ఫస్ట్ టైమ్ …బాబుకు మూడు వైపుల నుంచి?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతగా భయపడలేదు. ఆయన అధికారంలో లేకపోయినా ఎప్పుడూ పైచేయి తనదే ఉండాలనే మనస్తత్వం. 2004 నుంచి [more]

;

Update: 2021-07-26 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతగా భయపడలేదు. ఆయన అధికారంలో లేకపోయినా ఎప్పుడూ పైచేయి తనదే ఉండాలనే మనస్తత్వం. 2004 నుంచి 2014 వరకూ అధికారానికి దూరంగా ఉన్నా విపక్షాలతో కలసి వీధిపోరాటాలు చేయగలిగారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా పెద్దగా భయపడలేదు. అప్పట్లో ఎందరో నేతలు పార్టీని వీడినా తన పని తాను చేసుకుపోయే చంద్రబాబు రెండేళ్ల నుంచి మాత్రం పార్టీ భవిష్యత్ పై భయపడుతున్నారు. నడి సముద్రంలో చిక్కుకుపోయిన వారికి ఏదో ఒక్క ఆసరా చిక్కినా ఒడ్డుకు చేరతారు. ఆ ఆసరా కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ రెండేళ్ల నుంచి ఎటువైపు నుంచి ఆసరా దొరకడం లేదు.

కేంద్రం అండ కోసం…?

ఇందుకు కారణం మూడు వైపుల నుంచి తనకు ఇబ్బంది కలిగించడమే. చంద్రబాబుకు ఎవరో ఒకరు అండ ఉండి తీరాలి. ఇప్పుడు ఎటు వైపు చూసినా మద్దతు దొరకడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు. తన రాజ్యసభ సభ్యులను పంపినా కూడా వారు కరుణ చూపించడం లేదు. బీజేపీ అండ కొంచెమైనా ఉన్నా చెలరేగిపోయేవారు. వచ్చే ఎన్నికల్లోనూ తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడతారన్న భయం బీజేపీతో చంద్రబాబుకు పట్టుకుంది. బీజేపీ సహకారం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు.

కయ్యమేనంటున్న కేసీఆర్….

మరోవైపు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం చంద్రబాబుపై గురిపెట్టారు. నీటి సమస్యలతో జగన్ కు, కేసీఆర్ కు మధ్య విభేదాలు తలెత్తినా ఆయనతో సఖ్యతకు చంద్రబాబు ప్రయత్నించలేని పరిస్థితి. ఎందుకంటే ఓటుకు నోటు కేసుతో పాటు తన పార్టీని కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా తమ గూటికి రప్పించుకున్నారు. చంద్రబాబుతో కయ్యమే తప్ప వియ్యం ఉండదన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఇక్కడి నుంచి కూడా చంద్రబాబుకు సహకారం అందే అవకాశం లేదు.

ఒంటరిపోరాటమే….?

ఇక ఎటూ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రోజురోజుకూ స్ట్రాంగ్ అయిపోతుంది. పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, ఆర్థిక వనరులు దెబ్బతీస్తుండటంతో నేతలు కూడా భయపడిపోతున్నారు. జగన్ ను ఎదుర్కొనేందుకు ఒంటరిపోరాటం చేయాల్సి వస్తుంది. తనకు సీపీఐ మినహా ఏ పక్షమూ కలసి వచ్చే అవకాశం లేదు. ఇలా చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విషమ పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ లు శత్రువులుగా మారారు. ఈ ముగ్గురి నుంచి చంద్రబాబుకు రాజకీయ ముప్పు పొంచి ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News