ఎన్నాళ్లిలా బుజ్జగిస్తావు బాబూ?
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. మరోసారి చర్చకు దారితీసింది. పార్టీలో వస్తున్న అసంతృప్తులను ఆయన బుజ్జగిస్తున్న తీరు ఆయనకు మంచి చేస్తుందా? లేక చెడు చేస్తుందా ? [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. మరోసారి చర్చకు దారితీసింది. పార్టీలో వస్తున్న అసంతృప్తులను ఆయన బుజ్జగిస్తున్న తీరు ఆయనకు మంచి చేస్తుందా? లేక చెడు చేస్తుందా ? [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. మరోసారి చర్చకు దారితీసింది. పార్టీలో వస్తున్న అసంతృప్తులను ఆయన బుజ్జగిస్తున్న తీరు ఆయనకు మంచి చేస్తుందా? లేక చెడు చేస్తుందా ? అనే ధోరణిపై మేధావులు కూడా దృష్టి పెట్టారు. వాస్తవానికి చంద్రబాబుకు ఈ బుజ్జగింపుల రాజకీయం కొత్తకాదు. ఆది నుంచి ఆయన పార్టీలో ఏ చిన్న నాయకుడు అసంతృప్తి వ్యక్తం చేసినా.. వెంటనే సీనియర్లను రంగంలోకి దింపి.. బుజ్జగింపులకు షురూ చేస్తారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటి విషయం పరిశీలిస్తే.. అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి.. అనూహ్యంగా ఓ రోజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
బుజ్జగించినా లాభం లేదే?
వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు కలెక్టర్లతో సీరియస్ మీటింగులో ఉన్నారు. అయినా కూడా ఈ వార్త ఆయ న చెవిలో పడగానే అల్లాడిపోయారు. ఏం జరిగిపోతుందో.. అని అనుకున్నారో.. లేక పార్టీ దెబ్బతినేస్తుందని భావించారో.. వెంటనే సీనియర్ నాయకుడు, అప్పటి మంత్రి దేవినేని ఉమాను రంగంలోకి దింపి..జేసీని బుజ్జగించారు. తన నియోజకవర్గానికి పట్టిసీమ ద్వారా నీటిని అందించాలని జేసీ షరతు పెట్టడంతో ఆగమేఘాలపై ఈ పనిచేశారు. దీనికి రూ.10 కోట్లు అదనంగా వెచ్చించారు. కానీ, తొలుత నీరు పారినా తర్వాత.. నీరు ఆగిపోయింది. దీంతో చంద్రబాబు చేసిన బుజ్జగింపు ప్రయత్నం వల్ల .. ఓట్లు రాలేదు.
అప్పుడూ అంతే…?
ఇక, ఆతర్వాత.. 2019 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి సాంబశివరావుకు టికెట్ ఇవ్వకూడదని.. ఆయన వృద్ధుడు అయిపోయారని.. దీంతో టికెట్ ఇచ్చినా.. గెలిచే అవకాశం లేదని భావించి.. ఈ విషయాన్ని నాన్చారు. దీంతో ఆయన కూడా అసంతృప్తి వెళ్లగక్కారు. 'నాకన్నా గెలిచేవారు ఉంటే.. ఇచ్చుకోండి!' అంటూ.. వైసీపీకి చెందిన మీడియాలో.. ప్రకటనలు గుప్పించారు. వెంటనే అలెర్ట్ అయిన చంద్రబాబు ఆయనను బుజ్జగించే పనిలో పడిపోయి.. వెంటనే నరసారావు పేట టికెట్‌ను ఆయనకు కేటాయించేశారు. ఫలితం ఏమైందో … అందరికీ తెలిసిందే.
దీనివల్ల….?
ఇక, ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నారో.. లేదో.. వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. పదుల సంఖ్యలో సీనియర్లను అక్కడకు పంపించి.. బుజ్జగించే చర్యలు చేపట్టారు. మరి ఇలా బుజ్జగింపుల రాజకీయం చేస్తున్నా.. చంద్రబాబుకు ప్లస్‌లుపడడం లేదుకదా? అనేది విశ్లేషకుల మాట. అటు జేసీ వర్గం, ఇటు రాయపాటి వర్గాలు పార్టీకి దూరంగా ఉంటున్నాయి. అదేసమయంలో ఇలాంటి బుజ్జగింపు రాజకీయాల వల్ల మరింత మంది మనం అలిగితే.. చంద్రబాబు లైన్‌లోకి వస్తారు! అనే సంకేతాలు పంపినట్టు అవుతుంది కదా? అనేది వీరి ప్రశ్న.
ఎన్నాళ్లు ఇలా?
అదే వైసీపీ అయితే.. పార్టీలో సిద్ధాంతాలకు.. అధినేత నిర్ణయాలకు ఎదురు తిరిగిన వారిని పట్టించుకునే పరిస్థితి లేకుండా ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. సో.. ఇప్పటికైనా చంద్రబాబు బుజ్జగింపు రాజకీయాలపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తారో ? చూడాలి.