మాజీలకు రాష్ట్రం బెంగ పట్టుకుంది…?

దేవుడి మీద భక్తా లేక ప్రసాదం మీద భక్తి అంటే కచ్చితంగా ప్రసాదం మీదనే అని ఎవరైనా చెప్పాల్సిందే. కానీ ప్రసాదం కోసమైనా కళ్ళు మూసుకుని దేవుడి [more]

;

Update: 2021-01-04 05:00 GMT

దేవుడి మీద భక్తా లేక ప్రసాదం మీద భక్తి అంటే కచ్చితంగా ప్రసాదం మీదనే అని ఎవరైనా చెప్పాల్సిందే. కానీ ప్రసాదం కోసమైనా కళ్ళు మూసుకుని దేవుడి ఎదుట కొంగ జపం చేయక తప్పదు. రాజకీయ నాయకుల తీరు కూడా అంతే. అధికారంలో ఉన్నపుడు సంగతేమో కానీ దిగిపోగానే ఒక్కసారిగా నా రాష్ట్రం నా ప్రజలు అన్న ఆరాటం ఎక్కువైపోతుంది. ఓ వైపు నా స్వర్ణాంధ్రను జగన్ సర్వనాశనం చేస్తున్నాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపుగా ప్రతీ రోజూ గుండెలు బాదుకుంటున్నారు. ఆయనకు సాయం అన్నట్లుగా ఇద్దరు మాజీ మంత్రులు కూడా జగన్ ఏలుబడిలో ఏపీ ఇలాగైతే ఎలా అంటూ దీర్ఘాలు పెడుతూ కొత్త రాగాలు తీస్తున్నారు.

ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలి …

ఏపీ ఆర్ధిక వ్యవస్థ అన్ని విధాలుగా భ్రష్టు పట్టింది, ఖజానా ఖాళీ కావడం కాదు, పూర్తిగా చిల్లు పడిపోయింది. గోకి గోకి దానికి పెద్ద కన్నమే పెట్టేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పను చేసేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి తరం కాదు అంటున్నారు మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. అక్కడికి టీడీపీ హయాంలో ఏపీ ఖజానా కాసులతో కళకళలాడినట్లుగా కలరింగు ఇచ్చేస్తున్నారు యనమల. ఏపీలో లక్షల కోట్ల మేర అప్పులు చేస్తున్నారు. దీనికి అడ్డూ అదుపూ ఉందా అంటూ కస్సుమంటున్నారు. కేంద్రం అర్జంటుగా ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రకటించాలి అని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

లా అండ్ ఆర్డర్ పూర్ ….

ఈ మాటలు అంటున్నది చంద్రబాబు హయాంలో హోం శాఖను నిర్వహించిన చిన రాజప్ప. ఏపీలో శాంతి భద్రలు ప్రశ్నార్ధకం అయ్యాయట. ఎటు చూసినా దౌర్జన్యాలు, దోపిడీలేనట. ఏపీలో జనం భద్రత లేక బెంబేలెత్తిపోతున్నారుట. ఇక విపక్షాలను అయితే బెదిరించి భయపెట్టేస్తున్నారుట. ఈ రకమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదని చినరాజప్ప తెగ పరేషాన్ అవుతున్నారు. ఏపీని గాడిన పెట్టడం జగన్ కి అసలు చేతకావడం లేదంటూ ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

బాబుకు వంతగా ….

ఇప్పటిదాకా ఏపీలో ఏం జరిగినా చంద్రబాబే గొంతు చించుకునేవారు. ఆయనే జగన్ ని గట్టిగా విమర్శించేవారు. ఇపుడు చంద్రబాబు కొత్త ప్లాన్ అమలు చేస్తున్నాట్లుగా కనిపిస్తోంది. గతంలో కీలక శాఖలు నిర్వహించిన మంత్రులను ఇపుడు రంగంలోకి దించుతున్నారు. అది కూడా రాజకీయ చైతన్యానికి మారు పేరుగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారనుకోవాలి. లేకపోతే ఉన్నట్లుంది ఇలా మాజీ మంత్రులు రాష్ట్రం గురించి ఇంత బెంగెట్టేసుకోవడం అంటే బాబు గారి అచ్చమైన డైరెక్షనే ఇది అంటున్నారు. మరి చంద్రబాబు ఎంత బురద జల్లినా రాని రియాక్షన్ మాజీ మంత్రులు పంచులు వేస్తే వస్తుందా. ఏమో ఏదో ఒక రాయి వేస్తే తప్పులేదుగా.

Tags:    

Similar News