పరమ శత్రువు బాబేనట…?

అదేంటో ఎంత ఆశపడి ఆరాటపడుతున్నా అది అందని పండే అవుతోంది. అంతే కాదు ఇక జన్మలోనే మన బంధం వద్దు, అది రద్దు అంతే అంటున్నారు. ఎన్నికల్లో [more]

;

Update: 2021-01-30 14:30 GMT

అదేంటో ఎంత ఆశపడి ఆరాటపడుతున్నా అది అందని పండే అవుతోంది. అంతే కాదు ఇక జన్మలోనే మన బంధం వద్దు, అది రద్దు అంతే అంటున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడి రెండేళ్ళు గడుస్తున్నా తానేం తప్పు చేశానో ఇప్పటికీ అర్ధం కాని చంద్రబాబుకు బీజేపీ విషయంలో ఏ పొరపాట్లు చేశారో అదైనా అర్ధమవుతుందా. కానీ ఒకటి మాత్రం చంద్రబాబుకు క్లారిటీగా తెలుస్తోంది. ఈ బీజేపీ తనతో అసలు కలవదు అని, ఎందుకంటే వారికి ఏపీలో అరవీర భయంకర శత్రువు బాబేనటగా మరి.

బాబుతోనా వద్దు…

ఈ మాటలు అన్నది ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్. ఆయన తాజాగా మాట్లాడుతూ ఏపీలో తమకు ఉన్న ఒకే ఒక మిత్రుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని నొక్కి మరీ చెప్పారు. బీజేపీకి ఏపీలో ఎవరితోనూ ఏ బంధాలూ అనుబంధాలు అసలు లేవు, ఉండవు అని కూడా తేల్చేశారు. చంద్రబాబు గురించి మీడియా ఎందుకు అడుగుతుందంటే తాము గతంలో ఆయనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి అన్న వివరణ కూడా ఆయన ఇచ్చారు. అయితే పొరపాటున కానీ గ్రహపాటున కానీ ఏ రకమైన పొత్తులు ఏపీలో ఇకపైన టీడీపీతో అసలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి అంటూ మీడియా ద్వారా పసుపు నేతలకు గట్టి సందేశాన్నే సునీల్ వినిపించేశారు.

జగన్ కూడా కానీ….

మరి ఈ కానీలు, కామాలే రాజకీయాల్లో ఎన్నో అర్ధాలు పరమార్ధాలు చెబుతాయి. ఏపీలో జగన్ కూడా మాకు శత్రువే కానీ అంటూనే సునీల్ చంద్రబాబుని పరమ శత్రువు అని ఒక విశేషణం వాడారు. అంటే ఆయన చాలా ఎక్కువ ప్రమాద‌మైన శత్రువు అని భావిస్తున్నారు అన్న మాట. చంద్రబాబుతో కూడడం అంటే ఏపీలో బీజేపీ ఓడడమే అని మరో బలమైన మాటను కూడా ఆయన వాడేశారు. ఏపీలో మేము కచ్చితంగా అధికారంలోకి వస్తాం, వైసీపీని జనసేనతో కలసిన మా కూటమి ఒక్కటిగానే ఎదుర్కొనే సత్తా కలిగి ఉందని కూడా సునీల్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

జగన్ బాబు పోవాలిట….

ఏపీలో చంద్రబాబు పోవాలి జగన్ రావాలి అన్న నినాదం చాలా బలంగా పనిచేసింది. దాంతో 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇపుడు బీజేపీ కూడా మరో నినాదాన్ని రెడీ చేసి పెట్టుకుంది. అదేంటి అంటే జగన్ బాబూ పోవాలి..సోమూ పవన్ రావాలి. ఇదే నినాదంతో తాము ఎన్నికల్లో దూసుకుపోతామని కూడా సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో సోము వీర్రాజు, సునీల్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారంతా చంద్రబాబు వద్దు అంటున్నారు. కేంద్రంలో కూడా చూస్తే మోడీ షాలు కూడా ఇదే తీరుగా ఉన్నారు. మొత్తానికి కమలం పువ్వు కోసం చంద్రబాబు ఎన్ని నిచ్చెనలు ఎక్కినా కూడా బీజేపీ అందకుండా పోతోంది. మరి బాబు ఇక్కడితో ఆగుతారా. ఇంకా ఆశగా చూస్తారా..?

Tags:    

Similar News