ఏడవాలో… నవ్వాలో తెలియడం లేదే?

రాజకీయాల్లో కొన్ని సార్లు విభేదాలు కూడా ప్లస్ అనే చెప్పాలి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాజకీయ పార్టీలో ఆధిపత్య పోరు అంటే పార్టీకి బలం ఉన్నట్లే [more]

;

Update: 2021-07-25 05:00 GMT

రాజకీయాల్లో కొన్ని సార్లు విభేదాలు కూడా ప్లస్ అనే చెప్పాలి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాజకీయ పార్టీలో ఆధిపత్య పోరు అంటే పార్టీకి బలం ఉన్నట్లే అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో అలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. అధికారంలో లేకపోయినా నేతలు పోటీ పడుతుండటం పట్ల ఆనంద పడాలా? నియోజకవర్గంలో క్యాడర్ ఇబ్బంది పడుతుందని దిగులు పడాలా? అన్నది పార్టీ అధినేత చంద్రబాబుకు అర్థం కాకుండా ఉంది.

అధికారంలో లేకున్నా…?

తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారం కోల్పోయి రెండేళ్లు కావస్తుంది. పార్టీ అధినేతగా చంద్రబాబు క్యాడర్ లో జోష్ నింపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల చడీ చప్పుడు లేదు. ఎన్నికల సమయంలో చూసుకుందామన్న ధీమాలో ఉన్నారు. అదే సమయంలో మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ విపరీతంగా ఉండటం పార్టీ అధినేతను ఆనందించే విషయమే. ఇక్కడ నాయకత్వం కోసం పోటీ పడుతుండటం విశేషం.

ఎన్ని సార్లు ప్రయత్నించినా…?

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, అక్కడి ఇన్ ఛార్జి ఉమామహేశ్వర నాయుడుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. గత కొంతకాలంగా రెండు వర్గాలు పార్టీపై పట్టు కోసం ఘర్షణ పడుతున్నాయి. ఫ్లెక్సీలు చించుకోవడం, దాడులు చేసుకోవడం కూడా ఆందోళన కల్గించే అంశమే. ఇక్కడ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరినీ పార్టీలో కొనసాగించడంతోనే ఈ సమస్య తలెత్తిందంటున్నారు. ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నం చేద్దామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జేసీ పవన్ రెడ్డి ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఇద్దరూ గట్టి నేతలే….

చిత్తూరు జిల్లాలోనూ అదే పరిస్థితి. మదనపల్లె నియోజకవర్గం ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోమని మరో వర్గం తెగేసి చెబుతోంది. ఈ అసంతృప్తి వర్గానికి టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నాయకత్వం వహిస్తున్నారు. ఇద్దరూ గట్టి నేతలే కావడంతో అధిష్టానం ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతుంది. బాధ్యతల కోసం పోటీ పడుతున్న నియోజకవర్గాలు తక్కువగానే ఉన్నా కొన్ని చోట్ల జరుగుతున్న పరిణామాలను చూసి చంద్రబాబుకు ఏడవాలో, నవ్వాలో తెలియడం లేదంటున్నారు.

Tags:    

Similar News