి పురావైభవం తెస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు.
ఆర్థిక వనరులిస్తారా..?
తెలంగాణ తెలుగుదేశం నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఇక్కడి నాయకులెవరూ చేతి నుంచి పైసా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడటం లేదు. నిన్నామొన్నటి వరకూ కొంత అధిష్టానమే సర్దుబాటు చేస్తుండేది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి పార్టీ శాఖకు, ఎన్టీయార్ భవన్ నిర్వహణకు భారీగానే నిధులు సమకూర్చుతుండేది. దాంతో ఏదోరకంగా తెలంగాణలో పార్టీని బతికించేందుకు నాయకులు తీవ్రంగానే ప్రయత్నించారు. 2018 వరకూ వారిలో ఎంతో కొంత ఆశలుండేవి. కాంగ్రెసు, టీడీపీ సమష్టి ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా నాయకులందరూ జారుకున్నారు. నిజానికి కార్యకర్తలు అంతకుముందే వేరే పార్టీల్లో సర్దుకున్నారు. ఎటొచ్చీ ఎటువంటి పదవులు ఆశించని పార్టీ సానుభూతిపరులు మాత్రం అక్కడక్కడ ఉన్నమాట వాస్తవం. ఈ స్థితిలో మళ్లీ పార్టీ నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలంటే భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయి. వాటిని సమకూర్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారాన్ని ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోనే అధిష్ఠానం నుంచి నిధుల పంపిణీ సాగడం లేదు. స్థానిక నాయకులే పార్టీ కార్యక్రమాలకు అవసరమైన వనరులు సమకూర్చుకుంటున్నారు. ఇక తెలంగాణ సంగతైతే చెప్పనక్కర్లేదు.
ఆశ… కు హద్దులెందుకు..?
చంద్రబాబు నాయుడు పక్కా రాజకీయవేత్త. ఓటమి ముంగిట్లో కనిపిస్తున్నా, తానే గెలుస్తానని చెప్పగలడు. ప్రజలను , కార్యకర్తలను, నాయకులను నమ్మించగలడు. లేకపోతే ముందుగానే క్యాడర్ చేతులెత్తేస్తుంది. వైసీపీకి, టీడీపీకి మద్య 12 శాతం మేరకు ఓట్ల వ్యత్యాసం ఉంది. అయినా పార్టీ గెలుస్తోందని చివరిక్షణాల వరకూ చెప్పడం వల్లే, 2019 ఎన్నికలలో టీడీపీ పోరాట పటిమను కనబరిచింది. ఇందుకు చంద్రబాబు నాయుడి వ్యూహచాతుర్యమే ప్రధాన కారణం. ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీకి ఉజ్ఝ్వల భవిష్యత్తు ఉందని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. మరో చరిత్ర లిఖించాల్సిన అవసరం ఉందంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా ఆయన తెలంగాణ పార్టీపై సమీక్ష నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అధికార పార్టీలోకి వెళ్లిపోతుండటంతో తప్పనిసరిగా మరో నేతను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్. రమణ పార్టీని వీడినప్పటికీ ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట వెళ్లలేదంటూ సమర్థించుకొంటున్నారు.. నిజానికి అక్కడక్కడ నాయకులు తప్ప కార్యకర్తలు ఎప్పుడో ఖాళీ అయిపోయారు. అందుకే రమణ నిష్క్రమణ ప్రభావం పార్టీపై కనిపించలేదు. నైతికంగా మాత్రం అధిష్ఠానానికి ఇది పెద్ద దెబ్బే. విశ్వాసపాత్రులందరూ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ సిద్దాంతాలను అభిమానించే వారు సైతం పార్టీలో ఉండటం వల్ల ఉపయోగం శూన్యమనుకుంటున్నారు. ఇక్కడ సాధించేదేమీ లేదనే భావనకు వచ్చేశారు.
మాకొద్దు. . మాకొద్దు…
పార్టీకి జవసత్తువలు కల్పించాలనే ఉద్దేశంతో గడచిన రెండు మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. వరస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలతో పాటు వ్యక్తిగతంగా నాయకులతో విడిగానూ సమావేశమవుతున్నారు. నాయకులందరూ సమష్టిగా ఆయన చెప్పింది వింటున్నారు. అధినేతతో విడిగా సమావేశమైనప్పుడు మాత్రం బిన్నంగా స్పందిస్తున్నారు. తాము పార్టీ కోసం పనిచేస్తాం. నిధులు వెచ్చించలేమంటూ తేల్చి చెప్పేస్తున్నట్లు సమాచారం. పెద్ద పదవులు తీసుకునేందుకు సాహసించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్త కోట దయాకర్ రెడ్డి వంటి ముగ్గురు నలుగురు సీనియర్లు మాత్రమే పార్టీకి మిగిలారు. వారు కూడా ఇతర పార్టీలలో ఇమడలేమనే ఉద్దేశంతోనే టీడీపీలో కాలక్షేపం చేస్తున్నారు. తమకు రాష్ట్రంపైన, పార్టీపైన అవగాహన ఉన్నప్పటికీ పదవులు వద్దంటూ వారు విముఖత ప్రదర్శిస్తున్నారు. యువ నాయకత్వానికి అప్పగించాలంటూ తెలివిగా తప్పించుకుంటున్నారు. అధినాయకత్వమే ఆర్థిక వనరులు సమకూరుస్తూ , ఆపద్ధర్మ తెలంగాణ శాఖ అధ్యక్షుడిని నియమిస్తుందా? లేక బలవంతంగా సీనియర్లపైనే ఈ భారం మోపుతారా? అన్నది వేచి చూడాలి.
– ఎడిటోరియల్ డెస్క్